Monday, January 30, 2012

మెట్రో రైల్ ప్రాజెక్ట్ చరిత్ర

మెట్రో రైల్ ప్రాజెక్ట్ చరిత్ర

హైదరాబాద్... దేశంలోనే వేగంగా అభివృద్ది చెందుతున్నటువంటి మహానగరం. దీనికి తగ్గట్టుగానే నగరంలో.. వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో.. గంటలతరబడి అవుతున్న ట్రాఫిక్ జాముల్లో.. వాహనదారులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ఇదేగాక.. రోజురోజుకు రోడ్లపైకి వస్తున్న కొత్త వాహనాలు ట్రాఫిక్ సమస్యను ఇంకా జఠిలం చేస్తున్నాయి. వీటన్నింటికి కొంతవరకు చెక్ పెట్టేందుకే.. ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం.. సిటీలోని వాహనదారుల ఆశలన్నీ.. మెట్రోరైలు ప్రాజెక్టుపైనే ఉన్నాయి. అటువంటి మెట్రో రైల్ ప్రాజెక్టు పుట్టుపూర్వోత్తరాలపై ప్రత్యేక కథనం...

''మెట్రో ప్రాజెక్టు గత చరిత్ర ఏంటి ? ''

ఇక ఈ మెట్రోరైలు ప్రాజెక్టు డిజైన్‌, వ్యయాన్ని ఇప్పటికే నాలుగు సార్లు మార్చారు. 2003లో 2కారిడార్లతో 41కిలోమీటర్లతో డిజైన్‌ను రూపొందించారు. 2006లో దీనిని 19కిలోమీటర్లు పెంచి 3కారిడార్లతో డిజైన్‌ చేశారు. అనంతరం 2007లో మరో 6కిలోమీటర్లు పెంచి మొత్తం 66కిలోమీటర్లతో మెట్రోరైల్‌ ప్రాజెక్టు డిజైన్‌ను రూపొందించారు. ఇక 2008 జులైలో ఇంకో 5కిలోమీటర్లు పెంచి 71.16కిలోమీటర్లతో మూడు కారిడార్లకు తుది రూపకల్పన చేశారు. అయితే.. 2003లో మొదట డిజైన్‌ చేసిన ఈ ప్రాజెక్టు వ్యయం 6వేల 100కోట్లు కాగా.. తుది డిజైన్‌ వరకు 14వేల 132 కోట్లకు చెరుకుంది. ప్రాజెక్టు పూర్తయ్యేలోగా వ్యయం మరో 30శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్ షిఫ్ లో రూపొందుతున్న ప్రాజెక్టు. మొదట... 2008లో మేటాస్ ఇన్ ఫ్రా కన్సార్టియం ఈ ప్రాజెక్టును దక్కించుకొంది. మొత్తం లీజ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా... 30వేల 311 కోట్ల రూపాయలను చెల్లిస్తానంటు ముందుకొచ్చింది. సత్యం కుభకోణం... అంతర్జాతీయంగా వచ్చిన ఆర్థిమాంద్యం కారణంగా ఒప్పందంలో పేర్కొన్నవిధంగా... సరైన సమయంలో ప్రాజెక్టు మొదలుపెట్టలేదు. దీంతో... ప్రభుత్వానికి-మేటాస్ కన్సార్టియానికి జరిగిన ఒప్పందం రద్దయింది. మళ్లీ బిడ్ లను ఆహ్హానించగా... ఎల్ అండ్ టి సంస్థ జులై 2010లో మెట్రోరైలు ప్రాజెక్టు టెండర్లను దక్కించుకొంది.

