సామాన్యుడు ఏం కోరుతున్నాడు?కాలుష్యం కోరల్లో జనావళి బలి కాలుష్యం కోరన చిక్కి విశ్వ మానవాళి విలవిల్లాడుతోంది. వర్ధమాన భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు.రకరకాల కాలుష్యాలు దేశ పర్యావరణానికి గొడ్డలిపెట్టులా తయారయ్యాయి. కాలుష్య నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు కేంద్రం చేస్తున్న అత్తెసరు కేటాయింపుల వల్ల ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు.

* మున్సిపల్ పంపు నుంచి పట్టుకొని తాగేంత స్వచ్ఛంగా నీరు ఉండడం లేదు. కాచి చల్లార్చో, ఫిల్టర్ చేసో తాగాల్సిందే. అనేక ప్రాంతాల్లో జలం గరళాన్ని తలపిస్తోంది. దేశంలో 30 శాతం మురుగునీరు మాత్రమే శుద్ధి అవుతోంది. మిగిలినదంతా నదుల్లోకి, భూగర్భంలోకి చేరుతోంది. నీటి కాలుష్యం జరిగి అనేక జబ్బులొస్తున్నాయి. మురుగునీటి శుద్ధి, సురక్షిత తాగునీటికి ఏర్పాట్లు జరిగితేనే సమస్య పరిష్కారమవుతుంది.
* జల, వాయు కాలుష్యాలకు పరిశ్రమలు ప్రత్యక్ష కారణం. వీటిని నియంత్రించాల్సిన కాలుష్య నివారణ బోర్డు వంటి ప్రభుత్వ వ్యవస్థలు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాయి. దేశంలో కాలుష్యాన్ని అరికట్టాలంటే ఈ వ్యవస్థల్ని, చట్టాల్ని కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది.
* 1947 నుంచి 2002 వరకు దేశంలో తలసరి నీటి లభ్యత 70 శాతం మేరకు పడిపోయింది. వ్యవసాయం కోసం భూగర్భ జలాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది క్రమంగా తీవ్ర నీటి ఎద్దడికి, కరవుకు దారి తీస్తోంది. పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ సమస్యకు పరిష్కారం, జల వనరుల సమర్థ వినియోగం, భూగర్భజల మట్టాల పెంపు.
* మనదేశంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల్లో అత్యధికం బొగ్గుతో నడిచేవే. బొగ్గును మండించటం వల్ల వాతావరణంలోకి కార్బన్‌డయాక్సైడ్ వంటి విషవాయువులు భారీస్థాయిలో విడుదలై భూతాపాన్ని పెంచుతున్నాయి. అంతేగాక, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలు భూమిలో పరిమితంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధనాల ఉత్పత్తి తక్షణావసరం.
* 2007 లెక్కల ప్రకారం దేశంలో తలసరి కర్బన ఉద్గారాలు 1.2 మెట్రిక్ టన్నులు. గ్లోబల్‌వార్మింగ్‌కు కారణమవుతున్న ఈ ఉద్గారాల తగ్గింపునకు ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకోకున్నా.. ఆ దిశగా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటామని కోపెన్‌హాగెన్ సదస్సులో ప్రధాని మన్మోహన్ ప్రకటించారు. కార్యాచరణ ఇప్పుడు కీలకం.
బడ్జెట్ ఏమిచ్చింది..?
లక్ష్యం: 2022 నాటికి 20 వేల మెగావాట్ల సౌరశక్తి ఉత్పత్తి.
నిధి: కాలుష్యరహిత ఇంధనాల అభివృద్ధి, పరిశోధన కోసం జాతీయ పరిశుద్ధ ఇంధన నిధి ఏర్పాటు. దీనికోసం దేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతీ టన్ను బొగ్గుపై రూ.50 వసూలు. దిగుమతి చేసుకునే బొగ్గుకూ ఇది వర్తిస్తుంది.
తగ్గింపులు: సౌరశక్తి, పవనశక్తి ఉత్పత్తి పరికరాలకు ఎక్సైజ్‌సుంకం పూర్తిగా మినహాయింపు. కరెంటును ఆదా చేసే ఎల్‌ఈడీ లైట్లపై నాలుగుశాతం తగ్గింపు. సౌరశక్తి పరికరాలకు కస్టమ్స్‌సుంకంలో ఐదుశాతం తగ్గింపు. ఎలక్ట్రిక్‌కార్ల విడిభాగాలకు కూడా తగ్గింపు. సౌరశక్తితో నడిచే ఆటోరిక్షా విడిభాగాలకు పూర్తి మినహాయింపు.
కేటాయింపులు: సంప్రదాయేతర ఇంధన మంత్రిత్వశాఖకు రూ.1000 కోట్లు (కిందటిసారి కన్నా 60 శాతం అధికం). పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖకు రూ.2,351 కోట్లు (గత ఏడాది రూ.2,045కోట్లు).
* జమ్మూకాశ్మీర్‌లోని లఢక్ ప్రాంతంలో సౌర, జలవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రూ.500 కోట్లు.
* పర్యావరణానికి హాని కలిగించని వ్యవసాయ విధానాల అమలుకు రూ.200 కోట్లు.
* దేశవ్యాప్తంగా చమురు గింజలను ఉత్పత్తి చేసే 60వేల గ్రామాలలో వాటర్‌షెడ్ కార్యక్రమాల అమలుకోసం రూ.300 కోట్లు.
* గంగానది ప్రక్షాళనకు రూ.500 కోట్లు.
* తమిళనాడులోని తిరువూరు అల్లికపరిశ్రమలో పర్యావరణ అనుకూల విధానాల అమలుకోసం రూ.200 కోట్లు.
* సహజవనరుల సంరక్షణ కోసం గోవాకు రూ.200 కోట్లు.
* పశ్చిమబెంగాల్‌లో తీరప్రాంతాల పరిరక్షణకు చర్యలు. ప్రత్యామ్నాయ ఓడరేవు నిర్మాణం.
* మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,73,552 కోట్లు. దీంట్లో మురుగునీటి శుద్ధికి, మంచినీటి సరఫరాకు ఎంత అన్నది స్పష్టం చేయలేదు.
* నగరాల్లోని మురికివాడల అభివృద్ధికి రూ.1,270 కోట్లు (700 శాతం అధికం)