Monday, November 12, 2012

గోల్డ్ రష్ @ ధన్‌తేరాస్

గోల్డ్ రష్ @ ధన్‌తేరాస్

* ఈటీఎఫ్‌లలో రికార్డు స్థాయి లావాదేవీలు
* చేతులు మారిన 4,441 కేజీల బంగారం
* దీని విలువ రూ.1,337 కోట్లు
* రాష్ట్రంలో రూ. 500 కోట్ల పసిడి విక్రయాలు జరుగుతాయని అంచనా
* దేశవ్యాప్తంగా అమ్మకాలు 30 శాతం అప్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈసారి ధన్‌తేరాస్ సందర్భంగా నేరుగా బంగారం కంటే పేపర్‌గోల్డ్‌పైనే దృష్టిసారించారు. గత సంవత్సరంతో పోలిస్తే దేశవ్యాప్తంగా గోల్డ్ ఈటీఎఫ్ లావాదేవీల్లో 110% వృద్ధి నమోదైతే, రాష్ట్రంలో బంగారం అమ్మకాల్లో స్వల్పంగా వృద్ధి నమోదయినట్లు తెలుస్తోంది. ఇంత వరకు ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజులో రూ.1,337 కోట్ల లావాదేవీలు గోల్డ్ ఈటీఎఫ్‌లలో నమోదైనట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రకటించింది. ధన్‌తేరాస్ సందర్భంగా ఆదివారం ప్రత్యేకంగా ట్రేడింగ్ నిర్వహించగా రికార్డు స్థాయిలో లావాదేవీలు జరిగాయి.

గత సంవత్సరం ధన్‌తేరాస్ నాడు ఎన్‌ఎస్‌ఈలో రూ. 636 కోట్ల లావాదేవీలు జరగ్గా ఈసారి 110 శాతం పెరిగి రూ. 1,137 కోట్లకు చేరింది. అదే పరిమాణం పరంగా చూస్తే గత సంవత్సరం కంటే 81 శాతం అధికంగా 4,441 కేజీల బంగారం చేతులు మారినట్లు ఎన్‌ఎస్‌ఈ తెలియచేసింది. మొత్తం 70,440 మంది ఈ ప్రత్యేక ట్రేడింగ్‌లో పాల్గొన్నారు. ఈ సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో (జనవరి-జూలై) సగటున రూ.1,195 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2011-12 నాటికి రూ.23,039 కోట్ల విలువైన బంగారం ఈటీఎఫ్‌ల ద్వారా ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుతం 14 మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈటీఎఫ్‌లను అందిస్తున్నాయి.

రాష్ట్రంలో రూ.500 కోట్ల లావాదేవీలు
ఉత్తరాది రాష్ట్రాలో బాగా ప్రాచుర్యం పొందిన ధన్‌తేరాస్ ఇప్పుడిప్పుడే దక్షిణాది రాష్ట్రాల్లోకి విస్తరిస్తోంది. గత సంవత్సరం ఈ పర్వదినం నాడు రాష్ట్రంలో రూ.300 కోట్లు జరగ్గా అది ఈ సంవత్సరం రూ.500 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు రాష్ట్ర బులియన్ వర్తకులు పేర్కొంటున్నారు. మన రాష్ట్రంలో అక్షయ తృతీయ నాడు బంగారం అమ్మకాలు బాగా జరుగుతాయని, అప్పుడు జరిగిన అమ్మకాల్లో ధన్‌తేరాస్ నాడు కేవలం 30 శాతం కూడా జరగవని సీఎంఆర్ డెరైక్టర్ రామారావు పేర్కొన్నారు.

ఈ సారి ఒకటి రెండు పెద్ద షాపుల్లో మినహా మిగలిన వాటిల్లో అమ్మకాలు నీరసించాయని, దీనికి ప్రధాన కారణం గోల్డ్ ఈటీఎఫ్‌లకు తోడు పెరిగిన బంగారం ధరలు దోహదం చేశాయన్నారు. అప్పుడే అమ్మకాలు ఎంత జరిగాయో చెప్పలేం కానీ గత సంవత్సరం జరిగిన అమ్మకాల్లో 70 శాతం జరిగితే చాలు అనుకుంటున్నట్లు జంటనగరాల బులియన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సతీష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఫిజికల్ గోల్డ్ కంటే ఈటీఎఫ్‌లలో పన్నులు తక్కువగా ఉండటంతో ఈ పర్వదినాల్లో బంగారం కొనాలనుకునే వారు పేపర్ గోల్డ్‌కు మొగ్గు చూపడం కూడా అమ్మకాలపై ప్రభావం చూపుతోందని రామారావు తెలిపారు.

