Friday, February 26, 2010

కొత్తలైన్లకు డబ్బులెలా వస్తాయి?

కొత్తలైన్లకు డబ్బులెలా వస్తాయి?
కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి మునియప్ప
రాష్ట్రం ఏటా రూ.500 కోట్లు
కేటాయిస్తేనే పనులు ముందుకు
న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: సామాజిక బాధ్యత కింద లాభదాయకత లేని మార్గాల్లో రైలు మార్గం చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యయాన్ని భరించాల్సిందేనని, వ్యయం భరించినంత మాత్రాన భవిష్యత్తులో లాభాల్లో వాటా పంచే ప్రసక్తి మాత్రం ఉండదని రైల్వేశాఖ సహాయమంత్రి మునియప్ప స్పష్టం చేశారు. ఆయన గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. 'రైల్వే బడ్జెట్‌లో ప్రయాణికులు, సరకు రవాణా ఛార్జీలు పెంచడం లేదు. అలాంటప్పుడు కొత్తలైన్లకు డబ్బులెలా వస్తాయి. అందుకే వ్యయాన్ని భరించమని రాష్ట్రాలను కోరుతున్నాం. రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌ తక్కువ ఉన్నప్పుడు కాస్ట్‌షేరింగ్‌ లేకపోతే లైన్లు రావు' అని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిపాదించిన 11 రైలులైన్ల విషయంలో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు జమ చేయలేకపోతే అని అడిగినప్పుడు 'అలా ప్రతికూలంగా ఎందుకు ఆలోచిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఓకే అని చెప్పడం వల్లే వాటిని తీసుకున్నాం. ఒకవేళ రాష్ట్రం ఇవ్వకున్నా మా దగ్గరున్న డబ్బుతో ప్రారంభిస్తాం' అని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో రైల్వే నెట్‌వర్క్‌ అభివృద్ధి కావాలన్నా వ్యయాన్ని భరించడానికి ఆ రాష్ట్రం ముందుకు రావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఈ లెక్కన 2010-11 రైల్వే బడ్జెట్‌లో పొందుపరిచిన రాష్ట్ర ప్రాజెక్టులు సాకారం అవ్వాలంటే వచ్చే ఐదేళ్లపాటు ఏటా రూ.500 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఈ పథకాలు కాగితాలకే పరిమితమవుతాయని తెలుస్తోంది. మార్చిలో దురంతో..గత బడ్జెట్‌లో ఢిల్లీ-హైదరాబాద్‌ మధ్య ప్రకటించిన దురంతో రైలు మార్చిలో ప్రారంభిస్తున్నట్లు తెలిసింది. ఇంతవరకూ తేదీ ఖరారు కాలేదనీ, అతిత్వరలో ఉంటుందని మంత్రి మునియప్ప చెప్పారు.