Saturday, February 27, 2010

బోషాణానికి 8,000 కోట్ల చిల్లు

బోషాణానికి 8,000 కోట్ల చిల్లు
న్యూఢిల్లీ: ఉద్దీపనల చర్యలు, తగ్గిన ఆర్థిక వృద్ధి కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో రూ.8,000 కోట్ల వరకూ గండి పడనుంది. ప్రభుత్వం అంతక్రితం రూ.6.41 లక్షల కోట్ల వసూళ్లను అంచనా వేయగా.. సవరించిన అంచనాల ప్రకారం ఇవి రూ.6.33 లక్షల కోట్లకే పరిమితం కానుంది. అయితే తాజా ఉద్దీపనల ఉపసంహరణ చర్యల వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం మొత్తం పన్ను వసూళ్లు 16.46 శాతం పెరిగి రూ.7.46 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా. మరో పక్క ఆదాయ శ్లాబుల మార్పిడి వల్ల వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లువచ్చే ఆర్థిక సంవత్సరం చిక్కిపోనున్నాయి. ఈ ఏడాది అంచనా(రూ.1,12,850 కోట్లు) కంటే 10.75 శాతం ఎక్కువగా వ్యక్తిగత ఐటీ వసూళ్లు రూ.1,24,989 కోట్లకు చేరనున్నట్లు సవరించిన అంచనాలు తెలుపుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం మాత్రం ఇవి 6.83% మేర కుంగి రూ.1,20,566 కోట్లకే పరిమితమవుతాయని అంచనా.

ద్రవ్యలోటు 5.5 శాతానికి
2010-11 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటు జీడీపీలో 5.5 శాతంగా నమోదు కాగలదని ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. మొత్తం వ్యయం రూ.11.09 లక్షల కోట్లుగా అంచనా వేయగా.. మొత్తం పన్ను, పన్నేతర ఆదాయం రూ.6.82 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు అంచనా 6.8 శాతంతో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం. లోటును అధిగమించేందుకు ప్రభుత్వం 2010-11 ఏడాదికి రూ.3.81 లక్షల కోట్లను రుణాలు చేయనుంది. ఇక 2011-12కు 4.8%; 2012-13కు 4.1%గా ద్రవ్యలోటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రణబ్‌ పేర్కొన్నారు.

మూడో త్రైమాసికంలో తగ్గిన జీడీపీ: మూడో త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 6 శాతానికే పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 6.2 శాతంగా ఉంది. కాగా, రెండో త్రైమాసికంలో ఇది 7.9 శాతంగా నమోదైన విషయం తెలిసిందే.