Saturday, February 27, 2010

పన్ను పరిధిలోకి మరో 8 సేవలు

పన్ను పరిధిలోకి మరో 8 సేవలు
న్యూఢిల్లీ: సేవాపన్ను 10% లో మార్పు చేయకపోయినా, పరిధి విస్తరిస్తోంది. ఇప్పటివరకు పన్ను పరిధిలోకిరాని 8 అంశాలు కొత్తగా చేరుతున్నాయి.
కొత్తగా చేర్చినవి: వస్తువులు, సేవలు, కార్యక్రమాల బ్రాండ్‌ ప్రమోషన్‌, వ్యాపార హక్కులపైనా సేవాపన్ను చెల్లించాల్సి ఉంటుంది.

* స్థిరాస్తి అద్దెపైనా సేవా పన్ను చెల్లించాలి. 2007 జూన్‌ 1 నుంచే ఇది అమల్లో ఉన్నట్లు పరిగణిస్తారు.
* ప్రమోషన్‌, మార్కెటింగ్‌, లాటరీతో పాటు లక్కీఛాన్స్‌ ఆటలను ప్రత్యేక సేవ పరిధిలోకి తెచ్చారు.
* బీమా పథకాల కింద అందించే ఆరోగ్య సేవలు, ఒక వ్యాపార సంస్థలోని ఉద్యోగుల కోసం ఆసుపత్రులు లేక ఔషధ సంస్థలు నిర్వహించే వైద్య పరీక్షా శిబిరాలపైనా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
* దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు (అన్ని తరగతులపైనా) సేవాపన్ను వసూలు చేస్తారు.
* సినిమాటోగ్రఫీ ఫిల్మ్‌లు, శబ్ద గ్రాహణంపై కాపీరైట్‌ హక్కుకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే రచన, డ్రామా, సంగీతం, కళానిపుణతపై కాపీరైట్‌ హక్కుకు పన్ను లేదు.
* భవన నిర్మాణదారులు కొనుగోలుదార్లకు కల్పించే ప్రత్యేక సదుపాయాలు, అదనపు చెల్లింపులపై జరిపే అంతర్గత - బాహ్య అభివృద్ధి పనులపైనా పన్ను చెల్లించాల్సిందే. వాహన పార్కింగుకు మాత్రం పన్ను వర్తించదు.
* వ్యక్తి లేదా సంస్థ నిర్వహించే ఏదైనా వాణిజ్య కార్యక్రమానికీ పన్ను వసూలు చేస్తారు. ఒక వ్యాపార సంస్థ ఉద్యోగుల మెడికల్‌ రికార్డుల నిర్వహణ సేవలు, విద్యుత్తు ఎక్స్ఛేంజీలు కూడా పన్నుల పరిధిలోకి వస్తాయి.
* 2009లో ప్రవేశపెట్టిన రైల్వేలో సరకు రవాణాపై సేవా పన్ను

2010-11లో అమలుకానుంది.
ఈసారి మినహాయింపులు: విత్తనాలు, న్యూస్‌ ఏజెన్సీలు
వసూళ్లు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సేవాపన్ను వసూళ్లు రూ.58,000 కోట్లు. 2010-11లో ఈ మొత్తం రూ.68,000 కోట్లకు చేరుతుందని అంచనా. ఇది జీడీపీలో 1 శాతానికి సమానం.