Thursday, February 25, 2010

'ప్రైవేటు'పైనే రవాణా భారం!

'ప్రైవేటు'పైనే రవాణా భారం!
తగ్గుతున్న 'గూడ్స్‌'వేగం
ఆదాయ వనరుపై మమత అంతంతే
ఛార్జీల మోతలేదు
కొత్తగా వ్యాగన్ల పథకం
ఆటోమొబైల్‌ హబ్‌ల ఏర్పాటు
న్యూఢిల్లీ: రైల్వేలకు 66శాతం ఆదాయం తెచ్చిపెడుతున్న సరకు రవాణా రంగంపై పెద్దగా మమత చూపలేదు. ఆ రంగాన్ని ఆకర్షించేలా నిర్దిష్టంగా కొత్త ప్రాజెక్టులేవీ ప్రకటించకుండా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తామంటూ రైల్వే మంత్రి సరిపెట్టారు. బుధవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్‌లో మమతా బెనర్జీ ఒక్క ఛార్జీల పెంపు లేదని చెప్పడమే మినహా మిగిలిన అంశాలపై పెద్దగా దృష్టి సారించలేదు. వాస్తవానికి గత ఐదారేళ్లుగా సరకు రవాణా ఆదాయం వాటా తగ్గుతూ వస్తోంది. 2002తో పోలిస్తే బాగా తగ్గింది. ట్రక్కులు ఇతర వాహనాల్లో సరకు రవాణావల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని, ఇంధన భద్రత ప్రమాదంలో పడుతుందని కిరీట్‌ పారిఖ్‌ కమిటీ అభిప్రాయపడింది. విద్యుత్తుతో నడిచే రైళ్లలో సరకు రవాణాను ప్రోత్సహించడంద్వారా ఈ సమస్యను తీర్చవచ్చని సిఫార్సు చేసింది. కానీ ఈ సిఫార్సుల ప్రభావం మమత బడ్జెట్‌పై పడినట్లుగా కనిపించడంలేదు. కిరోసిన్‌, ఎరువుల రవాణా మీద మమత ఇచ్చిన సబ్సిడీ అటు రైతులకుగానీ, ఇటు పరిశ్రమలకు గానీ ఉపయోగపడదు. అది కేవలం ప్రభుత్వంపై సబ్సిడీల భారాన్ని తగ్గించడానికే పనికొస్తుంది. అంతకుమించి భారీ నిర్ణయాలేవీ బడ్జెట్‌లో లేవు.

రవాణా రంగంలో ముఖ్యాంశాలివీ...
* సరకు రవాణాను మరింత ప్రోత్సహించేందుకు వీలుగా ఆధునిక వ్యాగన్ల పథకాన్ని మమత ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఎక్కువ సామర్థ్యంగల ప్రత్యేక వ్యాగన్లను ఉత్పత్తి చేయనున్నట్లు ఆమె తెలిపారు. పూర్తి వివరాలను త్వరలో నోటిఫై చేస్తామని చెప్పారు.
* కంటెయినర్‌ రైళ్ల నిర్వహణలో ప్రైవేటు భాగస్వాములను ఆహ్వానిస్తూ త్వరలో ఒక విధానాన్ని ప్రకటిస్తామని రైల్వేమంత్రి తెలిపారు. వీటిని ఆటోమొబైల్స్‌, కూరగాయలు, నూనెలు, పెట్రో కెమికల్స్‌ రవాణాకు ఉపయోగిస్తామని వివరించారు.
* దేశంలో 10 చోట్ల ఆటోమొబైల్‌ హబ్‌లను ఏర్పాటు చేస్తామని మమత ప్రకటించారు.
* రోడ్డు రవాణాను కలుపుకుని గోదాముల నుంచి గోదాములదాకా సరకు రవాణా చేసేందుకు కొత్త పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతామని మంత్రి వెల్లడించారు. గూడ్స్‌ ర్యాక్‌లను రోడ్డు, రైలు మార్గాల్లో రవాణా చేసేందుకు వీలుగా రూపొందిస్తారు.
* సరకు రవాణా విభాగంలోనూ తత్కాల్‌ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచన ఉందని చెప్పారు. ఇనుప ఖనిజం, ఫ్త్లెయాష్‌, ఆటోమొబైల్‌ రవాణాకు ప్రత్యేక వ్యాగన్లు తయారుచేసే యోచన ఉందని మంత్రి వెల్లడించారు.
* వచ్చే ఆర్థిక సంవత్సరంలో 94.4 కోట్ల టన్నుల సరకు రవాణాను లక్ష్యంగా పెట్టుకున్నామని మమత వివరించారు. గత ఏడాది సవరించిన అంచనా కంటే ఇది 5.4 కోట్ల టన్నులు ఎక్కువ.

సరకు రవాణా ఆదాయం (2008-09లో)
* బొగ్గు: రూ.24,319.56 కోట్లు
* సిమెంటు: రూ.5,600.85 కోట్లు
* ఆహార ధాన్యాలు: రూ.3,698.16 కోట్లు
* ఎరువులు: రూ.3,506.67 కోట్లు
* పెట్రోలియం: రూ.3,472.19 కోట్లు
* కంటెయినర్లు: రూ.3,025 కోట్లు
* 2009-10 ఏడాదిలో సవరించిన ఆదాయం: రూ.58,715.66 కోట్లు
* 2010-11 ఏడాదిలో ఆదాయం అంచనా: రూ.62,489.33 కోట్లు
* ఆదాయంలో పెరుగుదల శాతం: 6.4
* రైల్వే మొత్తం ఆదాయంలో సరకు రవాణా వాటా: 66శాతం