Saturday, February 27, 2010

సంస్కరణలకు తలుపులు బార్లా


సంస్కరణలకు తలుపులు బార్లా
కంద్ర బడ్జెట్‌ సారమిదే...
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఆయన సాంత్వనగా మాట్లాడతారు. చేతలు మాత్రం కటువుగా ఉంటాయి. శుక్రవారం పార్లమెంటుకు సమర్పించిన 2010-11 కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ చేసిందదే. సామాన్యుడికి నొప్పి తెలీకుండా చితక్కొడుతూ... సంస్కరణలకు తలుపులు బార్లా తెరిచారు. ఆర్థిక స్థిరత్వం, మెరుగైన ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేస్తూనే.. జనం గోడును విస్మరించారు. దేశ ప్రజల్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్న అధిక ధరల్ని, నానాటికీ ఎగబాకుతున్న ద్రవ్యోల్బణాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా... కొత్తగా పెట్రో ధరల మంట పెట్టారు. వ్యవసాయానికి ఊరడింపు మాటలే తప్ప దక్కిందేమీ లేదు. ప్రణబ్‌ మహా చాకచక్యంగా 'పన్ను' పీకారు. ఓ చేత్తో మధ్య తరగతికి నాలుగు మెతుకులు విదిల్చి, మరోచేత్తో అన్ని వర్గాలకూ అన్ని రకాల పన్నుల్ని వడ్డించారు. ఆదాయపు పన్ను రూపంలో లభించిన మినహాయింపు కొంతే... అదీ కొందరికే అయితే, పరోక్ష పన్నులు పెంచి అటు పరిశ్రమలను, ఇటు వినియోగదార్లను అందరినీ శిక్షించారు. ప్రత్యక్ష పన్నుల్లో మార్పుల వల్ల వచ్చే ఏడాదిలో రూ.26,000 కోట్లు నష్టపోతున్నామంటూనే.. పరోక్ష పన్నుల రూపంలో అదనంగా రూ.46,500 కోట్లు రాబడుతున్నారు. అంటే.. ప్రభుత్వానికి రూ.20,500 కోట్ల అదనపు ఆదాయమన్నమాట! దీన్ని బట్టి ఊహించండి.. ఆయన ఎంతగా వడ్డించారో!!

పెట్రో ధరలపై వడ్డన ద్వారా ద్రవ్యోల్బణానికి విత్తమంత్రి మరింత ఆజ్యంపోశారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచాలన్న పారిఖ్‌ కమిటీ సిఫార్సుల దశల వారీ అమలు తప్పదన్న బలమైన సంకేతాల్ని ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా కనిపిస్తూ ఉండటంతో ఉద్దీపనల ఉపసంహరణకు నడుంకట్టారు. మొత్తం మీద సంస్కరణల బండి వేగాన్ని అందుకుందని చెప్పకనే చెప్పారు.
ఉద్దీపనల ఉపసంహరణ, పెట్టుబడుల్ని వెనక్కితీసుకోవడం, ఇంధన ధరలపై నియంత్రణల ఎత్తివేత యోచన, ప్రత్యేక ఆర్థిక మండళ్లకు ప్రాధాన్యం, చిల్లర రంగాన్ని బార్లా తెరవాలన్న ప్రతిపాదన, సేవల పన్ను పరిధిని విస్తరించాలనుకోవడం... ఇవన్నీ సంస్కరణల పథంలో మైలురాళ్లే. ఆకర్షణీయమైన వృద్ధిరేటును ఆవిష్కరించేవే. అదే సమయంలో స్వల్పకాలంలో బడుగుజీవి బతుకును పెనుభారం చేసే చర్యలకు ఆర్థిక మంత్రి వెనుకాడలేదు. ఉద్దీపన చర్యల్లో భాగంగా గతంలో తగ్గించిన 2 శాతం ఎక్సైజ్‌ సుంకాన్ని ఇప్పుడు మళ్లీ పెంచడం(8 నుంచి 10 శాతానికి) వల్ల అన్ని రకాల వస్తువులు ధరలు పెరుగుతాయి. కార్లు, టీవీలు, ఏసీలు, పొగాకు ఉత్పత్తులు, సిమెంటు... ఇలా అనేకానేక వస్తువుల ధరలు మండిపోతాయి. వీటికి పెట్రో ధరలు తోడవ్వడంతో సామాన్యుడి పరిస్థితి గోటిచుట్టుపై రోకటిపోటులా తయారయింది. అందుకే ఈ బడ్జెట్‌ 'అత్యంత మండే స్వభావం కలిగినది' అని ఆరోపిస్తూ... ఆర్థికమంత్రి తన బడ్జెట్‌ ప్రసంగం కొనసాగిస్తున్న సమయంలోనే ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్‌ చేశాయి. ఇది చాలా అరుదైన ఘటన.

