Saturday, January 21, 2012

బ్యాంకులు గోల్డ్‌ లోన్లు

బ్యాంకులు గోల్డ్‌ లోన్లు

గోల్డ్‌పై పెరుగుతోన్న ఆదరణను క్యాష్‌ చేసుకోవడానికి బ్యాంకులు కసరత్తు ప్రారంభించాయి. ఇందులో భాగంగా పలు బ్యాంకులు గోల్డ్‌లోన్‌ స్క్రీమ్‌లను ప్రారంభించి ఏకంగా గోల్డ్‌షాపులతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. అతితక్కువ వడ్డీరేట్లతో కస్టమర్లకు గాలం వేసి తమ బిజినెస్‌ను మరింత పెంచుకోవాలనే ఆలోచనలో బ్యాంకులు ఉన్నాయి.

పెరుగుతోన్న పోటీని తట్టుకోవడానికి రోజుకో కొత్త ఆలోచన చేస్తున్నాయి బ్యాంకులు. ఇప్పటివరకు రియాల్టీ, వాహన తదితర రంగాలపై ఫోకస్‌ చేసిన బ్యాంకులు... ఆ రంగాలు ఢీలాగా ఉండటంతో తాజాగా ఇతర సెగ్మెంట్‌ల వైపు దృష్టిసారించాయి. ధరలు హై రేంజ్‌లో ఉండటంతో బంగారం జనం కొనడానికి తిప్పలు పడుతోన్న వైనాన్ని గుర్తించిన బ్యాంకులు గోల్డ్‌ లోన్లను ఇవ్వడానికి ఎగబడుతున్నాయి.

మూడేళ్ళ క్రితం గోల్డ్‌ లోన్‌ బిజినెస్‌లోకి ప్రవేశించిన దేశంలోని రెండో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బంగారంపై రుణాలను విరివిగా ఇస్తోంది. గత ఏడాదికాలంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రెట్టింపు స్థాయిలో రుణాలు ఇచ్చింది. ఇటీవలే గోల్డ్‌లోన్‌ బిజినెస్‌లోకి ప్రవేశించిన యాక్సిస్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా గోల్డ్‌ లోన్స్‌ ఇవ్వాలని టార్గెట్‌గా పెట్టుకుంది. మిగతా బ్యాంకులు కూడా ఇదే స్థాయిలో రుణాలు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధంచేశాయి. ఫ్లోటింగ్‌ ఇంటరెస్ట్‌ బేసిస్‌లో గోల్డ్‌లోన్స్‌పై 11 నుంచి 15 శాతం వడ్డీని బ్యాంకులు వసూలు చేయనున్నాయి.

మిడిల్‌క్లాస్‌ పీపుల్స్‌ను ఆకర్షించేందుకు బంగారం కొనుగోలుపై రుణం ఇవ్వనున్నట్టు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ప్రకటించింది. దీనికోసం ఈ సంస్థ ఖజానా జువెలరీ, కల్యాణ్‌ జువెల్సర్స్‌, ఆర్‌కేఎస్‌ గ్రాండ్‌, సువర్ణ లక్ష్మి జువెలర్స్‌తో ఒప్పందం చేసుకున్నట్టు ఎస్‌బీహెచ్‌ ప్రకటించింది. ఫ్లోటింగ్‌ ఇంటరెస్ట్‌ ప్రకారం రుణాలను ఇవ్వనున్నట్టు, కస్టమర్లు గరిష్టంగా 60 నెలలు వాయిదాలను కట్టాలని ఎస్‌బీహెచ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.భగవంతరావ్‌ అంటున్నారు.


కాలంతో పాటు మనం మారాలి అన్నట్టుగా ఉంది ప్రస్తుతం బ్యాంకుల పరిస్థితి. ఇందులో భాగంగా కస్టమర్లను ఆకర్షించేందుకు రోజుకో కొత్త పథకానికి బ్యాంకులు శ్రీకారం చుడుతున్నాయి. తాజాగా వచ్చిన గోల్డ్‌లోన్‌ స్క్రీమ్‌ ఏ స్థాయిలో సక్సెస్‌ అవుతుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే..!