Saturday, January 21, 2012

కమోడిటీ రంగం ధగధగా 2011

కమోడిటీ రంగం ధగధగా 2011

ఈ ఏడాది కమోడిటీ రంగం ధగధగా మెరిసింది. గోల్డ్‌ 36 శాతం, సిల్వర్‌ 28 శాతం రిటర్న్స్‌ ఇచ్చాయి. అంతర్జాతీయంగా ఏర్పడిన అనిశ్చితి కారణంగానే ఇన్వెస్టర్లు బంగారం వైపు ఆసక్తి చూపారు.

ఈ ఏడాది అన్నింటికన్నా ఎక్కువ రిటర్న్స్‌ ఇచ్చింది ఏదంటే టక్కున గుర్తొచ్చేది గోల్డ్‌ అండ్‌ సిల్వర్‌. ఎప్పటికప్పుడూ ఆల్‌టైమ్‌ రికార్డులను బద్దలుకొడుతూ జనం గుండెళ్ళో దడపుట్టించిన బంగారం, వెండి... ఇన్వెస్టర్లను మాత్రం ఆనందంలో ముంచెత్తింది. ఈ ఏడాది చివర్లో కొంత కరెక్షన్‌ వచ్చినా ఏడాది మొత్తం మీద బంగారంపై 36 శాతం, వెండిపై 28 శాతం రిటర్న్స్‌ వచ్చాయి.

ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధర రూ.20,890గా ఉంది. జనవరి 28న 19 వేల 960 రూపాయల కనిష్టం... డిసెంబర్‌ 8న 29 వేల 540 రూపాయల గరిష్ట స్థాయిల మధ్య ట్రేడైంది. ఈ ఏడాది చివరి 20 రోజుల్లో వచ్చిన కరెక్షన్‌తో బంగారం ధర 27 వేల 300 రూపాయల సమీపంలోకి వచ్చింది.

ఇక వెండి విషయానికి వస్తే ఈ ఏడాది ప్రారంభంలో రూ.46,500గా ఉంది. ఏప్రిల్‌ 25న వెండి ధర 74 వేల 300 రూపాయల గరిష్ట స్థాయికి చేరి ఆల్‌టైమ్‌ హైకి చేరింది. సెప్టెంబర్‌ నుంచి వచ్చిన కరెక్షన్‌తో ఈ ఏడాది చివరి నాటికి వెండి ధర 49 వేలకు పడిపోయింది.

వచ్చే ఏడాది విషయానికి వస్తే గోల్డ్‌, సిల్వర్‌లు మళ్ళీ చక్కని రిటర్న్స్‌ ఇచ్చే ఛాన్స్‌ ఉంది. గోల్డ్‌ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ చాలా బెటరని, ఒకవేళ రిస్క్‌ తీసుకోదలిస్తే ఎంసీఎక్స్‌లో ట్రేడింగ్‌ చేయాలని నిపుణులు అంటున్నారు.

ఏదేమైనా అంతర్జాతీయంగా బంగారంకు ఉన్న డిమాండ్ , ఎకనమిక్ క్రైసిస్‌లతో ఇన్వెస్టర్లలో పసిడి మీద నమ్మకాన్ని పెంచుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలవటం, నిలకడలేని స్టాక్‌మార్కెట్ల కన్నా ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం గోల్డ్‌ ఎంతో బెస్ట్‌ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.