పెట్టుబడి ఆధారిత వృద్ధి బడ్జెట్
చాలా సమతౌల్యంగా, ఆశావహంగా ఉంది. కేటాయింపులు చాలా బాగా ఉన్నాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి, వినియోగం, ఆహార భద్రతకు బడ్జెట్‌లో పెద్దపీట వేయడం సరైన సమయం, దిశగా తీసుకున్న నిర్ణయం. గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, విద్యా రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యం వల్ల దీర్ఘకాలంలో గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగవడమేకాక గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. వ్యవసాయ, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందందే దీర్ఘకాల అభివృద్ధి కొనసాగించడం కష్టం. పారిశ్రామిక రంగం కూడా ఈ బడ్జెట్ నుంచి పెద్దగా ఆశించింది ఏమీ లేదు. ప్రభుత్వం కూడా పారిశ్రామిక రంగంపై భారీ స్థాయిలో ప్రతికూల ప్రభావం పడే నిర్ణయాలు తీసుకోలేదు. కనీస ప్రత్యామ్నాయ పన్ను పెంపు (15 నుంచి 18 శాతానికి) వంటివి మార్పులు ఎప్పుడూ ఉంటాయి. సుంకాలు, ఎక్సైజ్ పన్నులు కొన్ని వస్తువులపై పెంచితే కొన్నింటిపై తగ్గించారు. వైద్య పరికరాలు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలను ప్రోత్సహించడానికి పన్నులు తగ్గించడం హర్షణీయం. ఉద్దీపనలను కూడా పరిమితంగా తగ్గించిన విషయాన్ని గమనించాలి. గత ఏడాది వినియోగ ఆధారిత వృద్ధికి ప్రాధాన్యం ఇవ్వగా.. ఈ సారి పెట్టుబడి ఆధారిత వృద్ధి చర్యలు తీసుకున్నారు. - కె.హరీశ్‌చంద్ర ప్రసాద్, అధ్యక్షుడు, ఫ్యాప్సీ