Saturday, February 27, 2010

కొరగాని చదువులు

కొరగాని చదువులు
ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ.. పేరుకు డిగ్రీలు ఘనంగానే ఉంటున్నాయి. ఉద్యోగాల విషయంలోకి వచ్చేసరికి ఈ పట్టాదారులు వెనుక బడుతున్నారు. తగిన నైపుణ్యాలు, పరిజ్ఞానం లేకపోవడమే దీనికి కారణం. ఈ సమస్యకు బీజం ప్రాథమిక విద్యలోనే పడుతోంది. కొద్ది చదువులతో ఆపేసిన వారికి ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటోంది.
సామాన్యుడేం కోరుతున్నాడు?
* పదేళ్లుగా సర్కారు బడులను నిర్లక్ష్యం చేశారు. ప్రైవేటును ప్రోత్సహించారు. చదువు భారమైంది. మా ఆదాయంలో 28 శాతం చదువులకే వెళుతోంది. పరిజ్ఞానం, భావ వ్యక్తీకరణ, ఇతర నైపుణ్యాల్లో ప్రైవేటు-కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివే పిల్లలు మెరుగ్గా ఉంటున్నారు. మెరుగైన, నాణ్యమైన విద్యను మా పిల్లలకూ అందుబాటులోకి తెండి.
* నిరుపేదలకు ప్రాథమిక విద్య ఇప్పటికీ అందని ద్రాక్షే. సర్కారు బడి మాఇంటికి దగ్గరగా ఉండాలి. టీచర్లు రోజూ బడికి రావాలి. మధ్యాహ్న భోజనం శుభ్రంగా, ఆరోగ్య వంతంగా వండినదై ఉండాలి. సగంమంది పిల్లలు బడి మానేస్తున్నారు. మధ్యాహ్న భోజనం బాగుంటే మానేసే వారిసంఖ్య తగ్గుతుంది.

* నలభై శాతం సర్కారీ బడుల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు లేవు. పదిశాతం ప్రాథమిక పాఠశాలల్లో ఒకటే గది. 42 వేల బడులకు భవన వసతి లేదు. ఇలాంటి బడుల్లో ఏం చదవబుద్ది అవుతుంది? ఈ సమస్యల్ని పరిష్కరిస్తే మధ్యలో చదువు మానేసే ధోరణి తగ్గుతుంది. రాజీవ్‌ విద్యామిషన్‌, సర్వశిక్ష అభియాన్‌ల కింద కేంద్రం కోట్లిస్తున్నా రాష్ట్రాల చొరవ శూన్యం. పథకాలను పర్యవేక్షించే వారులేరు.
* నిర్బంధ విద్యాహక్కు చట్టం ఆరేళ్లలోపు పిల్లలకు వర్తించదు. 14 పైబడిన వారికీ వర్తించదు. ఉద్యోగార్హతను సాధించుకునే అవకాశాలను ఈ విధంగా పరిమితం చేసినట్లే.
* విద్యకు జీడీపీలో 3 శాతం ఖర్చు చేస్తున్నారు. విద్యను అందరికీ అందుబాటులోకి తేవడానికి, మెరుగైన, నాణ్యమైన విద్యను అందించడానికి ఈ కేటాయింపులు చాలవు.
* ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల్లో అధ్యాపకుల కొరత 67 శాతం వరకు ఉంది. ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఐఐఎంల్లో సైతం 25 శాతం వరకు అధ్యాపకుల కొరత ఉంది. పరిశ్రమలతో పోల్చుకుంటే వేతనాల్లో భారీ వ్యత్యాసం ఉంటున్న కారణంగా ప్రతిభావంతులు అధ్యాపక వృత్తికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
* లంచమిస్తే వృత్తి విద్య నియంత్రణ సంస్థల్లోని వారు తనిఖీలు చేయకుండానే అనుమతిలిచ్చేస్తున్నారు. యూజీసీ సహా, నియంత్రణ సంస్థలన్నింటినీ రద్దుచేసి, ఉన్నత విద్యా, పరిశోధన మండలిని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అమలుచేయాల్సిన వ్యక్తులు అవినీతికి పాల్పడుతున్నప్పుడు కొత్త వ్యవస్థ సమస్యకు విరుగుడు కాగలదా?

బడ్జెట్‌ ఏమిచ్చింది?
* పాఠశాల విద్య కేటాయింపులు రూ.26,800 కోట్ల నుంచి రూ.31,036 కోట్లకు పెంపు. ఇది కాకుండా రాష్ట్రాలకు 2010-11కు గాను పదమూడో ఆర్థికసంఘం కింద ప్రాథమిక విద్యకు రూ.3,675 కోట్లు అందుతాయి.
* ఉన్నత విద్యకు రూ.11,000 కోట్ల కేటాయింపు. గత ఏడాది ఇది రూ.9,600 కోట్లే.
* విద్యారుణాలపై రాయితీ పథకానికి రూ.500 కోట్లు
* ఉన్నత వృద్ధి రంగాల్లో ఏడాదికి లక్ష మంది చొప్పున పదిలక్షల మంది నిపుణులైన సిబ్బందిని అందుబాటులోకి తెచ్చే నిమిత్తం జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థకు రూ.45 కోట్లతో మూడు ప్రాజెక్టులు ఆమోదం. గత ఏడాది అక్టోబరులో ఈ సంస్థను ప్రారంభించినప్పుడు కేటాయించిన మొత్తం రూ.15 కోట్లు.
* జౌళి, వస్త్ర పరిశ్రమల్లో ఉద్యోగ అవసరాల నిమిత్తం ప్రత్యేక నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం త్వరలో ప్రారంభం.

విద్యారంగానికి సంబంధించి మానవ వనరుల అభివృద్ధి శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించే గణాంకాలను నమ్మలేకున్నాం. తాజా బడ్జెట్‌లో ప్రాథమిక విద్యకోసం ప్రణాళిక పద్దు కింద రూ. 31031 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.2178 కోట్లు కేటాయించారు. ఈ మొత్తం.. బడ్జెట్‌ కేటాయింపులో 3 శాతం మాత్రమే ఉంది. గత ఏడాదితో చూస్తే రూ.8307 కోట్లు మాత్రమే అదనం. విద్యా హక్కు చట్టం అమలుకు కేంద్ర రాష్ట్ర స్థాయి సంస్థలు ఏర్పడిన తర్వాత వనరుల విషయంపై చర్చ జరుగుతుందని ఆశిద్దాం. ఈ బడ్జెట్‌లో ప్రత్యేకంగా వనరులు కేటాయించడంవల్ల ఈ చట్టం అమలుకు రంగం ఏర్పడిందని అనుకోవచ్చు.
- కేఎస్‌చలం, యూపీఎస్సీ సభ్యుడు
రాష్ట్రానికేం ఒరిగింది?
సర్వశిక్ష అభియాన్‌ కింద రూ.1800 కోట్లు రానున్నాయి. మాథ్యమిక శిక్ష అభియాన్‌ కింద రూ.1800 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. సాంకేతిక విద్యకు కేటాయించిన రూ.439.97 కోట్లలో హైదరాబాద్‌ ఐఐటీకి నిధులు రానున్నాయి. 'సాక్షర భారత్‌' కింద రూ.180.7 కోట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తనవంతు రూ.45.18 కోట్లు వెచ్చించాల్సి ఉంది.