''మెట్రో రైలు ప్రాజెక్టు ఎందుకు ? తెరపైకి రావడానికి గల కారణాలేంటి ? ''

నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను కొంతవరకు పరిష్కరించడానికి... ప్రభుత్వం మెట్రోరైలు ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ప్రస్తుతం 90లక్షలుగా ఉన్న నగర జనాభా 2021 సంవత్సరానికల్లా ఒకకోటి 36లక్షలకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం 24 లక్షల 50వేల వాహనాలు నగరరోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ఇవేగాక.. బయటి ప్రాంతాలనుంచి రోజూ మరో 6 లక్షలకుపైగా వాహనాలు నగరంలో ప్రవేశిస్తున్నాయి. ఇక.. ఏడాదికి 2లక్షల కొత్తవాహనాలు అదనంగా వచ్చి చేరుతున్నాయి. నగరంలోని వాహనాల గరిష్ట వేగం గంటకు కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే. ఇవికాక బస్సులు, లోకల్‌ట్రైన్ల ద్వారా 32శాతం మంది ప్రయాణిస్తున్నారు. జనాభాకు, వాహనాలకు సరిపడ రోడ్ల విస్తీర్ణం లేనందువల్ల.. గంటలకొద్ది ట్రాఫిక్ జాముల్లో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇదేగాక... వ్యక్తిగత వాహనాల కారణంగా.. నగరంలో అత్యధిక కాలుష్యం ఉత్పత్తి అవుతోంది. దీనికి కొంతవరకు పరిష్కారం దిశగా మెట్రో రైలు ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

"ప్రస్తుత ప్రజారవాణా వ్యవస్థల పరిస్థితి ఏంటి? "

హైదరాబాద్ నగరంలో ప్రజారవాణా వ్యవస్థలో ఏపీఎస్ ఆర్టీసీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు 3వేల బస్సుల ద్వారా 30 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యాలకు చేరవేస్తుంది. మరో రెండువేల బస్సుల కోరతతో ఆర్టీసీ సతమతమౌతున్నా... ప్రభుత్వం పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఎంఎంటిఎస్ మొదటి దశలో ప్రతిరోజు 1లక్షా 20వేలమంది ప్రయాణిస్తున్నారు. రెండోదశ పనులు సంగతి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారాయి. ఒక్క మెట్రో రైలే గాకుండా... బస్ ర్యాపిడ్ ట్రాన్స్ ఫోర్ట్ సిస్టం, ఎంఎంటిఎస్ లు వంటి ప్రత్యాన్మాయ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అనేక స్వచంఛంధ సంస్థలు ప్రభుత్వానికి సూచిస్తున్నాయి.

''ఏ ఏ ప్రాంతాల్లో టెర్మినల్స్, స్టేషన్లు ? ''

నాంపల్లి, సికింద్రాబాద్‌, బేగంపేటలలో రైల్‌ టెర్మినల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. కిలోమీటర్‌కు ఒకటి చొప్పున మెట్రో రైల్‌ స్టేషన్లను నిర్మిస్తారు. ఈ మార్గాల్లోని అన్ని స్టేషన్ల నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్‌సర్వీసులు ఏర్పాటు చేయనున్నారు. మియాపూర్‌, ఇమ్లిబన్‌, ఎంజీబీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చార్మినార్, జూబ్లీబస్‌స్టేషన్‌ల నుంచి మెట్రోరైల్‌ స్టేషన్లకు బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తారు. భరత్‌నగర్, బేగంపేట, ఖైరతాబాద్‌, మలక్‌పేట్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో ఎంఎంటీఎస్‌ రైళ్ల సమయాలకు మెట్రోరైల్‌ను అనుసంధానిస్తారు.

''ఎల్ అండ్ టి కంపెనికి... ప్రభుత్వానికి ఉన్న ఒప్పందం ఏంటి ? ''

