

హైదరాబాద్ - న్యూస్‌టుడే
ప్రత్యక్షపన్నుల కోడ్‌ను 2011-12 నుంచి అమల్లోకి తెస్తారు. ఆర్థికసర్వేను ప్రవేశపెట్టిన రోజునే 13వ ఆర్థికసంఘం నివేదికను కూడా సభలో ప్రవేశపెట్టారు. కేంద్రపన్నుల రాబడిలో ఇప్పటి వరకూ 30.5 శాతంగా ఉన్న రాష్ట్రాల వాటాను 32 శాతానికి పెంచుతూ 13వ ఆర్థికసంఘం సిఫార్సు చేయడం విశేషం. దీంతో రాష్ట్రాలకు నిధుల లభ్యత మునుపటి కంటే పెరుగుతుంది.
రెండంకెల వృద్ధిరేటుపై ఆశాభావం
బలమైన పునాదులు, సంస్కరణలు, ఉద్దీపన పథకాల మద్దతుతో దేశ ఆర్థికవ్యవస్థ, అంతర్జాతీయ సమాజం విసిరిన మాంద్యం ఉచ్చు నుంచి తట్టుకొని నిలదొక్కుకోవడమే కాకుండా మళ్లీ వృద్ధి పథంలోకి అడుగుపెట్టడాన్ని ఆర్థిక సర్వే సూచిస్తోంది. కొంతకాలంగా ఈ సంకేతాలు కనిపిస్తున్నా... అధికారికంగా ఈ విషయం స్పష్టం కావడం ఇదే ప్రథమం. వచ్చే నాలుగైదేళ్లలో రెండంకెల వృద్ధి రేటు సాధ్యమేనన్న విశ్వాసం సైతం వ్యక్తమవుతోంది.
ఉత్పత్తి రంగం ఉజ్వలం
2011-2012 ఆర్థిక సంవత్సరానికి 9 శాతం వృద్ధి రేటు ఉంటుందని ఆర్థిక సర్వే పేర్కొంది. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు దక్కించుకోవడానికి ఇది తొలిమెట్టు మాత్రమే. ఉత్పత్తి రంగం అనూహ్యంగా కోలుకున్న ఫలితంగా ఇది సాధ్యమవుతోంది. ముఖ్యంగా ప్రైవేటు రంగం పెట్టుబడులు పెరిగి, ఉత్పత్తి రంగం ఊజ్వలంగా కనిపిస్తోంది. మున్ముందు దేశీయ పొదుపు పెరుగుతుందని, పెట్టుబడులు పెరిగి ఆర్థిక వ్యవస్థకు తగినంత ఇంధనం లభిస్తుందని అంచనా కట్టింది. తాజా గణాంకాల ప్రకారం పొదుపు రేటు మన దేశంలో జీడీపీలో 32.5 శాతం నమోదైంది. స్ధూల దేశీయ మూలధన సమీకరణ (క్యాపిటల్ ఫార్మేషన్) జీడీపీలో 34.9 శాతం ఉంది. ఏ ఇతర దేశంలోనూ ఇంత అధిక పొదుపు, మూలధన సమీకరణ లేదు.
ఉద్దీపనలు ఇక చాలు!
మాంద్యాన్ని తట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంలో మూడు దఫాలుగా ఉద్దీపన పథకాలను ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చూడటమే కాకుండా, మళ్లీ వృద్ధి బాట పట్టడానికి ఈ పథకాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇప్పుడు మళ్లీ పరిస్థితి సానుకూలంగా మారినందున ఉద్దీపనలను ఉపసంహరించవచ్చని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. క్రమంగా వీటిని ఉపసంహరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే దీనికి ముందుగా ప్రతి ఒక్క రంగాన్ని కూలంకషంగా విశ్లేషించి ఉద్దీపనలు అవసరం లేదని నిర్ధారణ అయిన పక్షంలో అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అయితే ఎగుమతి ఆధారిత రంగాలకు మాత్రం అవసరాన్ని బట్టి ఉద్దీపనలు ఉండాల్సిందేనని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇంకా పతనావస్థ ప్రమాదం లేనప్పటికీ, మళ్లీ కోలుకుంటున్న సంకేతాలు స్పష్టంగాలేవని, అందువల్ల ఎగుమతులకు మద్దతు కొనసాగాలని అమెరికా, ఐరోపాలను దృష్టిలో పెట్టుకొని వివరించింది. ఎగుమతి ఆధారిత రంగాలకు ఎక్సైజ్ పన్ను తగ్గించాలని సిఫార్సు చేసింది.
