Thursday, February 25, 2010

మమత అరుదైన రికార్డు

మమత అరుదైన రికార్డు

న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్ల సమర్పణలో మమతా బెనర్జీ అరుదైన రికార్డు సాధించారు. పశ్చిమ బెంగాల్ నుంచి నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టిన తొలి నేతగా చరిత్రకెక్కారు. బీహార్ నుంచి అత్యధికంగా ఏడుగురు రైల్వే మంత్రులు కాగా.. 25 బడ్జెట్లకు రూపకల్పన చేశారు. అందులో జగ్జీవన్‌రామ్‌దే అత్యధిక రికార్డు. ఆయన ఏడు బడ్జెట్లు రూపొందించారు. 1996-98, 2001-04లలో రెండుసార్లు మంత్రిగా ఎన్నికైన నితీష్‌కుమార్ ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. వీటిలో రెండు తాత్కాలిక, నాలుగు సాధారణ బడ్జెట్లు. ఆ తరువాత స్థానం లాలూ ప్రసాద్ యాదవ్‌ది. యూపీఏ హయాంలో ఆయన ఐదు సార్లు(2004-09) బడ్జెట్లను ప్రవేశపెట్టారు.

లాలూతో పాటు లాల్ బహదూర్ శాస్త్రి(ఉత్తర ప్రదేశ్), సీకే జాఫర్ షరీఫ్ (కర్ణాటక) ఐదేసి బడ్జెట్లు సమర్పించారు. ఎన్.గోపాలస్వామి అయ్యంగార్, కమలాపతి త్రిపాఠి (యూపీ), మధు దండావతే (మహారాష్ట్ర), మాధవరావు సింధియా (మధ్యప్రదేశ్)లు నాలుగు చొప్పున, సీఎం పూంచా, కె.హనుమంతియా(కర్ణాటక)లు మూడు చొప్పున బడ్జెట్లు సమర్పించారు. ఏబీఏ ఘనీఖాన్ చౌదురి (పశ్చిమబెంగాల్), బన్సీలాల్ (హర్యానా), రాంవిలాస్ పాశ్వాన్(బీహార్) రెండు బడ్జెట్లు సమర్పించగా.. జాన్ మతాయ్, గుల్జారీ లాల్ నందా, కేదార్ పాండే, జార్జి ఫెర్నాండెజ్, సురేష్ కల్మాడి, జ్ఞానేశ్వర్ మిశ్రా ఒక్కో బడ్జెట్ చొప్పున ప్రవేశపెట్టారు..