మేటాస్ తో ఒప్పందం రద్దయిన తర్వాత... ఎల్ అండ్ టి సంస్థ 14 జూలై 2010 న బిడ్ దక్కించుకోగా... సెప్టంబర్4, 2010న రాష్ట్రప్రభుత్వం, ఎల్ అండ్ టి - హైదరాబాద్ మెట్రా రైల్ ప్రైవేట్ లిమిటెడ్ లు ఒప్పందంపై సంతకాలు చేశాయి. మొత్తం ప్రాజెక్టు వ్యయం 10వేల 132కోట్ల రూపాయలు. నిర్మితకాలంతో కలిపి... మొత్తం లీజు కాలం 35 సంవత్సరాలు. అప్పటికి నిర్మిత సంస్థ ప్రభుత్వాన్ని, ప్రజలను సంతృప్తిపర్చితే... మరో 25ఏళ్ల కాలాన్ని పొడగించేందుకు అవకాశం ఉంది. ప్రాజెక్టు లక్ష్యం... 2014 సంవత్సరం వరకు ప్రతిరోజు 15 లక్షలమంది ప్రయాణికులను.... 2025 నాటికి 22 లక్షల మంది మెట్రో రైల్ ని ఉపయోగించుకోనున్నారు. ఒప్పందంలో... మెట్రో కారిడార్ లో ఉన్న మూడు రూట్లలో మొత్తం 269 ఎకరాలను రియల్ ఎస్టేట్ డెవలెప్ మెంట్ కోసం ఎల్ అండ్ టి సంస్థకు ప్రభుత్వం అప్పగించాలి. ఇందులో మియాపూర్ లో 99 ఎకరాలు, ఫలక్ నుమాలో 17 ఎకరాలు, నాగోల్ లో 99 ఎకారాలతోపాటు... ఇతర ప్రాంతాల్లో ఒకటి, రెండు ఎకరాల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. డిశంబర్ 2010 వరకల్లా... జీహెచ్ఎంసీ ఈ స్థలాన్ని హెచ్.ఎం.ఆర్ కి అందిస్తే... 2011 జనవరిలోనే మెట్రో రైలు పనులు ప్రారంభం కావ్లసి ఉంది.

''ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మెట్రో రైలు నిర్మాణం ? ''

హైదరాబాద్ లో.. మొత్తం మూడు రూట్లలో.. మియాపూర్‌ - ఎల్‌.బి.నగర్‌, జేబీఎస్ - ఫలక్‌నుమా, నాగోల్‌ - శిల్పారామం ల మధ్య కారిడార్ల నిర్మాణం జరుగనుంది. ఈ మూడు ప్రధాన మార్గాల్లో రెండు లేన్లతో.. దాదాపు 71.16 కిలోమీటర్ల మేర ట్రాక్‌ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం మొదటగా 12వేల 132 కోట్ల వ్యయం అంచనా వేయగా.. ఇప్పటికే అదికాస్తా 14వేల 132 కోట్ల రూపాయలుచేరింది. ఇందులో 1980 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. దీనిలో మెట్రోరైల్‌ కోసం సేకరించాల్సిన స్థలాలు, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టపరిహారం అందించేందుకు ఉపయోస్తారు.

((చారిత్రక కట్టడాల పరిస్థితి ))

మియాపూర్‌-ఎల్‌.బి.నగర్‌, జూబ్లీబస్‌స్టేషన్‌-ఫలక్‌నుమా, నాగోల్‌-శిల్పారామం.. ఈ మూడు మార్గాల్లో మెట్రో రైల్ ట్రాక్‌లను నిర్మించునున్నారు. అమీర్‌పేట్, కోఠి, ప్యాట్నీ సెంటర్లలో పెద్దఎత్తులో మెట్రో రైల్వే స్టేషన్ల నిర్మాణం జరుగనుంది. ఖైరతాబాద్ సమీపంలో దాదాపు 51 ఫీట్లు, అమీర్ పేట్ లో 71 ఫీట్లు, ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గర 61 ఫీట్ల ఎత్తులో భారీ ఫిల్లర్స్ తో కూడిన రైల్వే ఫ్లాట్ ఫారాలు రానున్నాయి. మొత్తం 62 ప్లాట్ ఫారమ్స్ లలో... దాదాపు 25 అడుగుల ఎత్తు నుంచి 71 అడుగుల ఎత్తులో... అంటే.. ఐదు నుంచి ఏడంతస్థుల బిల్డింగ్స్ ఎత్తులో రైల్వే ప్లాట్ ఫారాల నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ టెర్మినల్ నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు అభ్యంతరం చెప్తున్నారు.

"గత చరిత్రను తెలిపే చారిత్రక, వారసత్వ కట్టడాల పరిస్థితి ఏంటి ?"

