Saturday, January 21, 2012

ఆటో మొబైల్ 2011

ఆటో మొబైల్ 2011

ఈ ఏడాది ఆటో మొబైల్ రంగానికి జరిగినంత నష్టం ఏ రంగానికి జరగలేదనే చెప్పాలి. 2011 ఆటో సెక్టార్‌కు చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది. ఓవరాల్‌గా ఆటో సెక్టార్ గత ఏడాదితో పోలిస్తే 5శాతం మేర పడిపోయింది. దేశీయంగా ఆటో రంగం ఎన్నో సవాళ్ళను ఎదుర్కుంది. నవంబర్, డిసెంబర్లలో పరిస్థితి కాస్త మెరుగ్గా కనిపించినా ...అంతకు ముందు మాత్రం సేల్స్ లేక వెలవెల పోయింది. దేశీయంగా మారుతీ సమ్మె ఆటో మొబైల్ రంగాన్ని మరింత దెబ్బతీసింది. ఆర్‌బీఐ గత ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 13సార్లు వడ్డీరేట్లు పెంచడం, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు రూపాయి బలహీనపడటం వంటి అంశాలెన్నో ఆటో రంగాన్ని కుదేలు చేసాయి. నవంబర్, డిసెంబర్లలో పండగ సీజన్ కావడంతో సేల్స్ కాస్త ఆశాజనకంగా ఉన్నా వచ్చే ఏడాది చిన్న కార్ల ధరలు 5వేల నుంచి 25 వేల రూపాయలు దాకా పెరగటం ఖాయంగా కనిపిస్తోందని నిపుణులంటున్నారు.

డాలర్ వాల్యూ ఈ ఏడాది 15 నుంచి 20 వరకూ పెరుగుతూ వచ్చింది. దీంతో ఇంపోర్ట్ కాస్ట్ భారీగా పెరగటంతో ఆటో మొబైల్ రంగానికి చావు దెబ్బతగిలినట్లైంది. ఒక్క మారుతీ కంపెనీకే ప్రొడక్షన్ కాస్ట్ 20 శాతం మేర పెరిగిందంటే డాలర్ తెచ్చిన తంట ఎంతో అర్ధమౌతుంది. దేశీయంగా ఆటో సెక్టార్‌లో అగ్రగామి అయిన మారుతీ 2011లో సుమారు 20శాతం మేర డీగ్రోత్ నమోదు చేసింది. కార్మికుల సమ్మెతో కొన్నాళ్ళు ఫ్యాక్టరీ మూసివేయవలసి రావడం మారుతీకి పెద్ద దెబ్బనే చెప్పాలి.

పెట్రోల్ ధరలు పెరగటం, డీజిల్‌కి డిమాండ్ పెరగటంతో కార్ల కంపెనీలు సీఎన్‌జీ వెహికిల్స్‌పై దృష్టిసారిస్తున్నాయి. నగరాల్లో గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు పెంచితే సీఎన్‌జీ కార్లకు డిమాండ్ పెరిగే అవకాశం లేకపోలేదు.


2011 మిగిల్చిన చేదు అనుభవాన్ని జీర్ణించుకోలేక పోతున్న ఆటో రంగం వచ్చే ఏడాది మరిన్ని సవాళ్ళను ఎదుర్కోబోతోంది. వడ్డీరేట్ల పెరుగుదల, ప్రభుత్వం వచ్చే ఏడాది లైఫ్ టాక్స్‌ను పెంచుతుందనే వార్తలు ఆటో రంగానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.