నేడే కేంద్ర బడ్జెట్
దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యం నుంచి కోలుకున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సమర్పించే 2010-11 బడ్జెట్‌లో ఉద్దీపన ప్యాకేజిలను మెల్లమెల్లగా వెనుకకు తీసుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రణబ్ ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం, ద్రవ్య లోటు, ఉద్దీపనలు, సామాన్యుడి ప్రయోజనాలు, సంస్కరణలు వంటి అంశాల మధ్య సమతూకం సాధించాల్సి ఉంటుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

పన్నులో మార్పులు :
అనేక వస్తువుల ధరలు పెరగడం వలన సామాన్యుడు పన్నులో భారీ మార్పులు కావాలని ఆశపడుతున్నాడు. వ్యక్తిగత ఆదాయపన్నును మరింత తగ్గించాలని కోరుకుంటున్నాడు. ఆదాయపన్ను పరిమితిని రెండు లక్షలకు పెంచాలని భావిస్తున్నాడు. చిన్న వ్యాపారులతో పాటు ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో పలు మార్పులుంటాయని ఎదురుచూస్తున్నారు. కార్పొరేట్ ట్యాక్స్ 30 శాతం తగ్గుతుందని ఆశపడుతున్నారు. వైద్య సంస్థలు పదేళ్ల పాటు ట్యాక్స్ హాలిడేని ప్రకటించాలని కోరుకుంటున్నాయి. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ప్రోత్సహించే విధంగా కొత్త పన్నులు ప్రవేశపెడుతారని ఆసక్తిగా చూస్తున్నారు. ప్రత్యక్ష పన్నుల కోడ్ ఇప్పటికైతే కేవలం ముసాయిదా రూపంలోనే ఉంది. కాని 2011 ఏప్రిల్ ఒకటి నుంచి ఈ కోడ్ అమలు ద్వారా కేంద్రం చాలా ప్రయోజనాలను ఆశిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

పెట్రోలు ధరపై రాయితీల వలన కేంద్ర ద్రవ్యలోటు పెరిగిపోతుండంతో, వీటిపై నియంత్రణను ఎత్తివేస్తుందా? అని సామాన్యులు భయపడుతున్నారు. ధర నిర్ణయాన్ని పెట్రోలు కంపెనీలకే వదిలేస్తే వాస్తవ ధరను సామన్యులు భరించే స్థితిలో లేరు. అందుకనే నియంత్రణ ఎత్తివేసే చర్యలు ఉండకూడదని మధ్యతరగతి ప్రజలు కోరుకుంటున్నారు.
స్టాక్‌మార్కెట్లు :
భారీ పతనాన్ని చవిచూసిన స్టాక్‌మార్కెట్లు గత ఏడాది పుంజుకుని లాభాల దిశగా పయనిస్తున్నాయి. దీంతో పెట్టుబడుదార్లను ఆకర్షిస్తోంది. కొత్తగా స్టాక్‌మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి ప్రోత్సహాలు అందించాలని మార్కెట్ వర్గాలు ఆశపడుతున్నాయి. దీనికోసం ప్రణబ్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌ను తగ్గించనున్నారు. అదే విధంగా విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడానికి వారికి భారీ ప్రోత్సహాలు ఇవ్వాలని ఆలోచనలో ఆర్థిక శాఖ ఉందని నిపుణులు తెలిపారు.
వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత :
గత ఏడాది వర్షాభావ పరిస్థితులు, పంటపై పెట్టుబడి పెరగడం వల్ల ఆహార ఉత్పత్తుల దిగుబడి గణనీయంగా తగ్గింది. దీనికోసం రైతులను ఆదుకునేందుకు ప్రస్తుతం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నారు. రుణమాఫీ వంటి చర్యలతో పాటు, వ్యవసాయేతర సంస్థలకు అధిక ప్రోత్సాహకాలు అందిస్తారని భావిస్తున్నారు.
ఉద్దీపన ప్యాకేజీలు ఉపసంహరణ :
ఆర్థిక సంక్షోభానికి గురైన రంగాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఉద్దీపన పథకాలను ప్రవేశపెట్టింది. ఈ సహాయ ప్యాకేజీలను ఉపసంహరిస్తారా? అలాగే కొనసాగిస్తారా? అని మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం అనేక రంగాలు ఆర్థిక మాంద్యం నుంచి తేరుకుని లాభాల బాట పట్టాయన్నది వాస్తవమే. అయినా ఉద్దీపన ప్యాకేజీలను ఉపసంహరిస్తే ఎగుమతుల రంగం కుదేలు అవడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు. అందువల్ల ఈ రంగానికి మాత్రమే సహాయ ప్యాకేజీలను కొనసాగించి, మిగతా రంగాలకు ఉపసంహరించుకోవచ్చని ఆర్థిక నిపుణులు తెలిపారు. వీటితో పాటు రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తారని అంచనా వేస్తున్నారు. సంక్షేమం, విద్యలకు ప్రాధాన్యత, ఆహారం, ఎరువులపై సబ్సిడీ కొనసాగింపు వంటి అంశాలు ఉంటాయని భావిస్తున్నారు.