అంతర్గత అ'భద్రత'! ముంబయి దాడుల తర్వాత దేశ అంతర్గత భద్రత ప్రశ్నార్థకమైంది. ఓ వైపు ఉగ్రవాదం, మరోవైపు నక్సలిజం అంతర్గత భద్రతకు పెను సవాలు విసురుతున్నాయి. కాలం చెల్లిన ఆయుధాలు, ప్రణాళికా లోపాలు, నిధుల కొరత, రాజకీయ సంకల్ప లేమి ప్రజాభద్రతకు శాపంగా మారాయి. అంతర్గత భద్రత బలోపేతానికి ప్రస్తుత బడ్జెట్‌లో గణనీయంగా నిధులు అవసరం.

* ముంబయి తరహా దాడులు మున్ముందు జరగకుండా దేశం రక్షణ వ్యవస్థలన్నీ బలోపేతం కావాలి.
* సరికొత్త పోకడలు పోతున్న తీవ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే ఏదో ఒక వ్యూహం సరిపోదు. అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, భద్రత, నిఘా సంస్థల మధ్య సమన్వయం, ముందస్తు దాడులు, కమెండోలకు శిక్షణ లాంటివి చాలా ముఖ్యం.
* ముంబయి దాడులకు పాల్పడిన తీవ్రవాదులు తీరం గుండానే వచ్చారు. కాబట్టి తీరప్రాంత గస్తీని బలోపేతం చేయాలి.
* అంతర్గత భద్రతకు ఇజ్రాయెల్ పక్కా వ్యూహాల్ని అమలుచేస్తుంది. సరిహద్దు బయటి ప్రమాదాల్ని 'మొస్సాద్', అంతర్గత భద్రతను 'షిన్‌బెట్' గూఢచార సంస్థలు చూసుకుంటాయి. పని విభజన స్పష్టం. మన దగ్గర అలా లేదు. ఈ తరహా లోపాల్ని సరిదిద్దాలి.
* నెదర్లాండ్స్ లాంటి చిన్న దేశాలు సైతం ఉగ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు విమానాశ్రయాల్లో ఫుల్‌బాడీ స్కానర్లను ప్రవేశపెట్టాయి. ఇలాంటివి మన దేశంలోనూ ప్రవేశపెట్టాలన్న వాదన ఉంది.
* నక్సలైట్ల ఏరివేతకు ఉద్దేశించిన ఆపరేషన్ గ్రీన్‌హంట్ లాంటి వాటి వల్ల గిరిజనులకు నష్టం కలగకూడదు. అటవీ ప్రాంతాల్లోని ఖనిజాల్ని పెట్టుబడిదారులకు దోచిపెట్టేందుకే ఈ ఆపరేషన్ అన్న విమర్శల్లాంటివి రాకుండా చూసుకోవాలి.
* 20 రాష్ట్రాల్లో.. 223 జిల్లాల్లో.. 2 వేల పోలీసుస్టేషన్ల పరిధిలో మావోయిస్టు కార్యకలాపాలు సాగుతున్నాయి. దీనికి కారణం స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటినా... మారుమూల పల్లెలు నేటికీ అభివృద్ధికి నోచుకోకపోవడమే. కేంద్రం ఇపుడు గిరిజనాభివృద్ధి మంత్రం విన్పిస్తోంది. ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది.
* దేశంలో అవసరమైన సంఖ్యలో పోలీసుల్లేరు. ప్రతి లక్షమందికి 123 మంది పోలీసులు మాత్రమే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి సూచించిన ప్రకారం అయితే సాధారణ పరిస్థితుల్లో లక్ష మందికి 246 మంది ఉండాలి.
* దేశీయంగా తలెత్తుతున్న వేర్పాటువాద సమస్యలకు సాధ్యమైనంత త్వరగా రాజకీయ పరిష్కారం కనుగొనాలి.
బడ్జెట్ ఏమిచ్చింది..?
* నక్సలైట్లనూ, తీవ్రవాదులను ఎదుర్కొనే పారామిలిటరీకి, ముఖ్యమైన ఇంటిలిజెన్స్‌కూ నిధులను తగ్గించారు. (బ్రాకెట్లలో 2009-10 బడ్జెట్ కేటాయింపులు)
* పారామిలిటరీకి 16 శాతం తగ్గింపుతో రూ. 5,745 కేటాయించారు. (రూ. 6,838.84)
* ఇంటిలిజెన్స్ బ్యూరో: రూ.779.37 కోట్లు (రూ.918.03 కోట్లు)
* జాతీయ భద్రతా దళాల(ఎన్‌ఎస్‌జీ)కు 10 శాతం ఎక్కువ ఇచ్చారు: రూ. 352.58 (రూ.320.63)
* హోంమంత్రిత్వ శాఖకు ఈ సారి 10 శాతం ఎక్కువ నిధులను కేటాయించారు.
* హోంశాఖ: రూ. 37,136.07 (రూ. 33,809 కోట్లు)
* సరిహద్దు రక్షణ: రూ. 1489.28 కోట్లు
* పోలీసు ఆధునికీకరణ: రూ.1975 కోట్లు
* నేరాలనూ, నేరస్థులనూ పసిగట్టే వ్యవస్థ: రూ.175 కోట్లు (రూ. 104 కోట్లు)
* నేషనల్ ఇంటిలిజెన్స్ గ్రిడ్ (నాట్‌గ్రిడ్): రూ. 1.5 కోట్లు
* జాతీయ పరిశోధనా సంస్థ (ఎన్‌ఐఏ): రూ.16.33 కోట్లు (రూ.15కోట్లు)
* ఢిల్లీ పోలీసులు: రూ.2,805 కోట్లు
* కేంద్ర పోలీసు గృహనిర్మాణం: రూ.444 కోట్లు
* పోలీసు విభాగం మొత్తం: రూ.30,000 కోట్లు
* 2009-10 సంవత్సరంలో అంతర్గతభద్రత బాగానే ఉందని ప్రణబ్ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్గత భద్రతకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని చెప్పారు.
* వామపక్ష తీవ్రవాదం ఉన్న 33 జిల్లాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనుల కోసం కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
* వామపక్ష తీవ్రవాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రణాళికా సంఘం... ఒక 'సమీకృత కార్యాచరణ ప్రణాళిక'ను రూపొందిస్తోంది.
* కాశ్మీర్‌లో హింస తగ్గింది. ఈ రాష్ట్రం నుంచి అయిదు పారా మిలిటరీ దళాల్లోకి 2 వేల మంది యువతను తీసుకుంటారు.
రాష్ట్రానికి దక్కిందేమిటి..?
నక్సల్స్: మావోయిస్టుల నిరోధానికి కేంద్రం నుంచి మరింత సాయం రానుంది. పోలీసు వ్యవస్థ ఆధునికీకరణకు రూ.120 కోట్లు ఇస్తున్నారు. ఇది మరింత పెరగనుంది.