Friday, February 26, 2010

ఉపసంహరణల ఊసెత్తని ప్రణబ్‌

ఉపసంహరణల ఊసెత్తని ప్రణబ్‌

pranab-garuన్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరానికి దేశం 7.5 శాతం వృద్ధి సాధిస్తుందని, వచ్చే ఏడాదికి అది 8 శాతానికి చేరుకుంటుందని ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. ఆర్థిక ఉపసంహరణలు పూర్తిగా కొనసాగుతాయా, పాక్షికంగా ఉపసంహరిస్తారా అనే విషయమై మాత్రం మంత్రి పెదవి విప్పలేదు. ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యాన్ని తట్టుకునేందుకు ఓ ఆర్థిక ఉపకరణంగా సెంట్రల్‌ ఎకై్సజ్‌ ఎంతో తోడ్పడిందని ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. బుధవారం నాడిక్కడ జరిగిన సెంట్రల్‌ ఎకై్సజ్‌ డే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రణబ్‌ మాట్లాడుతూ, డిసెంబర్‌లో పారిశ్రామిక వృద్ధి 16.8గా నమోదు కావడం ఆర్థిక వృద్ధి మెరుగుదలను సూచిస్తోందన్నారు.

దారిద్య్రాన్ని, అక్షరాస్యతను నిర్మూలించేందుకు గాను ఆర్థిక వృద్ధి రెండంకెల స్థాయికి చేరుకోవడం అవసరమని మంత్రి అన్నారు. ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రప్రభుత్వం ఎకై్సజ్‌ డ్యూటీని 6 శాతం మేర, సర్వీస్‌ టాక్స్‌ను 2 శాతం మేర తగ్గించిందని అన్నారు. ఉద్దీపన ప్యాకేజీల కారణంగా కేంద్రప్రభుత్వంపై రూ. 1,86 లక్షల కోట్ల మేరకు భారం పడిందని పేర్కొన్నారు. ఈ ప్యాకేజీలు ఆర్థికలోటును జీడీపీలో 6.2 శాతం మేరకు పెంచాయని అన్నారు. ప్రతిపాదిత జీఎస్‌టీ పై త్వరలోనే ఏకాభిప్రాయం సాధించగలమన్న విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు.