Saturday, January 21, 2012

మైక్రోఫైనాన్స్‌ 2011

మైక్రోఫైనాన్స్‌ 2011

మైక్రోఫైనాన్స్‌ రంగం ఈ ఏడాది గడ్డుపరిస్థితిని ఎదుర్కొంది. ఒకప్పుడు రారాజుగా వెలిగిన మైక్రోఫైనాన్స్‌ కంపెనీలు ఈఏడాది వెలవెలబోయాయి. ఒకవైపు రిజర్వుబ్యాంక్‌ నిబంధనలు, మరోవైపు స్టేట్‌ గవర్నమెంట్‌ కొత్త చట్టం మైక్రో కంపెనీలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో ఇచ్చిన అప్పులు వసూలు చేసుకోవడానికి మైక్రో కంపెనీలు కిందామీద పడుతున్నాయి.

వాయిస్‌ :
మైక్రో ఫైనాన్స్‌. ఒకప్పుడు ఈ రంగం ఎంతో వేగంగా వృద్ధి చెందింది. అయితే ఈ ఏడాది మాత్రం ఈ రంగం ఒక్కసారిగా ఢీలాపడింది. గత ఏడాదితో పోలిస్తే ఈ రంగం వృద్ధి ఏకంగా సగానికి సగం పడిపోయింది. దీనికి కారణం రిజర్వు బ్యాంక్‌ నిబంధనలు, మన రాష్ట్ర ప్రభుత్వ తెచ్చిన కొత్త చట్టమే.

అప్పుల మీద అప్పులు ఇచ్చి దానికి రెండు మూడు రెట్ల వడ్డీలను వసూలు చేస్తారని ఈ రంగ కంపెనీలు ఎంతో అపకీర్తిని మూటగట్టుకున్నాయి. అప్పుల రికవరీ పేరుతో పేదలను నానా ఇబ్బందులకు గురిచేసి ఏకంగా రిజర్వుబ్యాంక్‌ నుంచి... రాష్ట్ర ప్రభుత్వం నుంచి చివాట్లు తిన్నాయి మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలు. అయినా పరిస్థితిలో మార్పు లేదు.

దీంతో ఈ కంపెనీల ఆగడాలను అరికట్టడానికి ఒకదశలో రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది. మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలకు జనం నుంచి వ్యతిరేకత ఎదురవడంతో మన రాష్ట్రప్రభుత్వం మైక్రోఫైనాన్స్‌పై కొత్త చట్టాన్ని తెచ్చింది. అలాగే రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా కొత్త నిబంధనలను విధించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో తాము ఇచ్చిన అప్పులు వసూలు అవుతాయో లేదనే భయం మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలకు పట్టుకుంది. ఈ ఏడాది ఇచ్చిన అప్పుల్లో 20 శాతం కూడా రికవరీ కాకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌పై ఆశలు వదులుకొని పక్క రాష్ట్రాలపై దృష్టి సారించాయి.

మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలు ప్రస్తుతం భారీ నష్టాల్లో ఉండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇతర రంగాల్లోకి ప్రవేశించడానికి పైలెట్‌ ప్రాజెక్టులను చేపట్టాయి. ఈ పైలెట్‌ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్‌లో పప్పులు ఉడకవని భావించి పొరుగు రాష్ట్రాలపై ఈ కంపెనీలు దృష్టిసారించాయి. పైకి ఈ రంగంలో ఉంటామని ధీమా వ్యక్తం చేసిన వారి ఆలోచన మాత్రం ఇతర రంగాలపైనే ఉందని విమర్శలు వస్తున్నాయి.

ఏదైమైనా 2011 మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలకు గడ్డుకాలం. ప్రభుత్వ కొత్త చట్టం, ఆర్‌బీఐ నిబంధనలు ఈ కంపెనీలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వచ్చే ఏడాది అయినా ఈ రంగం వృద్ధి సాధిస్తుందో లేదో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే...!