Saturday, January 21, 2012

పాము నోట ఇన్వెస్టర్

పాము నోట ఇన్వెస్టర్

ఇన్వెస్టర్ల నిరాసక్తత
ఎఫ్ఐఐ నిధుల ఉపసంహరణ
52 వారాల కనిష్ఠ స్థాయిల్లో ఇండెక్స్‌లు
మరో రెండు నెలలు ఇదే పరిస్థితి
2011 సంవత్సరం అంతా స్టాక్ మార్కెట్ రెండడుగులు ముందుకి, నాలుగడుగులు వెనక్కి అన్నట్టుగా నడిచింది. సగటు ఇన్వెస్టర్‌కు పీడకలగా మిగిలిపోయింది. ఇన్వెస్టర్ల సంపద 20 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్న ద్రవ్యోల్బణం, భారీ వడ్డీ రేట్లు, యూరోజోన్ రుణ సంక్షోభం, అంతర్జాతీయ ఆర్థిక అస్థిరతలు స్టాక్ మార్కెట్‌ను కుంగదీశాయి. ప్రధాన ఇండెక్స్‌లన్నీ 52 వారాల కనిష్ఠ స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా వరుస లాభాలతో నడిచిన భారత స్టాక్ మార్కెట్ దేశీయ, విదేశీ పరిణామాల వల్ల ఈ ఏడాది ఇన్వెస్టర్లకు భారీ నష్టాలనే మిగిల్చింది. ఏడాది మొత్తం మీద భారత స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు కరదీపిక అయిన బిఎస్ఇ సెన్సెక్స్ 26 శాతానికి పైగా నష్టపోయింది.

2010 సంవత్సరానికి 20,509.09 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ ఈ ఏడాది డిసెంబర్ 20 నాటికి 5334.01 పాయింట్లు పతనమై (26 శాతం) 15.175.08 పాయింట్ల వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజిలోని 50 షేర్ల నిఫ్టీ అదే రోజుకి 1590.30 పాయింట్లు నష్టపోయి (25.92 శాతం) 4544.20 పాయింట్ల వద్ద ఉంది. ఆ తర్వాత జరిగిన నాలుగు సెషన్లలో ఇండెక్స్‌లు కొంత మేరకు పుంజుకున్నా మంగళ, బుధవారాల్లో ఏర్పడిన రివర్సల్ కారణంగా బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 15,727.85 పాయింట్లు, నిఫ్టీ 4705.80 పాయింట్ల వద్ద కాస్తంత మెరుగైన స్థితిలో ట్రేడవుతున్నాయి.

కాని మార్కెట్‌లో సెంటిమెంట్ స్థూలంగా బలహీనంగానే ఉన్నదని, ఇన్వెస్టర్లు పెట్టుబడుల విషయంలో అప్రమత్త వైఖరి అనుసరిస్తున్నారని విశ్లేషకులంటున్నారు. 2009 సంవత్సరంలో సెన్సెక్స్ సాధించిన 7817.50 పాయింట్ల చారిత్రక రికార్డు లాభానికి (81.03 శాతం) ఇది పూర్తిగా వ్యతిరేక దిశ. 2010 సంవత్సరంలో కూడా సెన్సెక్స్ 3044.28 పాయింట్లు (17.43 శాతం) లాభపడింది. నిఫ్టీ 2009 సంవత్సరంలో 2241.90 పాయింట్లు (75.76 శాతం), 2010 సంవత్సరంలో 933.45 పాయింట్లు (17.95 శాతం) లాభపడింది.

అన్నీ ప్రతికూలతలే... నానాటికీ తీవ్రతరమైన యూరో రుణ సంక్షోభం, అమెరికా రేటింగ్ తగ్గింపు, పశ్చిమాసియా రాజకీయ సంక్షోభం, అంతర్జాతీయ విపణిలో కమోడిటీ ధరలు, దేశీయంగా గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్న ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, రూపాయి పతనం, దిగుమతి బిల్లు పెరగడం, అదుపు తప్పిన విత్తలోటు, భారీ వాణిజ్యలోటు ఇవన్నీ 2011 సంవత్సరంలో స్టాక్ మార్కెట్ పయనాన్ని నిరోధించిన అంశాలే. ఇన్ని ప్రతికూలతల నడుమ భారత మార్కెట్‌పై ఆకర్షణ కోల్పోయిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) డిసెంబర్ 19 నాటికి భారత మార్కెట్ నుంచి 2497.50 కోట్ల రూపాయల మేరకు నిధులు ఉపసంహరించారు. 2010 సంవత్సరంలో ఎఫ్ఐఐ పెట్టుబడులు రికార్డు స్థాయిలో 1,33,266 కోట్ల రూపాయల మేరకున్నాయి. అదే రోజుకి ఎఫ్ఐఐలు దేశీయ రుణపత్రాల్లో 39,637.50 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు.

