Saturday, January 21, 2012

ఆతిధ్య రంగం వెలవెల

ఆతిధ్య రంగం వెలవెల

ఈ ఏడాది హోటల్ పరిశ్రమకు (బ్రాండెడ్ హోటల్స్) కాలం నిరాశజనకంగానే గడిచింది. దేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. యూరో సంక్షోభం, అమెరికాలో అనిశ్చితి, రూపాయి బలహీనత పరిశ్రమపై నీలినీడలకు కారణం. రూమ్ ఆక్యుపెన్సీ రేటులో స్వల్ప వృద్ధి ఉన్నప్పటికీ రాబడుల్లో మాత్రం తేడా లేదు. పరిశ్రమలో పోటీ పెరిగడం. డిమాండ్‌ను మించి సప్లయ్ (గదుల సంఖ్య ) పెరగడం... ఇందుకు కారణం. మొత్తమ్మీద 2011 హోటల్ పరిశ్రమకు తేడా లేకుండా గడిచిపోయింది. ఈ ఏడాది దేశీయ మార్కెట్‌లో లాస్‌వెగాస్ కేంద్రంగా ఉన్న ఎంజిఎం హాస్పిటాలిటీ, బ్రిటన్‌కు చెందిన వైట్‌బ్రెడ్, బెస్ట్ వెస్ట్రన్ పెద్ద ఎత్తునే విస్తరించాయి.

దేశీయ దిగ్గజాలు ఒబెరాయ్, ఐటిసి, లీలావెంచర్స్ తరుచు బోర్డు రూమ్ పరిణామాల కారణంగా కారణంగా వార్తల్లోకి వచ్చాయి. ఈ ఏడాది ఆరంభంలోనే పరిశ్రమకు ప్రభుత్వం ఒక ఝలక్ ఇచ్చింది. ఎయిర్ కండీషన్డ్ రెస్టారెంట్లలో సర్వీసు చేసే ఆహార పదార్ధాలపైనా, 1000 రూపాయలపై పడిన రూమ్‌రెంట్ ఉన్న హోటళ్లపైనా సర్వీసు టాక్స్‌ను ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఏడాది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే స్టార్, ఏ గ్రూప్ హోటల్స్ కేటగిరీలో గదుల సంఖ్య పెరిగింది. దీనివల్ల డిమాండ్ కంటే సప్లయ్ పెరగడం వల్ల గదుల అద్దెల్లో మాత్రం మార్పురాలేదు. అయితే ఆక్యుపెన్సీ మాత్రం 4-5 శాతం మేర పెరిగింది. సగటు అక్యుపెన్సీ 67 శాతం ఉన్నట్టు పరిశ్రమవర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది పరిశ్రమ మరింత గడ్డుకాలాన్ని ఎదుర్కోవల్సి ఉంటుందని నిపుణలు చెబుతున్నారు. ఆర్థిక రంగంలోని మందగమన పరిస్థితులకు తోడుగా దేశంలో నెలకొని ఉన్న రాజకీయ అనిశ్చితి, కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండటం.. హోటల్ పరిశ్రమకు ప్రతికూలతను సూచిస్తున్నాయని వారు చెబుతున్నారు. పరిశ్రమకు సంబంధించి ఈ ఏడాది ముఖ్యాంశాలు

