Saturday, January 21, 2012

వొడాఫోన్ విజయం

వొడాఫోన్ విజయం


ముంబై హైకోర్టు తీర్పును కొట్టి వేసిన సుప్రీం
దేశం వెలుపల జరిగిన డీల్‌పై పన్ను విధించే అధికారం ఐటి శాఖకు లేదని స్పష్టీకరణ
11 వేల కోట్ల రూపాయల భారీ పన్ను బకాయి కేసులో ఐటి శాఖ వాదన వీగిపోయింది. ఈ కేసులో వొడాఫోన్‌కు అనుకూలంగా వచ్చిన తీర్పు వల్ల ఇదే తరహా డీల్స్‌కు సంబంధించి ఆదాయం పన్ను శాఖ భారీ మొత్తంలో ఆశిస్తున్న రాబడి కూడా గల్లంతయ్యే అవకాశం ఉంది. న్యూఢిల్లీ: వొడాఫోన్-హచీసన్ డీల్‌కు సంబంధించి సుదీర్ఘంగా సాగిన పన్ను బకాయి కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఎట్టకేలకు వొడాఫోన్‌కు అనుకూలంగా వచ్చింది. ఈ డీల్‌కు సంబంధించి ఆదాయం పన్ను శాఖ డిమాండ్ చేస్తున్న 11 వేల కోట్ల రూపాయల బకాయిలు వొడాఫోన్ చెల్లించాల్సిందేనంటూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది. డీల్ కుదుర్చుకున్న రెండు కంపెనీలు హచీసన్-వొడాఫోన్ ఇంటర్‌నేషనల్ హోల్డింగ్స్.. భారత భూభాగం ఆవల ఏర్పాటైన కంపెనీలైనందున ఈ వ్యవహారం ఆదాయం పన్ను శాఖ పరిధిలోకి రాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌హెచ్ కపాడియా సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది. ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ స్వతంతర్ కుమార్, జస్టిస్ రాధాకృష్ణన్ ఉన్నారు. జస్టిస్ రాధాకృష్ణన్ మిగిలిన ఇద్దరు న్యాయమూర్తుల తీర్పుతో ఏకీభవిస్తూ విడిగా తన తీర్పును వెలువరించారు. వొడాఫోన్ జమచేసిన 2500 కోట్ల రూపాయల డిపాజిట్‌ను 4 శాతం వడ్డీతో సహా రెండు నెలల్లో వెనక్కి తిరిగి ఇవ్వాల్సిందిగా ఐటి శాఖను సుప్రీంకోర్టు న్యాయమూర్తు లు ఆదేశించారు. అదే విధంగా కంపెనీ ఇచ్చిన 8500 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీని కూడా నాలుగు వారాల్లో తిరిగి ఇచ్చివేయాల్సిందిగా సుప్రీం కోర్టు రెజిస్ట్రీని న్యాయమూర్తులు ఆదేశించారు. వొడాఫోన్ హర్షం సుప్రీం కోర్టు తీర్పుపై వొడాఫోన్ హర్షం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పు భారతీయ వ్యవస్థపై తమ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుందని వొడాఫోన్ పేర్కొంది. భారతీయ వినియోగదారుల లబ్దికోసం భారత్‌లో తమ ఇన్వెస్ట్‌మెంట్లను మరింత పెంచుతామని, వొడాఫోన్ సిఇఒ విటోరియో కొలో తెలిపారు. తాము మొదటి నుంచి హ చీసన్ - వొడాఫోన్ డీల్‌పై పన్ను విధించే అధికారం భారత్‌కు లేదని చెబుతున్నామని తమ మాటే చివరకు నెగ్గిందని ఆయన చెప్పారు. విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లకు మేలు.. వొడాఫోన్ కేసులో సుప్రీం కోర్టు తీర్పువల్ల విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు పెరిగే అవకాశం ఉందని ఎనలిస్టులు అంటున్నారు. సుప్రీం కోర్టు తీర్పు వల్ల ప్రభుత్వం, తాత్కాలికంగా భారీ రాబడి అవకాశం కోల్పోయేమాట నిజమే అయినా, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఈ పరిణామం సానుకూల సంకేతాలను పంపుతుందని వారు భావిస్తున్నారు. సుదీర్ఘకాలంగా కోర్టులో నానుతు న్న వొడాఫోన్ కేసు, బహుళజాతి కంపెనీల ఇ న్వెస్ట్‌మెంట్స్ విషయంలో అనిశ్చితికి కారణమైననట్టుగా వారు చెబుతున్నారు. ఇలాంటి మరికొన్ని కేసుల్లో కూడా బహుళజాతి కంపెనీలకు ఊరట లభిస్తుందని వారు అంటున్నారు. వొడాఫోన్ తరహాలోనే దేశీయ కం పెనీలకు సంబంధించి విదేశాల్లోనే షేర్లు చేతులు మారిన మరికొన్ని డీల్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఫోస్టర్‌ను ఎబి మిల్లర్ కొ నుగోలు చేయడం, హైదరాబాద్ సంస్థ శాంతా బయోటెక్‌ను సనోఫీ అవెంటీస్ చేజిక్కించుకోవడం, కెయిర్న్ ఇండియాను వేదాంత సొంతం చేసుకోవడం వగైరా ఉన్నాయి. సర్కారు కలవరం వొడాఫోన్ పన్ను బకాయిల కేసులో సుప్రీం కోర్టు తీర్పు ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ప్రభుత్వ రాబడిపై ఈ తీర్పు ప్రభావాన్ని, పర్యవసానాలను అంచనా వేసేందుకు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ శుక్రవారం సమావేశమయ్యారు. కోర్టు తీర్పువల్ల ఒడాఫోన్ కేసులోనే సర్కారుకు 11 వేల కోట్ల రూపాయల రాబడి అవకాశం పోయింది. ఇలాంటివే మరికొన్ని ఇతర కేసుల్లోనూ రావాల్సిన రాబడికి ప్ర భుత్వం నీళ్లు వదులుకోవాల్సి ఉంటుంది. ఇదిలాఉండగా సుప్రీం కోర్టు తీర్పును క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ కూడా 10 మంది నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.


