Saturday, February 27, 2010

ఇంధన మంట

ఇంధన మంట
పెట్రో ధరల్ని పెంచాలంటూ పారిఖ్‌ కమిటీ సిఫార్సుచేసిన నేపథ్యంలో ఈ బడ్జెట్‌పై సామాన్యుల్లో చాలా ఉత్కంఠ నెలకొంది.
ప్రజలు ఆశిస్తున్నదేమిటి?
* దేశంలోని 20 శాతం మంది అవసరాలకే మొత్తం ఇంధనంలో 80 శాతం ఖర్చవుతున్నప్పుడు.. అందరినీ ఒకే గాటన కట్టి ధరలు ఎందుకు పెంచాలన్నది పలువురి ప్రశ్న. ధరల పెంపులో వినియోగ వర్గాల వారీగా హేతుబద్ధత ఉండాలి.

* నలుగురు కూర్చొనే వీలున్న కారులో ఒకరే ప్రయాణించడం వల్ల చాలా ఇంధనం వృథా అవుతోంది. చౌకరకం కార్లు మార్కెట్లోకి ప్రవేశపెట్టిన తర్వాత మధ్యతరగతి వారూ వాటిని సొంతం చేసుకోగలుగుతున్నారు. నగరాల్లో రోడ్డుభద్రత దృష్ట్యా, ప్రజా రవాణా వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా లేనందువల్ల కార్లవైపు మొగ్గుచూపే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరిస్తే తమకూ ఇంధనవ్యయ భారం తప్పుతుందనేది మధ్యతరగతి భావన. అస్తవ్యస్తంగా ఉన్న రహదారులను సరిచేస్తే పెట్రోలు భారం తగ్గుతుంది.

* వంటగ్యాస్‌ను దొంగచాటుగా వాణిజ్య అవసరాలకు వినియోగించడం వల్ల వృథా ఎక్కువవుతోంది. దాన్ని సమర్థంగా అరికట్టడం వల్ల సామాన్యులపై పెద్దగా భారం మోపాల్సిన అవసరం ఉండదు. సంపన్న వర్గాల్లో వంటగ్యాస్‌ వినియోగం ఎక్కువ. పేదలు, మధ్య తరగతితో సమానంగా వారికీ రాయితీ వర్తింపచేయడం సహేతుకం కాదు.

* నిరుపేద కుటుంబాల్లో దీపపు వెలుగులకు ఇప్పటికీ కిరోసిన్‌పైనే ఆధారపడక తప్పదు. కిరోసిన్‌పై ధరలు పెంచడం కంటే కూడా సౌరవిద్యుత్‌ వంటి ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి తీసుకురావడం అభిలషణీయం.

* సామూహిక బయోగ్యాస్‌ ప్లాంట్లను విరివిగా అభివృద్ధిచేయడం వల్ల కూడా సామాన్యుల ఇంధన అవసరాలు తీరడంతో పాటు చౌకలో లభ్యమవుతుంది.

* పెట్రోల్‌ ధరల నియంత్రణ ఎత్తివేత అంశంపై కిరీట్‌ పారిఖ్‌ నివేదికను ఆ శాఖ మంత్రి మురళీ దేవ్‌రా సరైన సమయంలో పరిశీలిస్తారని ప్రణబ్‌ వెల్లడించారు.
* డీజిల్‌, పెట్రోల్‌పై 7.5%, ఇతర శుద్ధి చేసిన ఉత్పత్తులపై 10% చొప్పున కస్టమ్స్‌ సుంకం విధించారు. ఎక్సైజ్‌ సుంకాన్ని లీటర్‌కు రూపాయి చొప్పున పెంచారు.
* ఫలితంగా పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.2.71, డీజిల్‌ రూ.2.55 చొప్పున పెరిగింది.
* ముడిచమురుపై 5% ఎక్సైజ్‌ సుంకాన్ని విధించారు.

రాష్ట్రానికేం ఒరిగింది?
*పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగినందున రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.565 కోట్ల మేర అమ్మకం పన్ను రాబడి సమకూరనుంది. రాష్ట్రంలో పెట్రోల్‌పై 33%, డీజిల్‌పై 22.25% అమ్మకం పన్ను విధిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం అమ్మకం పన్ను ఆదాయంలో పెట్రోల్‌, డీజిల్‌ ద్వారా రూ.6,500 కోట్ల మేర రావాల్సి వుండగా అదనంగా రూ.565 కోట్లు రానున్నాయి.