Wednesday, November 7, 2012

టీవీ కన్నా స్మార్ట్ ఫోనే ముద్దు!

భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ల జోరు పెరుగుతోందని గూగుల్ -ఐపీసాస్ సంయుక్త సర్వేలో తేలింది. మొత్తం 40 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. వినోదం విషయమై టీవీల కన్నా స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే భారతీయుల సంఖ్య అధికంగా ఉందంటున్న ఈ సర్వే వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు....


టీవీలు చూసే సమయాన్ని స్మార్ట్‌ఫోన్‌ల వినియోగానికి వెచ్చించే వ్యక్తులు అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీల్లో 27 శాతంగా ఉండగా, భారత్‌లో ఈ సంఖ్య 49 శాతంగా ఉంది.

స్మార్ట్‌ఫోన్లలో ఉండే ఫీచర్లు, ఉన్నతమైన నాణ్యత గల వీడియో కంటెంట్, విస్తృతమైన ఆప్స్ కారణంగా భారతీయులు టీవీ కంటే స్మార్ట్‌ఫోన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

టీవీ కంటే కూడా స్మార్ట్‌ఫోన్ల ద్వారానే మరింత వినోదాన్ని పొందవచ్చని 56 శాతం మంది భారతీయులు భావిస్తున్నారు. ఇలా భావించే భారత మహిళల సంఖ్య 58 శాతంగా ఉంది. ఇక టీవీ కంటే స్మార్ట్‌ఫోన్ల ద్వారా మరింత వినోదాన్ని పొందవచ్చని భావించేవారి సంఖ్య అమెరికాలో 21 శాతం ఇంగ్లాండ్‌లో 18 శాతంగా ఉంది.
భారత మహిళలు స్మార్ట్‌ఫోన్లను కేవలం వినోదానికే వినియోగించడం లేదు. సోషల్ నెట్‌వర్క్ ద్వారా మిత్రులను కలవడం, ఆన్‌లైన్ షాపింగ్ తదితర సమాచారం కోసం వినియోగిస్తున్నారు.



స్మార్ట్‌ఫోన్ల ధరలు అందుబాటులోకి రావడం కూడా భారత్‌లో ఈ ఫోన్‌ల వినియోగం పెరగడానికి ముఖ్య కారణమని గూగుల్ ఇండియా కంట్రీ హెడ్(ఇండియా ప్రోడక్ట్స్) లలితేష్ కాట్రగడ్డ చెప్పారు.