Saturday, January 21, 2012

మౌళిక రంగం 2011

మౌళిక రంగం 2011

ఒకప్పుడు కళకళలాడిన మౌళిక రంగం ఈ ఏడాది నత్తనడక నడిచింది. 2011 ఈ రంగానికి కలసిరాలేదనే చెప్పాలి. ఇటు రాష్ట్రంలో కానీ అటు దేశవ్యాప్తంగా కానీ ఈ aఏడాదిలో మేజర్ ప్రాజెక్టులేవీ మచ్చుకైనా కనిపించలేదు. వడ్డీరేట్ల పెంపు, ద్రవ్యోల్భణం, రాజకీయ అస్థిరత మౌళిక రంగాన్ని కుదేలు చేశాయి.

2011లోమౌళిక రంగం చతికిల బడింది. ఈ ఏడాది చెప్పుకోతగ్గ పెద్ద ప్రాజెక్టులేవీ రాలేదనే చెప్పాలి. సిమెంట్‌, విద్యుత్‌ ఉత్పత్తి, రిఫైనరీలు కొంత మెరుగ్గా కనిపించినా... ముడిచమురు, నేచురల్‌ గ్యాస్‌, ఎరువుల రంగాలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ ఏడాది ఇన్‌ఫ్రాకి పెద్ద దెబ్బే తగిలింది. ఆర్‌బీఐ ద్రవ్యోల్భణం అదుపు పేరుతో వడ్డీరేట్లు పెంచుకుంటూ పోవడం ఒక కారణమైతే...మరో వైపు కోల్ ఇండియా పవర్ ప్రాజెక్టులకు అవసరమైనంత బొగ్గు అందించడంలో విఫలమౌవ్వడం, కోల్‌ లింకేజ్‌ ఇష్యూస్‌ ప్రధానం కారణంగా చెప్పవచ్చు. దాదాపు అన్ని మేజర్ పవర్ ప్రాజెక్టులు బొగ్గుని విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో ఇబ్బందులను ఎదుర్కోక తప్పలేదు. దీంతో పవర్ జనరేషన్‌కు ఆటంకం ఎదురైంది. ఇక రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన ప్రాజెక్టులు బాగానే వచ్చినా వడ్డీరేట్ల పెంపు, బ్యాంకర్ల జాప్యంతో నత్త నడకనే నడిచాయి. మొత్తమ్మీద ఈ ఏడాది మౌళిక రంగానికి కలసి రాలేదు.

ఇక మన రాష్ట్రం విషయాకొస్తే ఒకప్పుడు కళకళలాడిన పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ ఏడాది భారీగా నష్టపోయాయి. దేశవ్యాప్తంగా సుమారు 60 శాతం ఇన్‌ఫ్రా కంపెనీలు మన రాష్ట్రావే. ఈ సారి మాత్రం ఈ కంపెనీల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. జీఎమ్‌ఆర్, జీవీకే, లాంకో ఇన్‌ఫ్రా తో పాటు పలు కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. మరికొన్ని కంపెనీలు రాష్ట్రాన్ని వదిలి బయట రాష్ట్రాల్లో చిన్నా చితకా ప్రాజెక్టులు చేపట్టాయి. రాష్ట్రంలో నెలకొన్ని రాజకీయ అనిశ్చితి, తెలంగాణ ఉద్యమ హోరుతో పాటు పవర్ ప్రాజెక్టుల కోసం బయట నుంచి బొగ్గుని దిగుమతి చేసుకోవాల్సి రావడంతో మన కంపెనీలు డీలా పడ్డాయి. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయానికొస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పనులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.

ఇక అర్భన్ ఇన్‌ఫ్రా విషయానికొస్తే ఈ ఏడాది ఈ సెక్టర్‌లో పురోగతి శూన్యమనే చెప్పాలి. వాటర్, వేస్ట్ మానేజ్‌మెంట్‌లలో ఒక్క మేజర్ ప్రాజెక్టు కూడా ఈ ఏడాది ప్రారంభం కాలేదు.
కోల్ పాలసీ రివైజ్‌, ఆయిల్ అండ్ గ్యాస్ పాలసీ రివైజ్ చేస్తే వచ్చే ఏడాది మంచి పురోగతి సాధించే అవకాశముందని విశ్లేషకులంటున్నారు.


రాజకీయ స్థిరత్వం, కేంద్రం తీసుకొనే వ్యూహాత్మక నిర్ణయాలతోనైనా వచ్చే ఏడాది మౌళిక రంగాన్ని గట్టెక్కుతుందని ఆశిద్దాం.