Thursday, February 25, 2010

అక్కడ కుమ్మరింత.. ఇక్కడ చిలకరింత

అక్కడ కుమ్మరింత..
ఇక్కడ చిలకరింత
నష్టాల తూర్పురైల్వేకు నిధుల వర్షం
లాభాలొస్తున్నా దక్షిణమధ్యరైల్వేకు మొండిచేయి
హైదరాబాద్‌ మెట్రోకు పైసా లేదు
న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: వచ్చే ఏడాది బెంగాల్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మమతాబెనర్జీ తన సొంతరాష్ట్ర పరిధిలోని తూర్పురైల్వేకు నిధుల వరద పారించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ఏకంగా రూ.వెయ్యికోట్ల కేటాయింపులు పెంచారు. భారీగా లాభాలు ఆర్జించిపెడుతున్న దక్షిణమధ్యరైల్వేను (మన రాష్ట్ర పరిధిలోనిది) మాత్రం పట్టించుకోలేదు. 2010-11 బడ్జెట్‌ అంచనాల ప్రకారం దక్షిణ మధ్య రైల్వే నికర ఆదాయం 2025.36 కోట్లు, నిర్వహణ వ్యయం 79.7 శాతం. తూర్పురైల్వే విషయానికొస్తే ఆదాయం మైనస్‌ 2975.53 కోట్లు (భారీనష్టాల్లో ఉంది). నిర్వహణ వ్యయం 183.6 శాతం. అంటే మన రాష్ట్రంలో రూ.79 ఖర్చుపెడితే రూ.100 ఆదాయం సమకూరుతుండగా, తూర్పురైల్వేలో రూ.100 ఆదాయానికి రూ.183 ఖర్చు చేయాల్సి వస్తోంది. దక్షిణమధ్య రైల్వే ఇంత మంచి ఫలితాలను సాధించినప్పటికీ.. మమతాబెనర్జీ నిధులను తూర్పురైల్వేపైనే కుమ్మరించారు. మమత రైల్వేమంత్రి కాకముందు ఆ జోన్‌కు 2008-09లో రూ.2133.91 కోట్ల కేటాయింపులు జరపగా, మంత్రి అయిన తర్వాత అది రూ.2989.08 కోట్లకు పెరిగింది. ఒక్క ఏడాదిలో రూ.855.17 కోట్లు అధికం. ఈ ఏడాది ఏకంగా మరో రూ.994.53 కోట్లు పెంచి రూ.3983.61 కోట్లు కేటాయించారు. రైల్వేకు లాభాలు తెచ్చిపెడుతున్న దక్షిణమధ్య రైల్వే స్థితి మాత్రం అంతంతమాత్రమే. 2008-09తో పోలిస్తే 2009-10లో రూ.672 కోట్లు పెంచారు. ఈసారి కేవలం రూ.638.21 కోట్లు మాత్రమే అధికంగా కేటాయించారు. కోల్‌కతా మెట్రోపాలిటన్‌ ప్రాజెక్టుకు రూ.3228.38 కోట్లు ఇచ్చిన మమత హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టుకు పైసా కేటాయించలేదు. హైదరాబాద్‌ ఎం.ఎం.టి.ఎస్‌. రెండో దశకు అయ్యే ఖర్చులో మూడింట రెండొంతులు భరించడానికి రాష్ట్రప్రభుత్వం సిద్ధమైనా మమతాబెనర్జీ ఆ అంశాన్నే పట్టించుకోలేదు.