Thursday, February 25, 2010

హైదరాబాద్‌కు చైనా పారిశ్రామిక బృందం

హైదరాబాద్‌కు చైనా పారిశ్రామిక బృందం
వ్యాపార అవకాశాలపై చర్చలు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఫార్మా, జీవ ఔషధాలు, ఐటీ సేవల అవుట్‌సోర్సింగ్‌ రంగాలలోని వ్యాపార అవకాశాలను అధ్యయనం చేయడానికి, ఇక్కడి కంపెనీలను తమ ప్రాంతానికి ఆకర్షించడానికి చైనాకు చెందిన వుషి ప్రాంత వ్యాపార బృందం హైదరాబాద్‌కు విచ్చేసింది. భారత కుటీర, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమల మండలి, భారత, చైనా ఆర్థిక, సాంస్కృతిక మండలి ఏర్పాటు చేసిన వ్యాపార సమావేశంలో రెండు దేశాల పారిశ్రామిక ప్రతినిధులు పాలుపంచుకున్నారు. షాంఘైకి సమీపంలోని వుషి ప్రాంతం జీవ ఔషధాలు, రవాణా రంగానికి కేంద్రంగా ఉందని చైనా ప్రతినిధులు వెల్లడించగా.. హైదరాబాద్‌ ఐటీ సేవలకు మారుపేరుగా నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు సి.ఎస్‌.రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వుషి ప్రాంత అధికారులు, రాష్ట్ర భారీ పరిశ్రమలు శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, చిన్న పరిశ్రమల మంత్రి డి.కె.అరుణ తదితరులు పాల్గొన్నారు.