ఎంతో
సంబరంగా జరుపుకునే వెలుగుల పండుగ దీపావళికి ధరాఘాతం తగిలింది. పండుగకు
ప్రత్యేక శోభ కలిగించే టపాసులు ప్రియంగా మారాయి. టపాసుల ధరలు తారాజువ్వలా
పెరగటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూసిస్తున్నాయి. దాంతో
కాల్చకుండానే టపాసులు పేలుతున్నాయి. సుమారు వెయ్యిరూపాయలు చెల్లిస్తేగానీ
బాణాసంచా దుకాణాల్లోకి వెళ్ళలేని పరిస్థితి. ఈ ప్రభావం వ్యాపారాలపైనా
పడింది.

గత ఏడాదికన్నా ఈ ఏడాది పటాసుల ధర సుమారు 40 శాతం పెరిగింది. దీంతో
విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీపావళికి రెండు రోజుల ముందు నుంచే
టపాసుల విక్రయాలు మొదలయ్యేవి. దీపావళికి ముందు సుమారు 60 శాతం వరకు బాణసంచా
అమ్ముడయ్యేది.
ప్రస్తుతం హైదరాబాద్ నగర మార్కెట్లో రూ.10
మొదలుకొని రూ.16వేల విలువైన వివిధ రకాల బాణాసంచా పేలుడు సామగ్రి అందుబాటులో
ఉంది. పదిరోజుల క్రితమే బాణాసంచా హోల్‌సేల్ దుకాణాలు తెరచినా విక్రయాలు
ఇంకా ఊపందుకోక పోవడం వారిలో ఆందోళనను మరింత పెంచుతోంది. పండుగకు ఒక్కరోజే
సమయమున్నా దుకాణాలు వెలవెలబోతున్నాయి.
గత ఏడాది దీపావళికి రెండు
రోజుల ముందే సందడి మొదలుకాగా ఈ ఏడు అంతంత మాత్రంగా ఉంది. ఏటా పిల్లలకు
సుమారు వెయ్యి రెండు వేలు వరకు టపాసులు కొని ఇచ్చే తల్లిదండ్రులు వారికి
సర్దిచెప్పి 500 నుంచి వెయ్యి లోపే కొనుగోలు చేస్తున్నారు. విడిగా బాణసంచా
కొనుగోలు చేసేకన్నా అన్నీ కలిపి ఉండే గిఫ్ట్‌బాక్స్‌లను పలువురు కొనుగోలు
చేసేవారు.

గిఫ్ట్‌బాక్స్‌ల ధర విపరీతంగా పెరగడంతో వాటి గిరాకీ తగ్గింది. గత ఏడాది
గిఫ్ట్‌బాక్స్ రూ. 200 నుంచి రూ. 1200ల వరకు ఉండేది. ఈసారి వీటి ధర రూ. 350
నుంచిరూ. 2500 వరకు పెరగడంతో కొనుగోలుదార్లు కరువయ్యారు. దీంతో టపాసుల
దుకాణాల్లో గిఫ్ట్‌బాక్స్‌లు కుప్పలుగా కనిపిస్తున్నాయి.
మరోవైపు
వ్యాపారస్తులు సిండికేట్ గా మారి బాణసంచా ధరలను పెంచేశారు. గత ఏడాది కన్నా
రెట్టింపు ధరలతో విక్రయిస్తుండటంతో పేద, మధ్య తరగతి ప్రజల జేబులకు చిల్లులు
పడుతున్నాయి. బాణసంచా కొనేందుకు ఉత్సాహంగా వచ్చిన పిల్లలు, పెద్దలు ధరలను
చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. టపాసులు కొనాలంటే జనం భయపడిపోతున్నారు.
విపరీతంగా
పెరిగిన ధరలు, పండగ ఆనందాన్ని దూరం చేస్తున్నాయి. దీంతో దీపావళి పండుగ కళ
తప్పుతోంది. 'చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళీ' అనేది ఒకప్పటి
నానుడిగా మారిపోయింది. ప్రకృతి... ప్రమాదాలు... పన్ను భారం... వెరసి ఈసారి
బాణాసంచా వ్యాపారులకు, వినియోగదారులకు చీకటినే పంచుతోంది. ధరలు ఇలాగే
పెరిగితే ... భవిష్యత్తులో జనాలు.... పండగ దండగ అనుకునే రోజులు వచ్చినా
ఆశ్చర్యపోవల్సిన పనిలేదు.