Saturday, January 21, 2012

ఇన్వెస్టర్‌కూ.. కొలవెరి?!

ఇన్వెస్టర్‌కూ.. కొలవెరి?!
‘వై దిస్ కొలవెరి డి’?... ఒక్క భారత్‌లోనే కాదు ప్రపంచం మొత్తాన్నీ ఉర్రూతలూగిస్తున్న సాంగ్. గల్లీ నుంచి ఢిల్లీదాకా ఈ పాటకు వస్తున్న రీమిక్స్‌లు కూడా అంతే పాపులర్ అవుతుండటం విశేషం. ఇప్పుడు స్టాక్‌మార్కెట్‌లోనూ ఈ పాటకు రీమిక్స్‌లు వినబడుతున్నాయి. ఏంటి.. ఆశ్చర్యంగా ఉందా? అవునుమరి.. నిలువునా ముంచేసిన స్టాక్‌మార్కెట్ అంటే ఇన్వెస్టర్లకు ఉండదా కొలవెరి (చంపేయాలనేంత కోపం అని దీని అర్థం). ఇప్పటిదాకా ‘యూట్యూబ్’లో కొలవెరి పాటకు 2 కోట్ల హిట్లు(వీక్షణలు) వచ్చినట్లు అంచనా. మరి మార్కెట్లో అయితే ఈ ఏడాది ఇన్వెస్టర్లు కోల్పోయిన సంపద అక్షరాలా రూ. 20 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటోంది. ఇప్పుడు అర్థమైందా మార్కెట్‌ను కుప్పకూల్చిన ‘బేర్స్’ అంటే ఎందుకు అంత కొలవెరో? అందుకే భారతీయ ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలోనే అత్యంత పాపులర్ చార్ట్‌బస్టర్‌గా అవతరించిన కొలవెరి సాంగ్... ఈ ఏడాది మార్కెట్‌కు కూడా అనధికారిక ‘బ్లాక్’బస్టర్‌గా మారిపోయింది!

ప్రస్తుత డౌన్‌ట్రెండ్‌పై
మార్కెట్ వర్గాల కొలవెరి రీమిక్స్ ఇదీ...
‘వైటు స్కిన్నూ... బేరూ, బేరూ;
బేరు హార్టూ బ్లాకూ...
బుల్లు-బేరూ ఫైటూ, ఫైటూ...
అవర్ ఫ్యూచరు డార్కూ?
వై దిస్ కొలవెరి కొలవెరి కొలవెరి డి!’

ముంబై: మరికొద్ది రోజుల్లో గుడ్‌బై చెప్పనున్న 2011... దలాల్ స్ట్రీట్‌కు మరో దారుణ సంవత్సరంగా మిగిలిపోతోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా జరిగిన ట్రేడింగ్‌లో ప్రతి 10 సెకండ్లకూ మిలియన్ డాలర్ల(దాదాపు రూ.5 కోట్లు- గంటకు సుమారు రూ.1,800 కోట్లు) మేర ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోవడమే ఇందుకు నిదర్శనం. ఇంకా అయిదు రోజుల ట్రేడింగ్ మిగిలివున్న నేపథ్యంలో... ఇంకెంత సొమ్ము ఆవిరవుతుందో వేచిచూడాలి. గతేడాదిలో అయితే, ప్రతి 20 ట్రేడింగ్ సెకండ్లకూ ఇన్వెస్టర్ల సంపద మిలియన్ డాలర్లు ఎగబాకడం గమనార్హం. కాగా, 2011లో మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చూస్తే ఇప్పటిదాకా ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.19 లక్షల కోట్లు కోల్పోయినట్లు అంచనా. ప్రస్తుతం మొత్తం మార్కెట్ క్యాప్ రూ.54 లక్షల కోట్లకు తగ్గిపోయింది. 2010 ఏడాది చివరినాటికి లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.73 లక్షల కోట్లు కావడం గమనార్హం. రూపాయి మారకం విలువలో క్షీణత కారణంగా స్టాక్ మార్కెట్ సంపద విలువ ఒకానొక దశలో ట్రిలియన్ డాలర్ల(లక్ష కోట్ల డాలర్లు) మార్క్‌ను కోల్పోయినప్పటికీ.. మళ్లీ గత వారాంతానికి 1.02 ట్రిలియన్ డాలర్లను అందుకోగలిగింది.

సెన్సెక్స్, నిఫ్టీ బోర్లా...
ఈ ఏడాది ప్రారంభం నాటి గరిష్టం నుంచి చూస్తే బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు 24 శాతం మేర కుప్పకూలాయి. క్రితం ఏడాదిలో ఇవే ఇండెక్స్‌లు 18 శాతం లాభాన్ని మూటగట్టుకున్నాయి. ఇక పాయింట్లవారీగా చూస్తే 2011లో ఇప్పటివరకూ సెన్సెక్స్ 4,770 పాయింట్లు పడిపోయింది (డిసెంబర్ 23 ముగింపు 15,739 పాయింట్లు). గతేడాది 2,000 పాయింట్లు ఎగబాకింది. మరోపక్క, రానున్న రోజుల్లో సెన్సెక్స్ 11,000-12,000 పాయింట్ల కనిష్ట స్థాయిలనూ చూడొచ్చని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎందుకీ పతనం...
మార్కెట్లు ఇంత ఘోరంగా పడిపోవడానికి, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినేందుకు అధిక శాతం మంది చెబుతున్న ప్రధాన కారణం ప్రపంచ ఆర్థిక మందగమనమే. మరోపక్క, దేశీయంగా కూడా పాలసీపరమైన నిర్ణయాల్లో ప్రభుత్వ అలసత్వం, వృద్ధిరేటు క్షీణత, పారిశ్రామికోత్పత్తి దారుణంగా దెబ్బతినడం, డాలరుతో రూపాయి మారకం విలువ భారీ క్షీణత(54 ఆల్‌టైమ్ కనిష్టాన్ని తాకడం) కూడా మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే కొందరు నిపుణులు మాత్రం భారత్ స్టాక్ మార్కెట్ ప్రస్తుతం చాలా ఆకర్షణీయంగా కనబడుతోందని అంటున్నారు. 2009లో చాలా స్టాక్స్ వాటి బుక్ వేల్యూ కంటే నాలుగురెట్లకు పైగా ధరకు(అంతక్రితం ఏడాదిల్లో అంతకంటే ఎక్కువే) ట్రేడయితే... ప్రస్తుతం బుక్ వేల్యూకి మూడింతలు తక్కువ ధరకే ట్రేడవుతున్న విషయాన్ని వారు చూపుతున్నారు.

అయితే, ఇప్పుడు ఇన్వెస్టర్లకు ఈ లెక్కలేవీ బుర్రకెక్కడం లేదు. వాళ్లడిగేది ఒక్కటే... మాకు ఇంత ఘోరమైన నష్టాలెందుకు వచ్చాయా అని(కొలవెరి సాంగ్‌లో కూడా సింగర్ కూడా తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను ఇలాగే అడుగుతాడు(మరో అర్థంలో). ‘వై డిడ్ యూ డూ దిస్ టు మి?’ అని) అయితే సమాధానం మాత్రం రెండు చోట్లా ఎండమావే! ఈ సాంగ్ కొన్ని రోజుల క్రితమే యూట్యూబ్‌లో మిలియన్ హిట్‌లు దక్కించుకుంటే... మార్కెట్‌లో ఇన్వెస్టర్లకు మాత్రం ప్రతి 10 ట్రేడింగ్ సెకండ్లకూ మిలియన్ డాలర్లు హుష్‌కాకి అయ్యాయి.