నష్టాల్లో 12 ఇండెక్స్‌లు సర్వత్రా నెలకొన్న ప్రతికూల వాతావరణంలో 13 సెక్టోరల్ ఇండెక్స్‌ల్లో 12 గత ఏడాదితో పోల్చితే నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇండెక్స్‌లన్నీ 52 వారాల కనిష్ఠ స్థాయిలకు దిగజారాయి. ఒక్క ఎఫ్ఎంసిజి ఇండెక్స్ మాత్రమే 9 శాతం లాభాలతో ట్రేడవుతోంది. గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చే క్రమంలో ఆర్‌బిఐ 19 నెలల కాలంలో 13 సార్లు వడ్డీరేట్లు పెంచడంతో పాటు ప్రభుత్వం, ఆర్‌బిఐ, రేటింగ్ సంస్థలు భారత వృద్ధిరేటు అంచనాలను కుదించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ తీవ్రంగా ప్రభావితం అయింది. వడ్డీరేట్ల పెరుగుదల కారణంగా రుణసేకరణ భారం పెరిగి కార్పొరేట్ లాభదాయకత తగ్గుతుందన్న భయాలతో ఇన్వెస్టర్లు మార్కెట్ పెట్టుబడులకు పూర్తిగా విముఖంగా ఉన్నారు.

దీంతో వడ్డీరేట్ల ప్రభావం అధికంగా ఉండే రియల్టీ, బ్యాంకింగ్, ఆటో ఇండెక్స్‌లు విపరీతంగా దిగజారాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలకు 80 శాతం ఆదాయాన్ని సమకూర్చే అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో మాంద్యం భయాల కారణంగా ఆ రంగానికి చెందిన షేర్లు భారీ నష్టాలు చవి చూశాయి. అయితే రూపాయి విలువ పతనం వారికి కొంత ఊరట ఇచ్చింది. ఆ మేరకు రూపాయి విలువలో మదించే లాభాలు, ఆదాయాలు పెరగడం వారికి కొంత ఉపశమనం కలిగించే అంశం. స్పెక్ట్రమ్ కుంభకోణం టెలికాం స్టాక్‌లను తిరోగమనంలోకి నెట్టింది. మొత్తం మీద డిసెంబర్ 20 నాటికి 52.13 శాతం పతనంతో రియల్టీ ఇండెక్స్ నష్టాల్లో అగ్రస్థానంలో ఉంది. యంత్రపరికరాలు (49.08 శాతం), మెటల్ (47.29 శాతం), పవర్ (41.91 శాతం), పిఎస్‌యు (34.28 శాతం), బ్యాంకెక్స్ (32.92 శాతం) నష్టాల్లో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

నష్టాల్లో భెల్‌కు అగ్రతాంబూలం డిసెంబర్ 20వ తేదీ నాటికి 50.80 శాతం పతనంతో భెల్ స్క్రిప్ సెన్సెక్స్‌లోని 30 షేర్లలో నష్టాల్లో అగ్రస్థానంలో ఉంది. జై ప్రకాష్ (49.34 శాతం), ఎల్ అండ్ టి (50.53 శాతం), ఎస్‌బిఐ (43.69 శాతం), టాటా పవర్ (40.25 శాతం), డిఎల్ఎఫ్ (36.53 శాతం), హిండాల్కో (51.57 శాతం), ఐసిఐసిఐ బ్యాంక్ (43 శాతం), జిందాల్ స్టీల్ (32.80 శాతం), మారుతి సుజుకి (35.64 శాతం), ఆర్ఐఎల్ (32.57 శాతం), స్టెరిలైట్ ఇండస్ట్రీస్ (52.76 శాతం), టాటా మోటార్స్ (33.05 శాతం) టాటా స్టీల్ (49.30 శాతం) భారీ నష్టాలు మూటగట్టుకున్న స్క్రిప్‌లలో ఉన్నాయి. హిందుస్తాన్ యునీలీవర్ (27.09 శాతం), ఐటిసి (14.36 శాతం), బజాజ్ ఆటో (4.08 శాతం) మాత్రం లాభపడ్డాయి.

భవిష్యత్తు అస్థిరమే ప్రస్తుతానికి అంతర్జాతీయంగాను, దేశీయంగాను నెలకొన్న వాతావరణంలో ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణి అనుసరించే సూచనలే అధికంగా ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఫిబ్రవరి చివరిలో బడ్జెట్ వరకు మార్కెట్‌కు చెప్పుకోదగ్గ ఉత్తేజిత అంశాలేవీ ఉండకపోవచ్చునన్నది వారి అభిప్రాయం. అయితే తగ్గిన ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల తగ్గుదలకు సుగమమైన వాతావరణం మాత్రం కొంత సానుకూలించే అంశాలని వారంటున్నారు.