అసలేం జరిగింది?


వొడాఫోన్ పన్ను బకాయి కేసులో చాలా మలుపులు ఉన్నాయి. ప్రస్తుత వొడాఫోన్ గతంలో హచీసన్ - ఎస్సార్ టెలికామ్ పేరుతో ఉండేది. ఈ కంపెనీలో మెజార్టీ వాటాదారుగా ఉన్న హాంకాంగ్ సంస్థ హచీసన్ నుంచి 67 శాతం వాటాను వొడాఫోన్ 2007 మే నెలలో 1,120 కోట్ల డాలర్లతో కొనుగోలు చేసింది. వొడాఫోన్ ఇంటర్‌నేషనల్ హోల్డింగ్స్ ఈ షేర్లను నెదర్లాండ్స్ కేమన్ ఐలాండ్స్‌కు చెందిన తన అనుబంధ కంపెనీల ద్వారా కొనుగోలు చేసింది. భారీ మొత్తం చేతులు మారిన ఈ డీల్‌లో క్యాపిటల్ గెయిన్స్ పన్ను ఎగవేశారన్నది ఐటి శాఖ ఆరోపణ. హచీసన్‌కు డీల్ విలువను చెల్లించేప్పుడే వొడాఫోన్ పన్నును మూలంలో మినహాయించుకుని తమకు చెల్లించకపోవడంపై ఐటి శాఖ కన్నెర్ర చేసింది.

పన్ను, పెనాల్టీలు అంతా కలిపి 11 వేల కోట్ల రూపాయలను కట్టాల్సిందిగా వొడాఫోన్‌కు నోటీసులు జారీ చేసింది. డీల్ భారత్ భూభాగం వెలువల రెండు కంపెనీల మధ్య జరిగిందని దీనితో ఐటి శాఖకు నిమిత్తం లేదని తాము పన్ను చెల్లించాల్సిన అవసరమే లేదని వొడాఫోన్ (ఇండియా) వాదించింది. డీల్ ఎక్కడ జరిగినా, భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీకి సంబంధించిన డీల్ కనుక పన్ను చెల్లించాల్సిందేనని ఐటి శాఖ స్పష్టం చేసింది. డీల్ జరిగింది హచీసన్-వొడాఫోన్ ఇంటర్‌నేషనల్ మ«ధ్యే అయినప్పటికీ వొడాఫోన్ ఇండియాను డిఫాల్డ్ అసెసీగా పరిగణిస్తూ పన్ను బకాయి చెల్లింపునకు ఐటి శాఖ నోటీసు జారీ చేసింది.

అప్పటి నుంచి వరస పరిణామాలు..... 2008 : తమను డిఫాల్ట్ అసెసీగా పరిగణిస్తూ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ నోటీసులను సవాలు చేస్తూ వొడాఫోన్ బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. వొడాఫోన్ అప్పీల్‌ను డిసెంబర్‌లో ముంబై హైకోర్టు కొట్టివేసింది. 2009: బొంబాయి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ జనవరిలో వొడాఫోన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు కూడా వొడాఫోన్ అప్పీల్‌ను కొట్టివేస్తూ, హచీసన్ - వొడాఫోన్ లావాదేవీపై పన్ను వేసే అధికారం ఉందా లేదా తేల్చి చెప్పాలని ఐటి శాఖను ఆదేశించింది. అదే సమయంలో ఐటి శాఖ నిర్ణయం వ్యతిరేకంగా వస్తే అప్పుడు కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని వొడాఫోన్‌కు సలహా ఇచ్చింది.

2010: హెచీసన్-ఎస్సార్ డీల్‌లో పన్ను విధించే పూర్తి అధికారాలు తమకు ఉన్నాయని ఐటి శాఖ స్పష్టం చేసింది. ఈ డీల్‌లో వొడాఫోన్ ఇంటర్‌నేషనల్ హోల్డింగ్ అసలు అసెసీ అయినప్పటికీ వొడాఫోన్‌ను డిఫాల్డ్ అసెసీగా పరిగణిస్తున్నట్టు పేర్కొంటూ మే నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వొడాఫోన్ ముంబై హైకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు వొడాఫోన్ అభ్యంతరాలను తోసిపుచ్చుతు, డీల్ సారం హచీ సన్-ఎస్సార్‌లో యాజమాన్య నియంత్రణ మారడమేననీ, ఈ డీల్‌లో చేతులు మారిన సొమ్ము మూలం భారత్‌లోనే ఉందని సెప్టెంబర్ 8న స్పష్టం చేసింది. దీనిపై వొడాఫోన్ మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లింది.

హైకోర్టు ఉత్తర్వులపై స్టేకు నిరాకరిస్తూ, అసలు వొడాఫోన్ ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుందో లెక్కతేల్చాల్సిందిగా ఐటి శాఖను సెప్టెంబర్ 14న సుప్రీం కోర్టు ఆదేశించింది. ఐటి శాఖ నుంచి సమాచారం అందిన తర్వాత, నవంబర్ 15న కేసు విచారణ ప్రారంభానికి ముందు 2500 కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాలని 8500 కోట్ల రూపాయలకు బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలని వొడాఫోన్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. 2011: ఆగస్టు నుంచి కేసులో విచారణ ప్రారంభమైంది. అక్టోబర్ 19న సుప్రీం కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.