ద్రవ్యోల్బణమే ప్రమాదకారి
పెరుగుతున్న ద్రవ్యోల్బణం స్వల్పకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకారిగా పరిణమిస్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది. సరఫరాలు తగినంతగా లేక ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని వివరించింది. ఆహార పదార్ధాల ధరలు అధికంగా ఉండటం దీనికి ప్రధాన కారణం. అధిక ఆహార ద్రవ్యోల్బణం వల్ల సాధారణ ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోయి ప్రమాదం ఏర్పడుతోంది. సాధారణ ద్రవ్యోల్బణం ఇప్పటికే దాదాపు 7 శాతం వరకూ ఉంది. ధాన్యం, గోధుమ నిల్వలు తగినంతగా ఉన్నప్పటికీ వీటి ధరలు పెరగకుండా చూడటంలో ప్రభుత్వం విఫలమైంది. దీని ప్రభావం ఆహార ద్రవ్యోల్బణంపై కనిపిస్తోంది. అవసరాలకు తగ్గట్లుగా వీటి లభ్యతను పెంచితే సరఫరాలు పెరిగి ధరలపై ఒత్తిడి తగ్గుతుందని పేర్కొంది.
ఆర్థిక స్థిరత్వం
లోటు భారంతో కేంద్ర ప్రభుత్వం కుంగిపోతున్న విషయం విదితమే. 2007-08లో జీడీపీలో 2.6 శాతం మాత్రమే ఉన్న ఆర్థికలోటు చూసి భారత ఆర్థిక వ్యవస్థలో నూతన శకం ప్రారంభమైందని హర్షించని వారు లేరు. కానీ ఆ మరుసటి ఏడాది ఆర్థిక సంక్షోభం, మాంద్యం, ఇతర ఒత్తిళ్లతో దేశ ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది. ఉద్దీపన పధకాలు ప్రకటించి ఆర్థిక వ్యవస్థను రక్షించాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆదాయం తగ్గి, ఖర్చులు ఎక్కువయ్యాయి. దీంతో మళ్లీ లోటు భారం ముందుకొచ్చింది. 2008-09లో లోటు 5.9 శాతానికి పెరిగిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2009-10)లో ఇది 6.5 శాతం ఉంటుందని అంచనా. లోటు అదుపు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. ఆర్థిక స్ధిరత్వాన్ని సాధించడానికి ఇదే అదనుగా తగిన చర్యలు అవసరమని అభిప్రాయపడింది.
వృద్ధిబాటలో విద్యుత్‌రంగం
బ్యాంకింగ్, మౌలిక సదుపాయాల రంగం, విదేశీ వర్తకం తదితర రంగాలపై ఆసక్తికరమైన విశ్లేషణను, భవిష్యత్తు ముఖచిత్రాన్ని ఆర్థిక సర్వే అందించింది. ఆర్థిక సంక్షోభం తాకిడికి ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకులు పేకమేడల్లా కూలిపోగా, మనదేశంలో మాత్రం బ్యాంకులు స్థిరంగానే ఉన్నాయి. అధిక మూలధనం అందుబాటులో ఉండటమే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. అయితే బ్యాంకుల నుంచి కార్పొరేట్ రంగానికి తగినంతగా రుణాలు లభ్యం కాలేదని స్పష్టం చేసింది. రిస్కు అధికంగా ఉందని బ్యాంకులు భయపడటమే దీనికి కారణం. బ్యాంకు రుణాల్లో వృద్ధి 2007-08లో 22 శాతం ఉండగా, తదుపరి ఏళ్లలో ఇది వరుసగా 17 శాతానికి చేరుకుని చివరికి 8 శాతానికి పడిపోయింది. మౌలిక సదుపాయాల రంగం సానుకూలంగా కనిపిస్తోందని పోర్టులు, విద్యుత్తు, బొగ్గు రంగాలు మళ్లీ వృద్ధి బాట పట్టాయని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. రహదారుల విభాగంలో ఆశించనంతగా విస్తరణ లేదని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్‌హెచ్‌డీపీ కార్యక్రమం కింద 3,165 కిలోమీటర్ల మేర రోడ్లను విస్తరించాల్సి ఉండగా, దాదాపు 1500 కిలోమీటర్ల పనిని మాత్రమే ఇప్పటి వరకూ చేపట్టారు. అదేవిధంగా కొత్త రోడ్డు కాంట్రాక్టుల జారీ మందకొడిగా ఉంది.