ఆర్థిక స్థిరత్వం దిశగా...
దేశ ఆర్థిక వ్యవస్థపై లోటు భారం అధికంగా ఉన్న నేపథ్యంలో విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడం కష్టసాధ్యం. దీర్ఘకాలంలో ఆశించిన ఆర్థికాభివృద్ధి నమోదు కూడా అయ్యే పనికాదు. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ఎదురైన ఆర్థిక సంక్షోభం ఇంకా పూర్తిగా సద్దుమణగని నేపథ్యంలో మనదేశాన్ని బలమైన ఆర్థిక పునాదుల మీద నిలపడం ఎంతో అవసరమని ఆర్థిక మంత్రి భావించినట్లు కనిపిస్తోంది. అందుకే ఆర్థిక లోటును వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.5 శాతానికి పరిమితం చేశారు. అంతేగాకుండా ఆపై ఏడాది 4.8 శాతం, ఆ తర్వాత సంవత్సరం 4.1 శాతం కంటే ఆర్థిక లోటు ఉండదని చెప్పారు. ఆర్థిక వేత్తల్ని, వ్యాపారవర్గాల్ని ఇది సంతోషపెట్టే ప్రతిపాదన. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.5 శాతం లోటు అంటే రూ.3.81 లక్షల కోట్లు లోటు ఉంటుందని తేలుతోంది. దీనికోసం ఇతరత్రా అందుబాటులో ఉన్న ఆదాయ మార్గాలు కాకుండా మార్కెట్‌ నుంచి ప్రభుత్వం ఇంకా రూ.3.45 లక్షల కోట్లు అప్పులు చేయాలి. ముందస్తు అంచనా అయిన రూ.3.60 లక్షల కోట్ల కంటే ఇది తక్కువగానే ఉండటం కొంత సానుకూలం. అదే సమయంలో మెరుగైన ఆర్థికాభివృద్ధిని ప్రణబ్‌ ముఖర్జీ ఆవిష్కరించారు. రెండంకెల వృద్ధి సాధన ఎంతో దూరం లేదని స్పష్టంచేశారు.

ద్రవ్యోల్బణం గాలికి...
ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలనేది పెద్ద ప్రాధాన్యం కల అంశంగా ఆర్థికమంత్రి గుర్తించలేదు. ఆహార ద్రవోల్బణం అధికంగా ఉందనే అంశాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. కానీ ఆయన ప్రతిపాదించిన పన్ను మార్పులు, పెట్రోలు- డీజిల్‌పై వాతను పరిగణలోకి తీసుకుంటే ద్రవ్యోల్బణం స్వల్పకాలంలో ఇంకా పెరుగుతుందని స్పష్టమవుతోంది. ఆహార ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 18 శాతానికి చేరువుగా ఉంది. సాధారణ ద్రవ్యోల్బణం కూడా 8.5 శాతం ఉంది. ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయకుంటే... అది అదుపుతప్పి సాధారణ ద్రవ్యోల్బణం ఇంకా పెరిగే ప్రమాదం ఏర్పడుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధిక ద్రవ్యోల్బణం తప్పదనే వారూ లేకపోలేదు. ఏదేమైనా ఆర్థిక మంత్రి మాత్రం ఇదేమంత పెద్ద విషయం కాదనట్లు వ్యవహరించారు.