* దేశీయంగా 2011 నాటికి మొత్తం గదుల సంఖ్య 9130 పెరిగి 71,530కి చేరింది. 2015-16 నాటికి ఈ గదుల సంఖ్య 102438కి చేరుకునే అవకాశం ఉంది. * టూరిస్టులను ఆకర్షించడం కోసం భారత్ ఈ ఏడాది ఇన్‌క్రెడిబుల్ ఇండియా పేరుతో భారీ ఎత్తున క్యాంపెన్ జరిపింది. దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత టూరిస్ట్ వీసా జారీ చేసే స్కీమ్‌ను కొత్తగా వియత్నాం, ఫిలిప్పైన్స్, ఇండోనేసి యా, మయన్మార్, లావోస్, కాంబోడియా దేశాలకు కూడా వర్తింప జేశారు. అంతకు ముందు ఫిన్లాండ్, జపాన్, న్యూజిలాండ్, సింగపూర్, లగ్జెంబర్గ్ దేశాలకు మాత్రమే ఈ సౌకర్యం ఉండేది. *కొత్త క్లీన్ ఇండియా పేరుతో కూడా టూరిస్టులను ఆకర్షించడం కోసం మరో క్యాంపైన్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. * వ్యాపార రంగంలో మందగమనం కూడా హోటల్ పరిశ్రమను ప్రభావితం చేసింది. ఢిల్లీ, బెంగళూర్ మినహా ఇతర నగరాల్లో అక్యుపెన్సీ రేటులో పెద్దగా వృద్ది లేదు. *డాలర్ మారకంలో రూపాయి విలువ 20 శాతంపైగా పతనమైన నేపథ్యంలో విదేశీ టూరిస్టులకు భారత యాత్ర ఇప్పుడు చాలా చౌకగా మారింది. భవిష్యత్తులో విదేశీ టూరిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే యూరో జోన్ సంక్షోభం పరిష్కారమైతే తప్ప విదేశీ టూరిస్టులపై ఆశలకు ఆస్కారం లేదు. * ఈ ఏడాది జనవరి-నవంబర్ మధ్య దేశంలోకి వచ్చిన విదేశీ టూరిస్టుల సంఖ్య 55.75 లక్షలు. అంతకు ముందు ఏడాది కంటే ఇది 9 శాతం ఎక్కువ. * ఈ 11 నెలల్లో హోటల్ పరిశ్రమ ద్వారా ఆర్జించిన విదేసీ మారక ద్రవ్యం 1487.6 కోట్ల డాలర్లు. అంతకు ముందు ఏడాది కంటే ఇది 17.7 శాతం ఎక్కువ. * దేశీ టూరిస్టుల విదేశీ యాత్ర మాత్రం రూపాయి విలువ పతనం వల్ల ఖరీదైన వ్యవహరంగా మారింది. * ఇఐహెచ్ హోటల్స్‌లో నీతా అంబానీ, ముకేష్ అంబానీ సన్నిహిత మిత్రుడు మనోజ్ మోడి అడిషనల్ డైరెక్టర్లుగా చేరారు. * డిఎల్ఎఫ్ హోటల్స్ అండ్ హాస్పిటాలిటీ ఈక్విటీలో భాగస్వామి హిల్టన్ ఇంటర్‌నేషనల్‌కు చెందిన 26 శాతం వాటాను 120 కోట్ల రూపాయలతో డిఎల్ఎఫ్ కొనుగోలు చేసిది. * లగ్జరీ హోటల్స్ గ్రూప్ లీలావెంచర్స్ దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల్లో లీలా గార్డెన్స్ పేరుతో త్రిస్టార్ హోటల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించింది. * ఒపి ముంజాల్ సారథ్యంలోని హీరో గ్రూప్ గూర్‌గావ్‌లో 280 గదుల స్టార్ హోటల్ నిర్మిస్తున్నట్టుగా ప్రకటించింది. * బ్రిటన్ సంస్థ బెస్ట్ వెస్ట్రన్ దేశీయంగా తమ హోటల్స్ సంఖ్యను 18 నుంచి 2017 నాటికి 100కు పెంచనున్నట్టుగా వెల్లడించింది. * స్టార్ఉడ్ 2015 నాటికి 100 హోటల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టుగా పేర్కొంది. * దేశీయంగా హోటల్స్ ఏర్పాటుకు 535 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయనున్నట్టు వైట్‌బ్రెడ్ పేర్కొంది. * స్విస్ సంస్థ మూవ్ఎన్‌పిక్ హోటల్స్ వచ్చే ఐదేశ్ళలో 10 హోటల్స్ ఏర్పాటుకు వీలుగా ఎంఎస్ఆర్ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో టైఅప్ కుదుర్చుకున్నట్టు తెలిపింది.