Saturday, January 21, 2012

Busi_Realty 2011

Busi_Realty 2011

ఈ ఏడాది రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైందని చెప్పొచ్చు. రిజర్వు బ్యాంక్‌ కీలక వడ్డీరేట్లను పలుమార్లు పెంచడంతో గృహరుణాలపై ఆసక్తి సన్నగిల్లింది. దీంతో పాటు స్టాక్‌మార్కెట్లు కూడా భారీ కరెక్షన్‌కు లోనవడంతో రియాల్టీని మరింత దెబ్బతీసింది. దీంతో ఒకప్పుడు పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న రియాల్టీ నుంచి ఇన్వెస్టర్లు ఇతర రంగాలకు మళ్ళుతున్నారు. రాజకీయ అస్థిరత, పాలన, భూమి కొనుగోలు సంబంధించిన సమస్యలు, నియంత్రణ ప్రక్రియలు, ప్రాజెక్ట్‌ స్పష్టతలో జాప్యాలుతో పాటు పెరుగుతున్న వడ్డీరేట్లు రియాల్టీ రంగం దెబ్బతినడానికి ప్రధాన కారణం. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగం 20-40 శాతం వరకు క్షీణించింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా రియాల్టీ రంగం భారీగా దెబ్బతింది. నిర్మించిన ఇళ్ళు కొనేవారు లేకపోవడంతో షాంఘై, బీజింగ్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 70 పెద్ద నగరాల్లో ఇళ్ళ ధరలు భారీగా తగ్గాయని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా గత మూడు, నాలుగు నెలల్లో రియాల్టీ జోరు భారీగా తగ్గిందని, ఇది ఇలాగే కొనసాగితే రియాల్టీ రంగానికి పెద్ద ఇబ్బందేనని ఈ సర్వేలలో ఆందోళన వ్యక్తమైంది.

ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే 2011లో రియల్టీ రంగంలో కరెక్షన్ వచ్చిందనే చెప్పాలి. అయితే గత ఏడాది అక్టోబర్ నుంచి పరిస్థితి కొంత మెరుగ్గా అనిపించినా మేజర్ ప్రాజెక్టులేవీ రాలేదు. ఆంధ్ర ప్రదేశ్‌లో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఓ వైపు సకల జనుల సమ్మె, తెలంగాణ వాదంతో బిజినెస్ లేకపోవడం మరోవైపు ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో డెవలపర్స్ కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి జంకుతున్నారు. ముఖ్యంగా జీవో నెం 45 బిల్డర్స్‌కి కొరకరాని కొయ్యగా మారింది. దీంతో గత పది నెలలుగా రియల్టీ రంగంలో స్తబ్ధత నెలకొంది. దీంతో డిమాండ్‌కు తగ్గ సప్లై లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఇక 2012 విషయానికొస్తే వచ్చే జనవరి నుంచి మంచి భూమ్ ఉంటుందని డెవలర్స్ ఆశిస్తున్నారు. ఫస్ట్ క్వార్టర్‌లో పెట్టుబడులు పెట్టే బైయ్యర్స్‌కు ఇది జాక్ పాట్ లాంటి అవకాశమని అని వారంటున్నారు. డాలర్ అనూహ్యంగా బలపడటంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు, NRIలకు 15 నుంచి 20 శాతం మేర లాభపడుతున్నారు, వారు పెట్టుబడులు పెట్టేందుకు ఆశక్తి చూపుతున్నారు. దీంతో చాలా డిమాండ్ ఉండే అవకాశముందని అయితే డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడంతో వచ్చే ఏడాది రెండవ త్రైమాశికం కల్లా రేట్లు 20 శాతం పైగా పెరిగే ఛాన్సుందని విశ్లేషకులంటున్నారు.

హైదరాబాద్‌లో పరిస్థితి ఇలా ఉంటే విశాఖపట్టణంలో దీనికి భిన్నంగా ఉంది. ఇక్కడ గత రెండేళ్ళ నుంచి రియల్ భూమ్ అమాంతంగా పెరిగిపోయింది. ఈ ఏడాది కూడా ఇక్కడ మంచి రేట్లే పలుకుతున్నాయి. డిమాండ్‌కు తగ్గ సప్లై ఉన్నా ...జీవో 45తోనే అసలు తలనొప్పి అని డెవలపర్స్ వాపోతున్నారు.


మొత్తమ్మీద రియాల్టీ రంగం గాడిన పడినట్లు కనిపిస్తోన్నా ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు డెవలపర్స్‌కి నష్టం కలిగించేలా ఉన్నాయి. జీవో 45ని సవరించి ప్రభుత్వం సహకరించాలని రియాల్టీ రంగ నిపుణులంటున్నారు.