Saturday, February 27, 2010

మైనారిటీ బతుకు బాగు ఎలా..?

మైనారిటీ బతుకు బాగు ఎలా..?
దేశంలో అతిపెద్ద మైనారిటీ వర్గం ముస్లింలు. వీరి సంఖ్య 17 కోట్ల పైచిలుకు! ఆర్థికంగా, సామాజికంగా వీరెంతటి వెనకబాటుతనాన్నిఅనుభవిస్తున్నారన్నది గోపాల్‌ సింగ్‌ కమిషన్‌(1983), సచార్‌ కమిటీ(2006), రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌(2007)లు ఎత్తిచూపాయి. ముస్లింలు చాలా అంశాల్లో దళితుల కంటే కూడా వెనకబడ్డారని సచార్‌ కమిటీ నిగ్గుతేల్చింది. ప్రభుత్వపరంగా, ముఖ్యంగా బడ్జెట్‌పరంగా ప్రత్యేక చర్యలతోనే తమ అభ్యున్నతి సాధ్యమని ముస్లిం వర్గాలు భావిస్తున్నాయి.
సామాన్యుడి విన్నపమేంటి?
* సగటు ముస్లింలు.. విద్యా, ఉపాధి రంగాల్లో ముందడుగు వేసేందుకు ప్రభుత్వ సహాయం అందించాలి.
* సరైన విద్య, ఉపాధి అవకాశాలు లభించక ఎంతోమంది.. మెకానిక్‌లుగా, చిన్నచిన్న వ్యాపారులుగా, కూలీలుగా అల్పాదాయ వర్గంగా ఉండిపోతున్నారు. వీరు నివసించే ప్రాంతాలు మురికివాడలకు నకళ్లుగా ఉంటున్నాయి.మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలి. ఆడపిల్లల చదువులు, వారికోసం హాస్టళ్లు, గృహ రంగంలో ప్రాధాన్యం వంటివి ఇవ్వాలి.
* ప్రభుత్వం ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న 90 జిల్లాల్లో 'బహుళ రంగ అభివృద్ధి పథకాలు' చేపట్టిందిగానీ.. అక్కడి వెనకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకుంటే కేటాయింపులు చాలా తక్కువ.
*రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ విద్య, ఉపాధి తదితర రంగాలన్నింటిలోనూ 15% (ముస్లింలకు 10%, ఇతర మైనారిటీలకు 5%) రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది. వెనుకబాటుతనానికి గురైన తమకు విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని పలువురు ముస్లింలు కోరుతున్నారు.
బడ్జెట్‌ ఏమిచ్చింది?
మైనారిటీ వ్యవహారాల శాఖకు కేటాయింపులు 50శాతం వరకు పెరిగాయి. ఈ ఏడాది రూ.2,600కోట్లు ఇచ్చారు. గతేడాది ఈ మొత్తం రూ.1,740 కోట్లుగా ఉంది. మైనారిటీలు అధికంగా ఉన్న జిల్లాల్లో అమలు చేసే 'బహుళ రంగ అభివృద్ధి పథకాల'కు ఈ ఏడాది రూ.1,204.20 కోట్లు కేటాయించారు. ఉపకారవేతనాల కేటాయింపులు రెట్టింపు అయ్యాయి. గత సంవత్సరం ప్రీ మెట్రిక్‌లో రూ.180 కోట్లుగా ఉన్న కేటాయింపులు రూ.405 కోట్లకు పెరిగాయి. పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాలు రూ.135.79 నుంచి రూ.238.50 కోట్లకు పెరిగాయి.

* మౌలానా అజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ మొత్తం రూ.13.50 నుంచి రూ.27కోట్లకు వృద్ధి చెందాయి. మైనారిటీ మహిళల్లో నాయకత్వం అభివృద్ధి చేసే కార్యక్రమానికి నిధులు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం రూ.7.2 కోట్లు ఇవ్వగా, ఈ ఏడాది రూ.13.50 కోట్లకు చేరాయి.

రాష్ట్రానికేం ఒరిగింది?
మైనారిటీ విద్యార్థులకు కేంద్రం నేరుగా ఇచ్చే ఉపకార వేతనాలు రెట్టింపు కానున్నాయి. వక్ఫ్‌ ఆస్తుల కంప్యూటరీకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఇది భారాన్ని తగ్గిస్తుంది.