‘ధన్‌తేరాస్ సందర్భంగా బంగారాన్ని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఉత్సాహాన్ని చూపించారు. ముఖ్యంగా చిన్న చిన్న ఆభరణాలకే మొగ్గు చూపారు. బంగారం ధర పెరగడం, తుపాను ప్రభావమే దీనికి కారణంగా కనపడుతోంది. దుకాణాల్లోకి వచ్చే వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే ఏమాత్రం తగ్గలేదు. ఆర్‌ఎస్ బ్రదర్స్ గ్రూపుకు చెందిన జువెల్లరీ షాపుల న్నింటిలో కలిపి 50 కేజీల దాకా బంగారం అమ్ముడైంది. ఇక మొత్తం మీద హైదరాబాద్‌లో ఇది సుమారు 300 కేజీలు ఉండొచ్చని అంచనా. గతేడాది ధంతేరాస్‌కు 400 కేజీల బంగారం విక్రయాలు జరిగాయి’ అని ఆర్‌ఎస్ బ్రదర్స్ జువెల్లర్స్ జీఎం టి.భద్రీనారాయణ చెప్పారు.

తగ్గని డిమాండ్...
ధన్‌తేరాస్ సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు 30% పుంజుకున్నట్లు ముంబై, ఢిల్లీ మార్కెట్ వర్గాలు తెలిపాయి. ధరలు అధిక స్థాయిలో ఉన్నప్పటికీ పెళ్లి ఆభరణాల డిమాండ్ కారణంగా అమ్మకాలు 30%మేర పుంజుకున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై తదితర మార్కెట్లలో పసిడి ధరలు 10 గ్రాములు రూ. 32,000 సమీపంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత అధిక ధరల నేపథ్యంలో ధన్‌తేరాస్ అమ్మకాల పట్ల అంత ఆశాజనకంగా లేమని పీసీ జువెల్లర్స్ ఎండీ బలరామ్ గార్గ్ చెప్పారు. అయితే తమ అంచనాలను మించుతూ 30% అమ్మకాలు నమోదుకావడం విశేషమని వ్యాఖ్యానించారు. ఇందుకు ప్రధానంగా పెళ్లిళ్ల కోసం కొనుగోలు చేసే ఆభరణాల అమ్మకాలు దోహదపడ్డాయనితెలిపారు.

పీసీ జువెల్లర్స్ దేశవ్యాప్తంగా 30 షోరూములను నిర్వహిస్తోంది. ఇక పీపీ జువెల్లర్స్ డెరైక్టర్ పవన్ గుప్తా సైతం ధన్‌తేరాస్ అమ్మకాలపట్ల ఇదే విధంగా స్పందించారు. గరిష్ట స్థాయికి చేరిన ప్రస్తుత ధరల్లోనూ పసిడికి డిమాండ్ కొనసాగిందని తెలిపారు. వెరసి ఈ ధన్‌తేరస్‌కు జువెలరీ అమ్మకాలు 25-30% వరకూ పెరగవచ్చునని అంచనా వేస్తున్నామని చెప్పారు. ధన్‌తేరాస్‌గా పిలిచే ధనత్రయోదశి రోజున శుభసూచకంగా పసిడి కొనుగోలుకి వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తుండటం విదితమే. ఈ ధన్‌తేరస్‌కు వినియోగదారులు బంగారం, వెండి కాయిన్లకంటే ఆభరణాల కొనుగోళ్లకే మొగ్గుచూపారని మరికొంతమంది రిటైలర్లు చెప్పారు.

సోమవారం మధ్యాహ్నం వరకూ...
ఈ ఏడాది ధన్‌తేరాస్ రోజున అంచనాలకుమించి డిమాండ్ పుంజుకున్నదని ముంబైలోని యూటీ జవేరీ రిటైల్ చైన్ అధిపతి కుమార్ జైన్ చెప్పారు. అమ్మకాల పరిమాణంలో 25-30% మధ్య వృద్ధి నమోదుకావచ్చునని చెప్పారు. ముంబై జువెల్లర్స్ అసోసియేషన్‌కు జైన్ వైస్‌ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. గతేడాది ధన్‌తేరాస్‌తో పోలిస్తే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కారణంగా ఆభరణాలకు భారీ డిమాండ్ కనిపిస్తున్నదని త్రిభువన్‌దాస్ భీమ్‌జీ జవేరీ మార్కెటింగ్ హెడ్ కిరణ్ దీక్షిత్ చెప్పారు. దీపావళి మర్నాటినుంచే పెళ్లిళ్ల సీజన్ మొదలుకానున్నదని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలవరకూ ధన్‌తేరాస్ కొనసాగనున్నదని, అప్పటివరకూ పుత్తడిలో కొనుగోళ్లు జరుగుతాయని వివరించారు.