Monday, November 5, 2012

పసిడి... దీపావళి హ్యాట్రిక్!

పసిడి... దీపావళి హ్యాట్రిక్!
11/5/2012
వరుసగా మూడో ఏడాదీ స్టాక్‌మార్కెట్‌ను మించి లాభాలు
గత దీపావళి నుంచి 15 శాతం పెరిగిన ధర...
మూడేళ్ల కాలంలో 92 శాతం అప్...


న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు ‘కనక’వర్షం కురుస్తోంది. బంగారంపై పెట్టుబడులు పెట్టిన వారికి ఏటికేడు సిరుల పంట పండుతోంది. గడిచిన మూడేళ్ల కాలంలో దీపావళి నుంచి దీపావళికి చూస్తే... పసిడి ధర హాట్రిక్ లాభాలతో దూసుకెళ్తోంది. స్టాక్ మార్కెట్ల కంటే బంగారమే మెరుగైన రాబడులను అందిస్తుండటంతో ఈ ఇన్వెస్టర్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. 2011 దీపావళి నాటికి రూ.26,700 స్థాయిలో ఉన్న పుత్తడి రేటు(10 గ్రాములు)... ఇప్పుడు 15 శాతం ఎగబాకి... రూ.30,700 స్థాయికి చేరింది.

అదే స్టాక్ మార్కెట్లకు ప్రామాణిక సూచీ అయిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ను తీసుకుంటే 17,300 పాయింట్ల నుంచి 18,755 పాయింట్లకు మాత్రమే పెరిగింది. సెన్సెక్స్ కూడా సానుకూల రాబడులనే అందించినప్పటికీ... ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి సాంప్రదాయ పెట్టుబడి సాధనాల మాదిరిగా 8.5 శాతం మేర లాభాలనే అందించడం గమనార్హం. గత దీపావళినాడు రూ.10 లక్షలను బంగారంపై పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల సొమ్ము... ఇప్పుడు దాదాపు రూ.11.5 లక్షలు అయినట్లు లెక్క. ఇంకా దీపావళి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందనేది మార్కెట్ వర్గాల అంచనా. అదే... స్టాక్‌మార్కెట్లో సెన్సెక్స్ ప్రకారం చూస్తే రూ.10 లక్షల పెట్టుబడి ప్రస్తుతం రూ.10.85 లక్షలకు మాత్రమే పెరిగినట్లు చెప్పుకోవచ్చు.

స్వర్ణం కొత్త రికార్డులకు...
భారతీయులు స్వర్ణంపై పెట్టుబడుల విషయంలో వెనకాడటం లేదని... ఇది ఇలాగే కొనసాగుతుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ బంగారం కొనుగోలు అనేది ఒక సంస్కృతి. అక్షయ తృతీయ, ధన్‌తేరస్, దీపావళి వంటి శుభదినాల్లో పసిడి కొనుగోలు చేస్తే మంచిదనే సాంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. రేటు భారీగా పెరిగినప్పటికీ... భవిష్యత్తులో కూడా బంగారం ధర కొత్త శిఖరాలను తాకుతూనే ఉంటుందనే భావనలోనే అత్యధిక శాతం మంది ప్రజలు ఉన్నారనేది పరిశీలకుల విశ్లేషణ. మరోపక్క, స్టాక్స్‌లో పెట్టుబడి అత్యంత రిస్క్‌తో కూడుకున్నదే కాకుండా... ఇంకా మన దేశంలో స్టాక్‌మార్కెట్ సంస్కృతి అంతంతమాత్రంగానే ఉండటంతో పసిడి అత్యంత అనువైన పెట్టుబడి సాధనంగా అలరారుతోంది. ఏటా భారతీయులు 15 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 80 వేల కోట్లు) విలువచేసే బంగారు కడ్డీలు, నాణేలు కొనుగోలు చేస్తారని అంచనా. రమారమి ఇది 270 టన్నులకు సమానం. కాగా, వచ్చే వారంలో 11న ధన్‌తేరస్, 13న దీపావళి ఉండటంతో బంగారం కొనుగోళ్ల గిరాకీ దూసుకెళ్తుందని, ఇప్పటిదాకా ఉన్న రూ.32,000 రికార్డును కూడా బద్దలుకొట్టి రేటు కొత్త ఆల్‌టైమ్ గరిష్టాలను తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా.

పుత్తడి పరుగేపరుగు...
దీపావళి రోజు నుంచి లెక్కలేస్తే... గత మూడేళ్లలో పసిడి వార్షిక ప్రాతిపదిక పగ్గాల్లేకుండా పరుగులు తీస్తోంది. 2009 దీపావళి నాటికి రూ. 16,000 స్థాయిలో ఉన్న బంగారం రేటు 2010 దీపావళికి రూ. 21,100 స్థాయికి ఎగబాకింది. అంటే దాదాపు 32 శాతం మేర ఎగసింది. ఇక 2010 దీపావళి నుంచి 2011 దీపావళి వరకూ చూస్తే... 27 శాతం పెరిగింది. అదే సెన్సెక్స్ విషయానికొస్తే... 2009 నుంచి 2010 దీపావళికి 21 శాతం పెరగగా... 2010 నుంచి 2011 నాటికి 17 శాతం పైగానే పడిపోవడం గమనార్హం. ఇక 2009 నుంచి ఇప్పటిదాకా మూడేళ్ల వ్యవధికి చూసినా సరే పసిడి 92% మేర పరుగులు తీసింది. ఇదే కాలంలో సెన్సెక్స్ 17,300 స్థాయి నుంచి 18,755 పాయింట్లకు(ప్రస్తుతం) పెరిగింది. అంటే కేవలం 8% మాత్రమే వృద్ది చెందింది. అంతకుముందు 2007-08 మధ్య స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సంపద సగానికి పైనే ఆవిరైపోయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో బంగారం మాత్రం 11% రాబడులను అందించింది. ఇలా ఏవిధంగా చూసుకున్నా... లాభాలందించడంలో, సురక్షితమైన పెట్టుబడి సాధనంగానూ స్టాక్‌మార్కెట్ కంటే అత్యంత మెరుగైనదిగా పసిడి కాంతులీనుతోంది.

Courtesy : Sakshi