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెట్రో ప్రాజెక్టులన్నీ చారిత్రక కట్టడాల సమీపం నుంచి నిర్మించినప్పటికీ అన్నివిధాలుగా పరిరక్షణ చర్యలు తీసుకున్నారు. కానీ హైదరాబాద్ నగరంలో మాత్రం అటువంటి దాఖలాలేవీ కనిపించడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ వెళ్లేదారిలో హుడా గుర్తించినటువంటి దాదాపు 27 చారిత్రక కట్టడాలకు ప్రమాదం పొంచి ఉందని తాజా సర్వేల్లో వెల్లడైంది. అంతే కాకుండా... మరో 44 చారిత్రక భవనాల గుండా రైలు మార్గం వెళ్తుండడంతో... వాటికి ముప్పు పొంచి ఉందని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఎల్ అండ్ టి సంస్థ - హైదరాబాద్ మెట్రో రైల్ ల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని... అందుకే ప్రాజెక్టులోని అంశాలను బహిర్గతం చేయడంలేదని స్వచ్ఛంధసంస్థలు ఆరోపిస్తున్నాయి.

ఇతర దేశాల మాదిరిగానే.. హైదరాబాద్ లో కూడా.. హెరిటేజ్ కట్టడాలకు దూరంగా మెట్రో మార్గాన్ని తీసుకెళ్లాలని వారసత్వ కట్టడాల ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

(( స్థల సేకరణ, ఇబ్బంధులు ))
హైదరాబాదీల డ్రీమ్‌ ప్రాజెక్ట్ గా చెబుతున్న మెట్రోరైల్‌కు గ్రహణం పట్టింది. అగ్రిమెంట్ జరిగి ఏడాది కావస్తున్నా.. ఇంతవరకు పనులు చేపట్టిన దాఖలాలు కనిపించడంలేదు. నిర్ణీత గడువులోపు భూసేకరణ, రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నిర్మాణసంస్థకు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచంలోనే అతి పొడవైన ఎలివేటెడ్ సిస్టమ్‌తో.. రూపుదిద్దుకుంటున్న ఈ మెట్రోరైల్ ప్రాజెక్ట్‌కు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. నిర్మాణసంస్థ L&Tకి, HMR సంస్థకు మార్చిలోనే ప్రాజెక్ట్ నిర్మాణంపై అవగాహన ఒప్పందం కుదిరింది. దీనిప్రకారం.. 2011 మే 15 లోపు ప్రాజెక్టుకు అవసరమైన 90 శాతం స్థలాలను ఎల్‌ అండ్‌ టి సంస్థకు ప్రభుత్వం అప్పగించాల్సి ఉంది. లేదంటే.. నిర్మాణసంస్థ చెల్లించిన 360 కోట్ల రూపాయల ఫర్ఫార్మెన్స్ సెక్యూరిటీ బ్యాంక్ గ్యారెంటీలో.. ప్రతిరోజూ 1 శాతం జరిమానాను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. మెట్రోరైల్‌ ప్రాజెక్టు నిర్మాణానికి అనుగుణంగా రోడ్లు వెడెల్పు చేయకపోవడం వల్ల రోజూ 36 లక్షల రూపాయలను ఎల్ అండ్ టి సంస్థకు ప్రభుత్వం చెల్లించాలి. అటు స్థలాలను అప్పగించలేనందుకుగానూ.. ప్రతి 500 చదరపు గజాల స్థలానికి రోజుకు వెయ్యి రూపాయల నష్టాన్ని కూడా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని ఒప్పందలో పేర్కొన్నారు. ఈవిధంగా.. ప్రభుత్వం ఎల్‌ అండ్ టి సంస్థకు ఇప్పటివరకు సుమారు 70 కోట్ల రూపాయల భారీ జరిమానాను చెల్లించాల్సి ఉంది.

నగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలైన సుల్తాన్ బజార్, బడీచౌడీలలో.. పెద్దఎత్తున వ్యాపార సముదాయాలు కనుమరుగుకానున్నాయి. మియాపూర్-ఎల్బీ నగర్ ఒకటో నెంబర్ కారిడార్, జేబీఎస్-ఫలక్ నుమా రెండో నెంబర్ కారిడార్ కు ప్రతిబంధకాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రేటర్ టౌన్ ప్లానింగ్ అధికారులు.. భూ సేకరణ చట్టం కింద ఇప్పటికే 1200లకు పైగా ఆస్థులకు నోటీసులు జారీచేసారు. కూల్చివేతలు మాత్రం అంతంతమాత్రంగానే చేపట్టారు. మిగిలిచోట్ల.. నష్టపరిహారం చాలదంటూ, అసలు తమ ఆస్తులను ఇచ్చేదిలేదంటూ.. చాలామంది కోర్టులను ఆశ్రయించారు. దీంతో.. ప్రైవేట్ ప్రాపర్టీస్ కూల్చివేతలు ఒక్కసారిగా నిల్చిపోయాయి.

గడువు దగ్గరపడ్తున్న కొద్దీ.. రోడ్ల విస్తరణ, అవసరమైన స్థలాలు అప్పగించకపోతే.. భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిసినా.. సంబంధిత అధికారుల్లో ఏ మాత్రం చలనం లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

నత్తనడకన మెట్రోరైల్ ప్రాజెక్ట్‌
అడుగడుగునా అడ్డంకులు
పూర్తికాని భూసేకరణ, స్థలాల అప్పగింత
ఇప్పటికీ పూర్తికాని రోడ్ల విస్తరణ పనులు
గడువులోపు అప్పగించకుంటే భారీ జరిమానా
రోజుకు 36 లక్షల ఫెనాల్టీ?
నిర్మాణసంస్థకు 86 కోట్లు బకాయిపడ్డ ప్రభుత్వం
రెండో నెంబర్‌ కారిడార్‌కు ఎక్కువ అడ్డంకులు
కోర్టులను ఆశ్రయించిన బాధితులు
నిలిచిపోయిన ప్రైవేట్ ప్రాపర్టీస్‌ కూల్చివేతలు

ప్రస్తుత మెట్రో ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి?

అన్నీ కుదిరితే.. ఫిబ్రవరి మొదటివారంలో.. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ శంకుస్తాపన పనులు ప్రారంబంకానున్నాయి.

ప్రస్తుతం నాగోల్ - మెట్టుగూడా వరకు 8 కిలోమీటర్ల వరకు.. మియాపూర్ - అమీర్ పేట్ వరకున్న 12 కిలోమీటర్ల వరకు.. మెట్రో పనులు ప్రారంభంకానున్నాయని.. హెచ్ఎంఆర్ వర్గాలంటున్నాయి. ఈ మార్గాల్లో రోడ్ల విస్తీర్ణం 100 ఫీట్లకు మించి ఉన్నాయి. అదీగాక.. రోడ్ల వెంబటి వ్యాపార సముదాయాలు.. ఇల్లు కూడా లేకపోవడంతో.. పనులకు ఎలాంటి అడ్డంకి లేకపోయింది. ఫిబ్రవరి నాలుగో తేదీన.. ప్రధాని మన్మోహన్ సింగ్ చేతులమీదుగా మెట్రో పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మెట్రోరైలు నిర్మాణానికి వీలుగా ఆయా మార్గాల్లో రోడ్డు విస్తరణతోపాటు ఆక్రమణలను తొలగించి.. ఎలాంటి అడ్డంకులు లేని స్థలాన్ని గతేడాది మేలోపే అప్పగించాల్సి ఉంది. ఇంతవరకు పూర్తిస్థాయిల.. స్థలాలను అప్పగించలేదు. ఎల్ అండ్ టి సంస్థకు.. హెచ్ఎంఆర్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. మెట్రో రైలు పట్టలనెక్కే పరిస్థితిలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ప్రాజెక్ట్ బాలారిష్టాలన్నింటిని అధిగమించి.. పట్టాలపైకి వచ్చేదెప్పుడని.. సగటు వాహనదారుడి మదిలో మెదులుతున్న ప్రశ్నలకు ఇటు ప్రభుత్వం.. అటు మెట్రో అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది.