Saturday, February 27, 2010

వైద్యానికి సుస్తీ

వైద్యానికి సుస్తీ
ప్రభుత్వాసుపత్రులకు వెళితే అన్నీ కొరతే. చిన్నాచితకా జబ్బులకే దిక్కులేదు. కీలకమైన వైద్య, ఆరోగ్య రంగాన్ని ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. పరిస్థితి ఒక్కరోజులో మార్చలేకపోవచ్చుగానీ ప్రజలు కోరుకుంటున్న 'కనీస' మార్పులేమిటి?
సామాన్యుడి విన్నపమేంటి?
* దేశంలో ప్రైవేటు వైద్యరంగం ప్రియమవుతుంటే ప్రభుత్వ వైద్యం మసకబారిపోతోంది. జీడీపీలో ఆరోగ్యం మీద మన వాస్తవ ఖర్చు 1% దాటటం లేదు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచేందుకు దీన్ని పెంచక తప్పదు.
* మన దేశ జనాభాలో లక్షకు 59 మంది వైద్యులుండగా అభివృద్ధి చెందిన దేశాల్లో వీరి సంఖ్య 200పైనే ఉంది. వైద్యుల సంఖ్య పెంపు ఎంతైనా అవసరం.
* దేశానికి ఏటా 50 వేల మంది వైద్య పట్టభద్రులు అవసరం కాగా, 23 వేల మంది మాత్రమే తయారవుతున్నారు. ప్రైవేట్‌ కళాశాలల్లో ప్రమాణాలు కనీస స్థాయిలో ఉంటున్నాయి.
* ప్రభుత్వాసుపత్రుల్లో వేతనాలు అధమ స్థాయిలో ఉండటంతో వైద్యులెవరూ ముందుకురావటం లేదు. వేతనాలు పెంచటం, ఖాళీలను భర్తీ చెయ్యటం తక్షణావసరం.
* గ్రామీణ భారతంలో 6,800 ఆస్పత్రులు అవసరమని తాజా ఆర్థిక సర్వే తేల్చింది. 2001 జనాభా అవసరాలకే 4,477 ప్రాథమిక, 2,337 సామాజిక ఆరోగ్య కేంద్రాల అవసరం ఉంది. ప్రస్తుత జనాభా ప్రకారమైతే వీటి అవసరం ఇంకా ఎక్కువే.
* ఇప్పటికీ ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, ఇన్‌పేషెంట్‌, ఆపరేషన్‌ థియేటర్‌, ప్రసవ గదులు, రోగ నిర్ధరణపరీక్షలు, ఎక్స్‌రే, ఎమర్జన్సీ కేర్‌ వంటి సౌకర్యాలు లేవు. నిర్వహణ లోపం, సిబ్బంది గైర్హాజరు ప్రధాన సమస్యలు.
* ఇలాంటి సమస్యలన్నింటినీ తీర్చడానికి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ను ప్రారంభించారు. కానీ.. ఇది పలు ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.
* అంటువ్యాధుల్ని అరికట్టటం, టీకాల వంటి ప్రజారోగ్య కార్యక్రమాలకు నిధుల కేటాయింపుల్లో కోత విధిస్తున్నారు. వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
* కేవలం ఆస్పత్రి ఖర్చుల కారణంగానే ఏటా 2 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకు జారిపోతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రిస్తూ, ప్రభుత్వ వైద్యరంగాన్ని పటిష్ఠం చేయాలి.
* 'జననీ సురక్ష యోజన'లో భాగంగా ప్రసవమైన వారికి ప్రోత్సాహకంగా ఇచ్చేందుకు ప్రతి నర్సు వద్ద రూ.5 వేలు అందుబాటులో ఉంచాలి. అయితే ఇవి ఎక్కడా అమలుకావటం లేదు.
* మన దేశంలో ఎక్కువమంది నిత్యం తీసుకునే మధుమేహం, హైబీపీ, యాంటీబయాటిక్స్‌, నొప్పినివారిణి వంటి మందుల ధరలను పరిశ్రమ గణనీయంగా పెంచుతున్నా నియంత్రణ చర్యల్లేవు. ప్రభుత్వపరంగా సుంకాలు తగ్గిస్తూ, ధరల నియంత్రణ చేపడితే మేలు.

బడ్జెట్‌లో ఏమిచ్చారు
* పొగాకు నియంత్రణ కార్యక్రమం కోసం నిధుల్ని రూ.24 కోట్ల నుంచి రూ.39 కోట్లకు పెంచారు.
* పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్‌ డ్యూటీని పెంచారు.
* అన్ని జిల్లాల ఆరోగ్య స్థితిగతుల్ని రూపొందించేందుకు ఈ ఏడాది సర్వే నిర్వహిస్తారు.
* కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కేటాయింపుల్ని రూ.19,534 కోట్ల నుంచి రూ.22,300 కోట్లకు పెంచారు.
* జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌కు రూ.13,910 కోట్లు ఇచ్చారు.
* వైద్య పరికరాలు, ఉపకరణాల డ్యూటీ విధానాన్ని సరళీకరించారు. ప్రత్యేక అదనపు డ్యూటీని ఎత్తివేస్తూ, ఏకీకృత కనీస డ్యూటీని 5 శాతంగా నిర్ణయించారు.
* రిహాబిలిటేషన్‌ ఎయిడ్స్‌, అసిస్టివ్‌ డివైజెస్‌కు మినహాయింపులు కొనసాగింపు.
* ఆర్థోపెడిక్‌ శస్త్రచికిత్సలపై వాడే కొన్ని ప్రత్యేక ఇంప్లాంట్లకు దిగుమతి సుంకం నుంచి మినహాయింపు.
* ఎయిమ్స్‌ బడ్జెట్‌కు అదనంగా రూ.2 కోట్లు ఇచ్చారు.

రాష్ట్రానికి దక్కిందేమిటి..?
* జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ కింద రాష్ట్రానికి గత ఏడాది రూ.860 కోట్లు ఇస్తామని చెప్పి రూ.604.41 కోట్లే విడుదల చేశారు. ఈసారి రాష్ట్రం రూ.1140 కోట్లు అడిగింది. రూ.1075 కోట్లు ఇచ్చినట్లు సమాచారం.