ఆహార భద్రతపై అలక్ష్యం
వ్యవసాయ రంగంలో నిరుత్సాహకరమైన వాతావరణం ఉండటం, ఆహార ధాన్యాల కొరత, అధిక ధరలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సమంజసంగాలేవని ఆర్థికసర్వే విమర్శిచింది. దీనివల్ల ఆహార ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని స్పష్టం చేసింది. దీనిపై ప్రభుత్వం తక్షణం దృష్టి సారించి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. వ్యవసాయ రంగంలో వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 0.2 శాతం క్షీణించింది. ఖరీఫ్‌లో పంటల దిగుబడి తగినంతగా ఉండదనే ప్రచారం అధికంగా జరగడం, రబీలో ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్ల కూడా ఆహార ధాన్యాల ధరలు పెరిగిపోవడానికి తావిచ్చిందని ఆర్థిక సర్వే వివరించింది. అక్రమ నిల్వలు అధికం కావడం కూడా ఇందుకు కారణమని పేర్కొంది. ప్రభుత్వం సత్వరం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించింది. వ్యవసాయ రంగంలో అధిక పెట్టుబడులు పెట్టేవిధంగా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలని కోరింది.
విద్య, వైద్యం
యూనివర్సిటీ విద్య ఫర్వాలేదనిపిస్తున్నా, మనదేశంలో ప్రధానమైన లోపం... పటిష్ఠమైన ప్రాధమిక విద్యా వ్యవస్థ లేకపోవడమే. దీన్ని ఆర్థికసర్వే కూడా ఎత్తిచూపింది. నాణ్యమైన, అత్యున్నత ప్రమాణాలు గల ప్రాధమిక విద్య ప్రస్తుత తక్షణావసరమని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. 'సర్వ శిక్ష అభియాన్' పథకం వల్ల కొన్ని సత్ఫలితాలు వచ్చిన విషయాన్ని ప్రస్తావించింది. సాంకేతిక విద్య విషయంలోనూ దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఆరోగ్య రంగంలోనూ ఉన్నత ప్రమాణాలు అందుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని వివరించింది. ఏ ప్రమాణాల ప్రకారం చూసినా- మనదేశం ఆర్యోగ రంగంలో చైనా, శ్రీలంక వంటి దేశాల కంటే వెనక బడింది- అని సర్వే పేర్కొంది. అంతేగాక దేశంలోని ప్రాంతాల వారీగా చూస్తే ఆర్యోగ ప్రమాణాల్లో సమతౌల్యత లేదనే విషయం బయటపడుతుందని వివరించింది. గ్రామస్థాయి ఆరోగ్య కమిటీలను తొమ్మిది రాష్ట్రాల్లో ఏర్పాటు చేయలేదని స్పష్టం చేసింది.
* 2007లో మౌలిక సదుపాయాల రంగంలో మొదలైన మాంద్యప్రభావం ఇప్పుడు తొలగిపోయింది.
* మన దేశంలో 557.7 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
* ప్రతి ఇద్దరు భారతీయుల్లో ఒకరికి ఫోన్ సదుపాయం ఉంది. 3జీ స్పెక్ట్రమ్‌ను వేలం వేయబోతున్నందున నూతన సాంకేతిక పరిజ్ఞానం, సదుపాయాలూ టెలీకామ్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి.
వ్యవసాయం, ఆహార భద్రతకు సంబంధించి కొన్ని ఆందోళనకరమైన అంశాలను ఆర్థిక సర్వే బయటపెట్టింది. అవి....
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2009-10)లో అత్యధికంగా రెండంకెల్లో ఉన్న ఆహార ద్రవ్యోల్బణం కలవరపెడుతోంది. ఆహార ద్రవ్యోల్బణం ఇతర రంగాలకు విస్తరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
* వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడానికి తగినంత రుణలభ్యతను ప్రభుత్వం కల్పించాలి.