
ఆర్థిక వ్యవస్థకు మేలు చేసే విధంగా బడ్జెట్‌ను రూపొందించినప్పటికీ, పైకి కనిపిస్తున్న కఠిన చర్యల వల్ల ఇది జనానురంజకంగా కనిపించడం లేదు. ఉద్దీపనల ఉపసంహరణలో భాగంగా పన్నులు పెంచిన ప్రభుత్వం, అదే సమయంలో పెట్రోలు/ డీజిల్‌పై పన్ను భారాన్ని మోపకుండా ఉండాల్సింది. దీనివల్ల ద్రవ్యోల్బణం ఇంకా అధికం అయ్యే ప్రమాదం ఏర్పడుతోంది. ప్రస్తుతం అధిక ధరలతో జనం సతమతం అవుతున్నారు. ఆహార పదార్ధాల సరఫరా పెరిగేందుకు తక్షణం ఏం చర్యలు తీసుకోదలిచారో ఆర్థిక మంత్రి చెప్పలేదు. తక్షణ సమస్యలను ఆయన విస్మరించి, దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. దీనివల్ల సామాన్యుడికి తమను ఆర్థిక మంత్రి విస్మరించడమే కాకుండా, తమపై అధిక భారాన్ని మోపారని భావించే అవకాశం ఏర్పడుతోంది.
వ్యవసాయ రంగం ప్రాధాన్యంపై మాట్లాడటమే గానీ, అందుకు తగిన చర్యలు బడ్జెట్‌లో కనిపించడం లేదు. వ్యవసాయ రంగంలో 0.2 శాతం వ్యతిరేక అభివృద్ధి ఉన్న ఈ తరుణంలో దీన్ని 2 లేదా 3 శాతం వృద్ధికి తీసుకురావడానికి ఎంతగానో మద్దతు చర్యలు ప్రభుత్వం ప్రకటించాల్సింది. ఆ దిశగా అసలు దృష్టి పెట్టినట్లే కనిపించదు. వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మాట్లాడారు. అందుకు తగిన చర్యలు అయినా బడ్జెట్‌లో లేవు. ఏదైమైనా బడ్జెట్ ప్రభావం స్వల్పకాలంలో కష్టంగానే ఉంటుంది. దీర్ఘకాలంలో కొంత సానుకూలత కనిపించవచ్చు.
బ్యాంకింగ్, ఆర్థిక వ్యవహారాల నిపుణులు