Saturday, February 27, 2010

ప్రస్తుత పరిస్థితుల్లో మేలైన బడ్జెట్‌

ప్రస్తుత పరిస్థితుల్లో మేలైన బడ్జెట్‌
న్నుల మోత, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచడం వంటి కఠిన నిర్ణయాలు ప్రతిపాదించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకుమించిన మంచి బడ్జెట్‌ను ఆశించడం కష్టం. ద్రవ్య లోటును 5.5 శాతానికి పరిమితం చేయాలనుకోవడం సానుకూలాంశం. కొన్ని దేశాల్లో ఇది 10- 12 శాతం వరకూ ప్రమాదకరమైన స్థాయిలో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వృద్ధి పట్టాలు తప్పకుండా, దానికి తప్పనిసరి ఇంధనమైన వినియోగం దెబ్బతినకుండా బడ్జెట్‌ను తయారు చేశారు. ఎన్‌ఆర్‌ఈజీఏ, భారత్‌ నిర్మాణ్‌, విద్య, వైద్యం, వ్యవసాయ రంగానికి రుణవితరణ పెంచడం సానుకూలమైన నిర్ణయాలు. ఎక్సైజ్‌ పన్ను భారం పెంచారనే బాధ ఒకపక్క ఉన్నప్పటికీ, ఆర్థిక లోటును తగ్గించుకోవడానికి ప్రస్తుతానికి ఇంతకంటే దారిలేదు. ద్రవ్యోల్బణం పెరిగిపోతుందనే ఆందోళన కొన్ని వర్గాల్లో ఉంది. కానీ ఇప్పుడు మనదేశం ఉన్న పరిస్థితుల్లో అధిక ద్రవ్యోల్బణం వల్ల ఇబ్బందేమీ లేదు. బ్యాంకుల మూలధన అవసరాలకు రూ. 16,500 కోట్లు కేటాయించారు. బ్యాంకింగ్‌ వ్యవస్థను ఈ నిర్ణయం బలోపేతం చేస్తుంది. వ్యవసాయదార్లకు ఇచ్చిన రుణాల తిరిగి చెల్లింపు గడువును వచ్చే ఏడాది జూన్‌ వరకూ పొడిగించినందున, ఈ రుణ మొత్తం బ్యాంకుల ఖాతాల్లో ఎన్‌పీఏ (నిరర్ధక ఆస్తి) గా కనిపించదు. బ్యాంకింగ్‌ రంగానికి ఇది అనుకూలం.

చమురు సబ్సిడీ ప్రభుత్వ ఆదాయం మీద ఎంతోకాలంగా ఒత్తిడి పెంచుతున్న విషయం విదితమే. దీన్ని ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్‌ ద్వారా తగ్గించే యత్నం చేశారు. పెట్రోలు, డీజిల్‌ మీద ఎక్సైజ్‌ పన్నును ఒక రూ. 1 చొప్పున పెంచడం వల్ల ఈ భారం కొంతమేరకైనా తగ్గుతోంది. పెట్రోలియం సబ్సిడీ మీద ప్రభుత్వం ఏటా రూ.2.80 లక్షల కోట్లు భరించాల్సి వస్తోంది. ఆదాయపు పన్ను స్లాబులు మార్చడం ద్వారా పన్ను చెల్లింపుదార్లకు ఆర్థిక మంత్రి మేలు చేశారు. అంతేగాకుండా అదనంగా రూ. 20,000 దీర్ఘకాలిక ఇన్‌ఫ్రా బాండ్లలో పెట్టుబడి పెట్టి పన్ను రాయితీ పొందే అవకాశాన్ని కల్పించారు. దీనివల్ల పన్ను చెల్లింపుదార్లకు మేలు కలగడంతో పాటు మౌలిక సదుపాయాల రంగానికి నిధుల లభ్యత పెరుగుతుంది.

- కె. కృష్ణంరాజు, సీఎండీ, క్రిసాని వెల్త్‌ మేనేజ్‌మెంట్‌