ఉద్దీపనలు వెనక్కి... మిశ్రమ స్పందన
అన్ని వస్తువులపై కేంద్ర ఎక్సైజ్‌ పన్నును 2 శాతం పెంచడం ఉద్దీపనల ఉపసంహరణ ప్రక్రియలో తొలిమెట్టు. వాస్తవానికి ఉద్దీపనల కంటే ముందు ఎక్సైజ్‌ పన్ను 10 శాతం ఉండేది. ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి ఏడాది క్రితం దీన్ని 8 శాతానికి తగ్గించారు. మళ్లీ ఇప్పుడు దాన్ని 10 శాతానికి పెంచారు. ప్రభుత్వంపై లోటు భారాన్ని తగ్గించుకోవడంతో పాటు, నెమ్మదిగా ఉద్దీపనల పధకాల నుంచి వెనక్కి రావాలనే ప్రభుత్వోద్దేశం ఈ నిర్ణయం వెనుక కనిపిస్తోంది. కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఆర్థికవేత్తలందరూ లోటును తగ్గించుకోవాలని, అందులో భాగంగా అవసరం అయితే ఉద్దీపనల నుంచి వెనక్కి రావాలని సూచిస్తున్న విషయం తెలిసిందే. దీనికి తగ్గట్లుగా ప్రభుత్వం నుంచి ఇటీవల సంకేతాలు వెలువడ్డాయి. చివరకు అదే జరిగింది. దీనిపై సంబంధిత వర్గాల నుంచి మిశ్రమస్పందన వ్యక్తం అవుతోంది. ఆర్థిక వ్యవస్థ బాగవుతోందని పారిశ్రామికవేత్తలు ఓ పక్క సంతోషాన్ని, అదే సమయంలో తమ వ్యాపారాలపై, ఆదాయాలపై భారం పడుతుందంటూ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉద్దీపనల ఉపసంహరణకు మరికొంతకాలం ఆగిఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

పన్నుల మినహాయింపులు, వడ్డింపులు
పన్నుల విషయంలో ఆర్థిక మంత్రి అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. ఓ పక్క ఆదాయపు పన్ను భారాన్ని కాస్త తగ్గిస్తూ.. మరోపక్క పరోక్ష పన్నుల భారాన్ని అధికం చేశారు. ఆదాయపు పన్ను చెల్లింపుదార్లు మనదేశంలో 3.15 కోట్ల మంది మాత్రమే. అందులో 60 శాతం మందికి మాత్రమే ఈ మార్పు వల్ల మేలు కలుగుతుంది. అంటే దాదాపు 1.89 కోట్ల మందికి పన్ను భారం తగ్గుతుందన్నమాట. కానీ పరోక్ష పన్నుల భారాన్ని వంద కోట్ల పైచిలుకు జనాభా మోయాల్సిందే. అదీ గమ్మత్తు!!

ఆదాయపు పన్ను స్లాబులను మార్చడం వల్ల ఎగువ మధ్యతరగతి వేతన జీవికి మేలు కలుగుతోంది. రూ.8 లక్షల వరకూ వార్షికాదాయం ఉన్న వారికి ఇప్పుడు రూ. 50 వేల వరకూ పన్ను భారం తగ్గే అవకాశం ఏర్పడింది. రూ.3 లక్షల వరకూ వార్షికాదాయం ఉన్నవారికి వర్తించే మార్పేమీ లేదు.

మౌలిక సదుపాయాలకు పెద్దపీట
పట్టణ, గ్రామీణ మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆర్థికమంత్రి బడ్జెట్‌లో ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ పథకాలు కొన్నింటినీ ఆయన ప్రతిపాదించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రహదార్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యాన్ని ఇస్తున్నట్లు చెప్పారు. కొత్త బడ్జెట్‌లో ప్రణాళికా నిధుల్లో 46 శాతం(రూ.1.73 లక్షల కోట్లు) నిధులు మౌలిక సదుపాయాలకు కేటాయించారు. ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ ఈ ఏడాది మార్చి నాటికి రూ.9,000 కోట్ల సహాయాన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఇస్తే.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీన్ని రూ.20,000 కోట్లకు పెంచుతుందని స్పష్టం చేశారు. విద్యుత్తు రంగానికి నిధుల కేటాయింపును రెట్టింపు చేస్తూ రూ. 5,130 కోట్లు ఇచ్చారు. పరిశ్రమల సొంత అవసరాల కోసం బొగ్గు గనులు(క్యాప్టివ్‌ మైన్స్‌) కేటాయించడానికి టెండరింగ్‌ విధానాన్ని అనుసరిస్తామని చెప్పడం ద్వారా ఈ విభాగంలో పారదర్శకత చోటుచేసుకునే అవకాశం ఏర్పడింది. బొగ్గు నియంత్రణ సంస్థను నెలకొల్పుతామని చెప్పారు. సాంప్రదాయేతర ఇంధన వనరులకు కేటాయింపులు రూ.1,000 కోట్లకు పెంచడం, నేషనల్‌ క్లీన్‌ ఎనర్జీ ఫండ్‌ ఏర్పాటు, తిరుప్పూర్‌, గోవాల్లో పర్యావరణ పరిరక్షణకు నిధులు... మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు.

