Saturday, February 27, 2010

మౌలిక రంగానికి రూ.1.73 లక్షల కోట్లు

మౌలిక రంగానికి రూ.1.73 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థికశాఖ మంత్రి తన బడ్జెట్‌లో అమిత ప్రాధాన్యమిచ్చారు. 2010-11 ప్రణాళికాపద్దుల్లో రూ.1,73,552 కోట్లను రోడ్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వేలు, ఇతర మౌలిక వనరులకు కేటాయించారు.

2009-10లో రోడ్లకు రూ.17,520 కోట్లు ఇవ్వగా, ఈసారి 13% పెంచి రూ.19,894 కోట్లు కేటాయించారు. జాతీయ రహదారులను రోజుకు 20 కిలోమీటర్ల చొప్పున నిర్మించేందుకు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) నిబంధనల్లో మార్పులు చేశారు. రవాణాకు ప్రత్యేకంగా ఢిల్లీ-ముంబయి ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటుచేస్తారు. రైల్వేలకు రూ.950 కోట్లు జతచేసి, రూ.16,752 కోట్లు ఇచ్చారు. 'భారత మౌలికరంగ ఆర్థికసంస్థ' (ఐఐఎఫ్‌సీఎల్‌) నుంచి ఈ మార్చి నాటికి రూ.9,000 కోట్లు, 2011 మార్చినాటికి రూ.20,000 కోట్లు పంపిణీ అవుతాయి. ఈ సంస్థ రూ.3,000 కోట్ల మేర బ్యాంకు రుణాల రీఫైనాన్స్‌ చేసింది. వచ్చే మూడేళ్లలో మౌలికరంగ ప్రాజెక్టులకు ఐఐఎఫ్‌సీఎల్‌ ద్వారా బ్యాంకులు రూ.25,000 కోట్లు రుణాలిస్తాయి. గ్రామీణ రహదారులు, వంతెనలకు ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన కింద రూ.12,000 కోట్లు కేటాయించారు. 1.67 లక్షల నివాస ప్రాంతాలను కలుపుతూ, 3,65,279 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మిస్తారు. జాతీయ రహదారుల నిర్మాణం, అభివృద్ధికి నిర్మించు-నిర్వహించు-బదలాయింపు (బీఓటీ) విధానానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అవసరమైన పరికరాల దిగుమతిపై సుంకాలను రద్దుచేశారు. కనీస ప్రత్యామ్నాయ పన్ను ఉపసంహరించకపోగా, 15% నుంచి 18 శాతానికి పెంచారు.