Saturday, January 21, 2012

బులియన్ ఢమాల్

బులియన్ ఢమాల్

సామాన్యుడికి అందనంత స్థాయికి దూసుకుపోయిన బంగా రం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో గురువారం దేశీయ బులియన్ మార్కెట్లో ఈ రెండు విలువైన లోహాల ధరలు భారీగా పతనమయ్యాయి. పది నెలల తరువాత వెండి ధర 50 వేల రూపాయల్లోకి వచ్చింది. ముంబై బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర (99.5 స్వచ్ఛత) ఒక్క రోజులో 845 రూపాయలు తగ్గి 27,415 రూపాయల (బుధవారం ముగిం పు) నుంచి 26,570 రూపాయలకు చేరుకుంది. అదే విధంగా 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర కూడా 845 రూపాయలు తగ్గి 27,540 రూపాయల నుంచి 26,695 రూపాయలకు చేరింది.

ఇక వెండి ధర గత 10 నెలల్లో ఎన్నడూ లేని విధంగా భారీ పతనాన్ని చవిచూసింది. కిలో వెండి ధర 2,815 రూపాయలు తగ్గి 51,955 రూపాయల నుంచి 49,140 రూపాయలకు దిగివచ్చింది. ఇక న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర (99.9 స్వచ్ఛత) 540 రూపాయలు తగ్గి 27,340 రూపాయలకు చేరింది. 99.5 స్వచ్ఛత బంగారం ధర 27,200 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 3,100 రూపాయలు దిగివచ్చి 49,100 రూపాయల వద్ద స్థిరపడింది.

ఎందుకీ పతనం? అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి ధరల కదలికలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో ధరలు హెచ్చుతగ్గులకు గురవుతుంటాయి. ప్రస్తుతం ఈ రెండు లోహాల పట్ల అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ధోరణి ప్రతికూలంగా మారింది. గురువారం బంగారం ధర మూడు నెలల కనిష్ఠస్థాయికి పడిపోయింది. డాలర్ క్రమంగా బలపడుతుండటంతో పెట్టుబడులు బులియన్ మార్కెట్ నుంచి డాలర్‌వైపు మళ్లుతున్నాయి. దీని ఫలితంగానే ఈ నెలలో బంగారం ధర 11 శాతం తగ్గింది. గత ఆరు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఔన్స్ బంగారం ధర తాజా గా 1.1 శాతం తగ్గి 1,547.50 డాలర్లకు చేరింది.

సెప్టెంబర్ 26 నుంచి ఇప్పటి వరకు ఇంత తక్కువ స్థాయిలో బంగారం ధర లేదు. అంతర్జాతీయ మార్కెట్లో మార్చి నెలకు వెండి కాంట్రాక్టు ఔన్స్ ధర 1.51 డాలర్లు క్షీణించి 27.23 డాలర్లకు చేరింది. వీటి ధరలు భవిష్యత్‌లో ఇంకా క్షీణిస్తాయని ఆందోళన చెందుతున్న దేశీయ స్పెక్యులేటర్లు, ఇన్వెస్టర్లు లాభా ల స్వీకరణకు దిగుతున్నారు. అందుకే ఇంత భారీ స్థాయిలో ధరలు తగ్గినట్టు విశ్లేషకులు చెబుతున్నా రు. మరో వైపు వెండికి పారిశ్రామిక రంగం నుంచి డిమాండ్ సన్నగిల్లింది. ఈ పరిణామం కూడా వెండి తగ్గడానికి కారణంగా చెబుతున్నారు.

స్వల్పంగా పెరిగిన గిరాకీ బంగారం ధర రెండు నెలల క్రితం ఉన్న స్థాయికి దిగిరావడంతో కొనుగోలుదారుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గురువారం నాడు భారీగా తగ్గిన ధర వల్ల కొనుగోళ్లు ఒక్కసారిగా ఊపందుకున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. బుధవారంతో పోల్చితే గురువారం నాడు పసిడి కొనుగోళ్లు అధికంగా జరిగినట్లు ముంబైకి చెందిన ఒక డీలర్ తెలిపారు. అయితే ఏడాది చివర్లో డిమాండ్ కొంత బలహీనంగా ఉందంటున్నారు. డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు బంగారం కొనుగోళ్లకు మంచి రోజులు కావని హిందువులు భావిస్తుండటంవల్లనే గిరాకీ తగ్గినట్టు ట్రేడర్లు చెబుతున్నారు. అయితే ధరలు తగ్గుతున్న నేపథ్యంలోరానున్న కాలంలో ఇంకా తగ్గుతాయని భావించి కొంత మంది కొనుగోళ్లు జరపడం లేదని చెబుతున్నారు.