Thursday, February 25, 2010

హ్యుండయ్ సోనాటా కార్ల రీకాల్

హ్యుండయ్ సోనాటా కార్ల రీకాల్
డోర్‌కాల్ లోపాలే కారణం

దేశీయ ఆటో దిగ్గజం మారుతి సుజుకి ఎ-స్టార్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించి రోజు కూడా గడవకముందే రెండో అతిపెద్ద కంపెనీ హ్యుండయ్ సొనాటా కార్లను రీకాల్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ కార్ల ముందు డోర్ లాక్‌లో సమస్యను గుర్తించామని, ఈ లోపాన్ని సవరించడానికి కార్లను వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ వివరించింది.

అయితే.. ఈ ప్రభావం ఇండియన్ మార్కెట్‌పై ఉండదు. కేవలం అమెరికా, కొరియన్ మార్కెట్లలో మాత్రమే విక్రయించిన వైఎఫ్ సొనాటా కార్లలో ఈ లోపం ఉన్నట్లు హ్యుండయ్ ప్రకటించింది. కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో స్వచ్ఛందంగానే రీకాల్ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం సొనాటా ట్రాన్స్‌ఫామ్ మోడల్స్ మాత్రమే ఇండియాలో విక్రయిస్తున్నారు. వైఎఫ్ సొనాటాలను భారతీయ మార్కెట్‌లో హ్యుండయ్ ప్రవేశపెట్టలేదు. రీకాల్‌లో భాగంగా కొరియాలో 46 వేల కార్లను, అమెరికాలో 1,300 కార్లలో లోపాన్ని సవరిస్తారు.

ప్రపంచ ఆటోమోబైల్ దిగ్గజ టొయోటా మోటార్స్ లక్షల సంఖ్యలో కార్లను రీకాల్ చేసింది. ఈ కార్ల వేగం అకస్మాత్తుగా పెరిగిపోతోందని, వీటిల్లో ఫ్లోర్‌మ్యాట్ సమస్యలున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే.. మరమ్మతు చేసినప్పటికీ ఈ కార్లలో సమస్య పూర్తిగా తీరకపోవచ్చని టొయోటా ప్రకటించడం ఆ కంపెనీ ప్రతిష్టను మసకబారుస్తోంది.