Saturday, January 21, 2012

Busi_Steave Jobs

Busi_Steave Jobs

కొత్త పుంతలు తొక్కిన టెక్నాలజీని ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను తీర్చేవిధంగా మలుస్తూ ఆపిల్ ఉత్పత్తులకు అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించిపెట్టిన ఘనుడు స్టీవ్ జాబ్స్. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఐపాడ్ సృష్టికర్త స్టీవ్‌జాబ్స్ మరణం ఒక్క ఆపిల్ సంస్థకే కాదు యావత్ ప్రపంచానికి తీరని లోటు . 2011 సంవత్సరం స్టీవ్ లేడనే చేదు నిజాన్ని మిగిల్చింది.

ఏ రంగమైన పోటీ ఉంటేనే ఎదుగుతుంది. కంప్యూటర్ యుగం ఊహించని రీతిలో త్వరగా ముందుకు వెళ్ళడానికి ఆ పోటీనే కారణం. అలాంటి పోటీని సృష్టించిన వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది స్టీవ్ జాబ్స్ పేరే. స్టీవ్ జాబ్స్ మరణం ఆపిల్ కంపెనీకే కాదు యావత్ ప్రపంచానికి పెద్ద షాక్ మిగిల్చింది. టెక్నాలజీని మనం ఎంతగా ఉపయోగించుకుంటే అంతగానూ అది రాణిస్తుంది. మన ఆలోచనలను ఎంతగా పరుగులు పెట్టిస్తే అంతగానూ అది దేదీప్యమవుతుందని నిరూపించిన స్టీవ్‌జాబ్స్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో మరణించటం సాంకేతిక రంగానికి తీరని లోటు. తన టెక్నాలజీతో యానిమేషన్ ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేసిన ఘనత జాబ్స్‌కే దక్కుతుంది.

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు గట్టి పోటీ ఇచ్చిన కంపెనీ ఆపిల్ కంపెనీ. సృజనాత్మకతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఆపిల్ చరిత్రలో ఓ కీలక ఘట్టం ముగిసింది. మాక్ కంప్యూటర్స్, ఐపాడ్, ఐఫోన్ల సృష్టికర్త స్టీవ్ జాబ్స్ మరణం ఆపిల్‌కే కాదు యావత్ ప్రపంచానికే షాక్ కలిగించింది. యాపిల్ -4 రిలీజ్, స్టీవ్ మరణం ఒకేరోజు కాకతాళీయంగా జరిగింది.
ఆపిల్ సిఇఒ బాధ్యతల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించిన రెండు నెలలకే స్టీవ్‌ తనువు చాలించారు.

స్టీవ్ జాబ్స్ చిన్నప్పటినుంచీ ఎదో సాధించాలనే తపనతో ఉండే వారు. కొత్తగా వస్తున్న టెక్నాలజీతో ఎలాంటి వండర్స్ క్రియేట్ చెయ్యాలా అనే ఎప్పుడూ ఆలోచించేవారు. ఈ ఇంట్రెస్ట్‌తోనే తన 21వ ఏటే ఇంటి గ్యారేజిలోనే యాపిల్ కంప్యూటర్స్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత బోర్డులో విభేదాల కారణంగా 1985లో కంపెనీ నుంచి బైటికి వచ్చారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ 1997లో కంపెనీకి తిరిగొచ్చారు. స్టీవ్ జాబ్స్ సీఈఓగా యాపిల్ కంపెనీ... సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆధిపత్యానికి గట్టి పోటీనిచ్చింది. ప్రస్తుతం సుమారు 350 బిలియన్ డాలర్ల మార్కెట్‌క్యాపిటల్‌తో ప్రపంచంలోనే రెండో అత్యంత విలువైన కంపెనీగా ఎదిగింది.

చనిపోయే కొద్ది రోజుల ముందు జాబ్స్ తన రాజీనామాను ప్రకటించారు. 'యాపిల్ సీఈవోగా నా బాధ్యతలను నిర్వర్తించలేనప్పుడు ఆ విషయం నేనే స్వయంగా వెల్లడిస్తానని ఎప్పుడో చెప్పాను. దురదృష్టవశాత్తూ ఆ రోజు రానే వచ్చింది' అంటూ తన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. యాపిల్ మరింత ఉజ్వలంగా ఎదగాలని జాబ్స్ ఆకాంక్షించారు. 2003లోనే స్టీవ్ క్యాన్సర్ వ్యాధికి గురయ్యారు. ఆ తర్వాత 2009లో కాలేయ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ఒకవైపు క్యాన్సర్‌తో పోరాటం చేస్తూనే మరోవైపు ఆపిల్ కంపెనీని వృద్ధిరేటులో పరుగులు పెట్టించిన ఘనత స్టీవ్‌కే దక్కుతుంది.

ఎన్నో సంక్షోభాల నడుమ ఎంతో సమర్థవంతంగా, చాకచక్యంగా ఆపిల్‌ బాధ్యతలను నిర్వహించిన జాబ్స్ ఇకపై లేరనే వార్త అటు కంపెనీకి ఇటు కొత్త టెక్నాలజీని ఇష్టపడేవారికి తీరని లోటుని మిగ్చిల్చింది.