Saturday, February 27, 2010

పొగరాయుళ్లకు వాత

పొగరాయుళ్లకు వాత
న్యూఢిల్లీ: ''పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్‌..'' అన్న గిరీశం మాటలకేమోగానీ పొగతాగితే జేబులు చిల్లుపడున్‌.. అంటున్నారు ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ. శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పొగరాయుళ్లపై ఆయన వీర బాదుడు బాదారు. పొగాకు ఉత్పత్తులపై భారీగా ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచడంతో సిగరెట్‌ కాల్చాలనుకున్న వారు ఓసారి తమ జేబుకేసి చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్నేళ్ల కిందట ప్రణబ్‌ కూడా ధూమపాన ప్రియుడే. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆ తర్వాత కాలంలో ఆయన సిగరెట్‌ కాల్చడం పూర్తిగా మానేశారు. తాను మానేసినా.. ఇతరులు కాల్చుతూ ఆనందం పొందుతుండడాన్ని సహించలేక పోయారో..లేక పొగరాయుళ్లను వదలొద్దని తన కూతురు షర్మిష్ఠ ముఖర్జీ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయో ఏమోగానీ .. పొగాకు ఉత్పత్తులపై తన ప్రతాపాన్ని చూపారు. పొగతాగడం హానికరమని, ఆ అలవాటును పూర్తిగా మానుకోవాలని, ఇందుకోసమే పన్ను పెంచుతున్నట్లు ప్రణబ్‌సభలో చెప్పడం విశేషం. మరోవైపు చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మ బెలూన్లకుబడ్జెట్‌లో పన్ను మినహాయింపు ఇచ్చారు. దేశానికి ఆర్థిక మంత్రే అయినా చిన్నారులకు మాత్రం తాతయ్యే అనిపించుకున్నారు మన విత్త మంత్రి.