వ్యవసాయం ఎప్పుడూ వెనక్కే...
ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన వ్యవసాయ రంగానికి మంచి, హామీలే తప్పించి పెద్దగా నిధులు ఒరగబెట్టిందేమీ లేదు ఈ బడ్జెట్‌లో. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనలో భాగంగా వర్షాధార వ్యవసాయం కోసం రూ.300 కోట్లు కేటాయించారు. వాతావరణ ప్రభావాన్ని తట్టుకొని నిలిచే వ్యవసాయ కార్యక్రమానికి రూ.200 కోట్లు కేటాయించారు. బ్యాంకుల వార్షిక వ్యవసాయ రుణ వితరణను ఈ ఏడాదిలో ఉన్న రూ.3.25 లక్షల కోట్ల నుంచి రూ. 3.75 లక్షల కోట్లకు పెంచారు. వ్యవసాయ రుణాల చెల్లింపు గడువును ఈ ఏడాది జూన్‌ 30వ తేదీ వరకూ పొడిగించారు. సకాలంలో రుణాలు చెల్లించేవారికి వడ్డీ రాయితీని 1 శాతం నుంచి 2 శాతానికి పెంచారు. ఐదు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కులు నెలకొల్పాలనే యోచనను వెల్లడించారు. కోల్డ్‌ స్టోరేజీలకు విదేశీ నిధులు లభించే సదుపాయాన్ని ప్రతిపాదించారు. ఇంతకు మించి ప్రణబ్‌ బడ్జెట్‌లో వ్యవసాయ రంగం ప్రస్తావన లేదు. వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని ఇతోధికంగా పెంచేందుకు అనువుగా వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే చర్యలపై ప్రభుత్వానికి దృష్టిలేదు. అదేవిధంగా అధికోత్పత్తి వంగడాల ఆవిష్కరణకు, పరిశోధనా కార్యకలాపాలకు, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఆసక్తి ప్రదర్శించలేదు. పోషకాధారిత ఎరువుల సబ్సిడీ విధానానికి మారుతున్నట్లు ఆర్థిక మంత్రి స్పష్టంచేశారు.

రెండంకెల వృద్ధి అయితే అప్పుడు...
స్వల్పకాలంలో సామాన్యుడి కష్టాల్ని పరిగణలోకి తీసుకోకుండా ఆర్థికవ్యవస్థ స్ధిరత్వం, దీర్ఘకాలిక వృద్ధి బాట మీదే ప్రణబ్‌ ముఖర్జీ దృష్టి సారించారని తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా రెండంకెల వృద్ధి రేటు సాధించాలనేదే ఆయన ఇస్తున్న సంకేతం. దీర్ఘకాలంలో ఆశ కల్పిస్తూ, స్వల్పకాలంలో ప్రజలపై పెనుభారాన్ని మోపేదిగా బడ్జెట్‌ను అర్ధంచేసుకోవచ్చు. స్వల్పకాలంలో ప్రజల కష్టాలను సరిదిద్దేందుకు బడ్జెట్‌ వెలుపల అయినా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాల్సి వస్తుంది. దీన్నలా ఉంచితే, కనీసం అనుకున్నట్లుగా రెండు మూడేళ్లలో రెండంకెల వృద్ధిరేటును అందుకుంటే సరే. కనీసం మంచి భవిష్యత్తు కోసం ఇప్పుడు కష్టాలు పడ్డామనే సంతృప్తి అయినా ప్రజలకు ఉంటుంది. వృద్ధిరేటు 10 శాతాన్ని చేరితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి, సదుపాయాలు మెరుగుపడి, సంపద అధికమై ప్రజల తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు బాగా పెరుగుతాయి. కనీసం దాన్నైనా అనుకున్నట్లుగా సాధిస్తే సరే. అంతదాకా ఎందుకు, ఇప్పుడు మా సంగతేమిటి... అనుకునే సాధారణ ప్రజలకు మాత్రం ప్రణబ్‌ బడ్జెట్‌ చేదు మాత్రే!!