Thursday, February 25, 2010

9 రైళ్లు.. 9 లైన్లు.. రాష్ట్రంపై దీదీకి కాస్త కరుణ

9 రైళ్లు.. 9 లైన్లు
రాష్ట్రంపై దీదీకి కాస్త కరుణ

ఏడింటికి ఆదర్శ స్టేషన్ల హోదా
ఏడు చోట్ల మల్టీ ఫంక్షనల్ కాంప్లెక్స్‌లు
సికింద్రాబాద్‌లో వ్యాగన్ల యూనిట్
పలు రైళ్ల పొడిగింపు, సర్వీసుల పెంపు

navya. (ఆన్‌లైన్- న్యూఢిల్లీ, హైదరాబాద్) 'లేదని ఎప్పుడూ చెప్పకూడదు' అన్నదే తన సిద్ధాంతమని ప్రకటించుకున్న రైల్వే మంత్రి మమతాబెనర్జీ, ఈసారి రైల్వేబడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ విషయంలో అదే సూత్రం అనుసరించినట్టు కనిపిస్తోంది. గత మంత్రులు నితీశ్‌కుమార్, లాలుప్రసాద్ యాదవ్‌లతో పోలిస్తే, ఈసారి ఆమె రాష్ట్రంపై మమత చూపించారు. 2010-11 సంవత్సరానికి బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు 9 కొత్త రైళ్లను ప్రకటించారు. 9 కొత్త లైన్లను ప్రసాదించారు. 7 రైల్వే స్టేషన్లను 'ఆదర్శం'గా తీర్చిదిద్దేందుకు, మరో 7 స్టేషన్ల వద్ద 'మల్టీ ఫంక్షనల్' కాంప్లెక్స్‌ల నిర్మాణానికి, సికింద్రాబాద్‌లో వ్యాగన్ల తయారీ విభాగం ఏర్పాటుకు పచ్చ జెండా ఊపారు.

కొత్త రైళ్లతోపాటు రాష్ట్రానికి అదనపు ప్రయోజనం చేకూరేలా కొన్ని రైళ్లను పొడిగించడంతో పాటు మరికొన్ని సర్వీసుల సంఖ్య కూడా పెంచారు. హామీలన్నీ నెరవేరతాయా అన్న సంగతి పక్కనబెడితే, స్వాతంత్య్రానంతరం, ఆ మాటకొస్తే దక్షిణ మధ్య రైల్వే ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్‌కు రైల్వేబడ్జెట్ ఇంత సానుకూలంగా ఉండడం ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు.

గత ఏడాది రైల్వే బడ్జెట్ ప్రతిపాదనలపై రాష్ట్ర ఎంపీల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మమత, ఈసారి అలాంటి ప్రమాదం ఏర్పడకుండా, జాగ్రత్త పడే ప్రయత్నం చేశారు. సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాజెక్టులను బడ్జెట్‌లో చేర్చారు. 2007-08లో రాష్ట్రానికి కేవలం 4 కొత్త రైళ్లు దక్కగా, 2008-09లో 3, 2009-10లో రెండు మాత్రమే కేటాయించారు. ఈసారి 9 కొత్త రైళ్లను ప్రకటించడం గమనార్హం. నిధుల కేటాయింపు, కొత్త లైన్లు, డబ్లింగ్‌తో పాటు అనేక సౌకర్యాల విషయంలో రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేశారు. దీంతో రాష్ట్రానికి సంబంధించినంత వరకు రైల్వే బడ్జెట్ ప్రతిపాదనలు 'పైన పటారం లోన లొటారం' అన్నట్టుగా ఉన్నాయన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. 9 కొత్త రైళ్లలో నాలుగు రైళ్లు తిరుపతి వెంకన్న వద్దకే ప్రయాణిస్తాయి.

కోటిపల్లి-నర్సాపురంల మధ్య కొత్త మార్గంతో పాటు అనేక ప్రాజెక్టుల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్న మమత వాటి పేర్లను మాత్రం తన బడ్జెట్‌లో ప్రస్తావించారు. వాడరేవు -నిజాంపట్నం మధ్య పోర్టు అనుసంధానానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. నిధుల పరంగా చూస్తే దక్షిణ మధ్య రైల్వేకు కేటాయింపులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. గత ఏడాది బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు రూ. 3,161 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.3,388 కోట్లు. అంటే నిరుటి కన్నా కేవలం రూ. 227 కోట్లు మాత్రమే అదనం అన్నమాట.

ఈ క్రమంలో రాష్ట్రానికి మమత ప్రకటించిన వరాల అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నో రైల్వే ప్రాజెక్టులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండడం, ప్రతిపాదన దశకే పరిమితం కావడం నేపథ్యంలో కొత్తగా ప్రకటించిన వాటి గతీ అంతేనా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. కొత్త లైన్లు, సర్వేలు, అనేక పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రానికి తగిన న్యాయం చేయని రైల్వే మంత్రి ప్రస్తుతం కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపుల విషయంలో కూడా అన్యాయం చేశారు. దేశవ్యాప్తంగా కొత్త రైల్వే లైన్లకు రూ.4,411 కోట్లు కేటాయించగా, ద క్షిణ మధ్య రైల్వేకు కేవలం రూ. 498.10 కోట్లతో సరిపెట్టారు.

మరో 4,500 కోట్లు కేటాయిస్తే కానీ రాష్ట్రంలో రైల్వే లైన్ల నిర్మాణం పూర్తయ్యే అవకాశం లేదు. ఇక గేజు మార్పిడి పూర్తి కావడానికి దాదాపు 700 కోట్లు అవసరం కాగా, ఈ ఏడాది రూ. 112 కోట్లే కేటాయించారు. ఈ లెక్కన రాష్ట్రంలో గేజు మార్పిడి పూర్తి కావడానికి అనేక సంవత్సరాలు పట్టనుంది. ఇక రాష్ట్రంలో రహదారి భద్రతా పనులు, రోడ్ ఓవర్, అండర్ బ్రిడ్జిలకు అరకొర నిధులే కేటాయించారు. ప్రయాణికుల సౌకర్యాలను మెరుగు పరిచేందుకుదక్షిణ మధ్య రైల్వేకు గతేడాది రూ.118 కోట్లను కేటాయించగా, ఈ దఫా రెట్టింపు స్థాయిలో 227 కోట్లు రానున్నాయి.

ప్రశంసనీయం: జయంత్
దక్షిణ మధ్య రైల్వేకు ఏ బడ్జెట్‌లోనూ ఇంత భారీ ఎత్తున ప్రయోజనాలు చేకూరలేదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఎమ్మెస్ జయంత్ పేర్కొన్నారు. ఇది అత్యంత ప్రశంసనీయమైన బడ్జెట్ అని ఆయన బుధవారం తన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో అన్నారు. దేశవ్యాప్తంగా వెయ్యి కిలోమీటర్ల కొత్త లైన్ల నిర్మాణానికి ప్రతిపాదించగా, అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 200 కిలోమీటర్లు ఉన్నట్టు ఆయన వెల్లడించారు. ఇదే ఒరవడి కొనసాగిన పక్షంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం సైతం త్వరలో పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు..