Friday, February 26, 2010

ఆదాయపు పన్ను చెల్లింపులు మరింత సరళతరం

ఆదాయపు పన్ను చెల్లింపులు మరింత సరళతరం
రూ.1.60 లక్షల వరకూ ఆదాయపు పన్ను లేదు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 : బడ్జెట్‌లో ఎన్ని బడా ప్రణాళికలు, పద్దులు ఉన్నప్పటికీ సామాన్యు డు ఆశగా ఎదురుచూసేది ఆ ఒక్కదాని కోసమే. అదే ఆదాయపు పన్ను మినహాయింపు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సగటు ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఆదాయపు పన్ను మినహాయింపును రూ.1.60 లక్షల కు పరిమితం చేస్తూ ప్రణబ్ గత విధానాన్నే కొనసాగించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.6 లక్షల నుంచి 5 లక్షల లోపు ఆదాయం గలవారు 10 శాతం, రూ.5-రూ.8 లక్షల మధ్య ఆదాయం గలవారు 20 శాతం, రూ.8 లక్షల పైన ఆదాయం గలవారు 30 శాతం పన్ను చెల్లించవలసి వుంటుంది. అయితే గత ఏడాది బడ్జెట్‌లో పన్ను చెల్లింపు కోసం ప్రవేశ పెట్టిన కొత్త విధానం స్థానే ప్రణబ్ ఈ సారి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రకారం ఆదాయపు పన్ను చెల్లింపులు మరింత సరళతరం కానున్నాయి. ఇప్పటివరకూ కఠినమైన అప్లికేషన్ ఫారమ్‌ను ఎత్తివేసి సరళతరంగా అందరికీ అందుబాటులో ఉండే రెండు పేజీల సరళ్-2 ఫారమ్ ప్రవేశపెడుతున్నట్లు ప్రణబ్ ముఖర్జీ సభ్యుల కరతాళధ్వనుల మధ్య వెల్లడించారు. ఇకపోతే ఈ ఏడాది సర్వీస్ ట్యాక్స్ పెంచకపోవడం కొంతలో కొంత ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.

దేశంలోని అన్ని ప్రాంతాలలో దశల వారీగా ఐటి రిటర్న్స్ దాఖలును కంప్యూటరీకరించను న్నట్లు ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. ఈ క్రమంలో రెండు చోట్ల ఐటి రిటర్న్స్‌ను కంప్యూటరీకరిస్తున్నట్లు ఆయన వివరించారు. వ్యక్తిగత ఆదాయపు పన్నుల్లో స్వల్ప తేడాలతో సరిపెట్టిన ప్రణబ్ ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత దిగుమతులపై సుంకాలు బాగా తగ్గించారు. దీనితో వ్యవసాయ సంబంధిత ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. అలాగే రూ.20 లక్షలలోపు గృహరుణాలు తీసుకునే వారికి ఒక శాతం వడ్డీ రాయితీ ఇవ్వడంతో రియల్ ఎస్టేట్ పుంజుకునే అవకాశం ఉన్నది. అలాగే సిగరెట్, గుట్కా, రిఫ్రిజిరేటర్లు, కార్లు, స్టీల్, సిమెంట్, బంగారం, వెండి దిగుమతులపై ప్రణబ్ భారీగా వడ్డింపులు జరిపారు. దీనితో ఆయా ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరగనున్నాయి. ప్రణబ్ కార్లపై ట్యాక్స్ పెంచినట్లు ప్రకటించిన వెంటనే హ్యూందయ్, మారుతి వంటి అగ్రశ్రేణి కార్ల ఉత్పత్తి సంస్థలు ధరలు పెంచేశాయి. అలాగే వాహనాల కొనుగోలుపై 2 శాతం పన్ను పెంచడంతో వ్యక్తిగత వాహనాల కొనుగోలు సామాన్యుడికి భారం కానున్నది. అలాగే వెండి, బంగారు దిగుమతులపై భారీగా పన్నులు వడ్డించారు. వెండిపై కేజీకి రూ.1,500పైనే పన్ను విధించారు. దీనితో బంగారం, వెండి సరాసరిన మరో రెండు వేలకు పెరిగే అవకాశం ఉన్నది. అయితే ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతిపై ట్యాక్స్ తగ్గించడంతో సెల్‌ఫోన్, కంప్యూటర్, మైక్రోచిప్స్, ఎలక్ట్రానిక్ విడిభాగాలు చౌకగా లభించే అవకాశం ఉన్నది. ఆహారభద్రత కోసం ఎగుమతులపై ఆంక్షల సడలింపు కొనసాగిస్తూ పన్ను మినహాయింపులు ప్రకటించినప్పటికీ పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచుతామని ప్రకటించడంతో వాటి ధరలు కూడా పెరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. మధ్య తరగతి ప్రజలకు పెద్దగా పట్టని కాస్మటిక్స్‌పై ప్రణబ్ కరుణ చూపించారు. ఆయా ఉత్పత్తులకు పన్నును తగ్గించారు. ఆదాయపు పన్ను రూ.2.5 లక్షల వరకూ కనీస పరిమితి మినహాయింపు ఇస్తారని ఆశించి ప్రయోజనం లేక, ఇటు అందీఅందనట్లు వస్తువుల ధరలను అట్టే పెట్టడం సామాన్య ప్రజలలో బడ్జెట్ పట్ల తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. అయితే కాంగ్రెస్ శ్రేణులు పన్ను విధానాన్ని స్వాగతిస్తున్నాయి.