Friday, February 26, 2010

'ఆర్థిక' సిఫార్సులు భేష్‌

'ఆర్థిక' సిఫార్సులు భేష్‌
రాష్ట్ర పురోగతికి వూతం: సీఎం
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: పదమూడో ఆర్థిక సంఘం సిఫార్సులు బాగున్నాయని, అవి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి వూతమిస్తాయని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. కమిషన్‌ నివేదికపై సీఎం అభిప్రాయాలను ఆయన కార్యాలయం గురువారం రాత్రి విడుదల చేసింది. ఈ నివేదికను అనుసరించి రాష్ట్రానికి 2010-15 సంవత్సరాలకుగాను కేంద్ర పన్నుల్లో వాటా రూపేణా రూ.1,00,616 కోట్లు, గ్రాంట్ల ద్వారా రూ.13,802 కోట్లు సమకూరుతాయని సీఎం తెలిపారు. 12వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం 2005-10 వరకు కేంద్రం నుంచి రూ.57వేల కోట్ల సాయం మాత్రమే అందిందని చెప్పారు. నివేదికను రూపొందించిన ఛైర్మన్‌, సభ్యులకు, ఆమోదించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నివేదికలోని ముఖ్యాంశాలను సీఎం వివరించారు.

* తాజా నివేదిక ప్రకారం పన్నులు 30.5 శాతం నుంచి 32 శాతానికి పెరుగుతాయి. ఇందులో రాష్ట్ర వాటా 6.93 శాతంగా ఉంటుంది.
* ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాల్లో తాగునీటికి రూ.350 కోట్లు
* గిరిజన ప్రాంతాలలో నీటి సరఫరాకు రూ.200 కోట్లు
* విత్తన నిల్వ పథకానికి రూ.100 కోట్లు
* గ్రేహౌండ్స్‌ ప్రాంతీయ శిక్షణ కేంద్రాలకు రూ.13 కోట్లు
* పోలీసు శిక్షణ కేంద్రాలకు రూ.100 కోట్లు
* జైళ్ల నిర్మాణానికి రూ.90 కోట్లు
* సాంస్కృతిక అభివృద్ధికి రూ.90 కోట్లు
* అగ్నిమాపక సేవలకు రూ.17 కోట్లు
* పురావస్తు ప్రదర్శనశాలల నవీకరణకు రూ.100 కోట్లు
* గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు రూ.200 కోట్లు.
* కాలుష్య నియంత్రణ మండలికి రూ.20 కోట్లు, ప్రజావిధానాల్లో అదనపు సౌకర్యాలకు రూ.20 కోట్లు సమకూరుతాయి.