Saturday, February 27, 2010

చిట్టాపద్దుల్లోనే పేదరిక నిర్మూలన

చిట్టాపద్దుల్లోనే పేదరిక నిర్మూలన
దేశంలో పేదరిక నిర్మూలన కాగితాల్లోనే తప్ప వాస్తవంలో లేదనడానికి రుజువులెన్నో..! ప్రధాని ఆర్థిక సలహామండలి సారథి సురేష్‌ టెండూల్కర్‌ నేతృత్వంలోని నిపుణుల బృందం 2009 అక్టోబరులో వెలువరించిన నివేదిక దేశంలో పేదరికం 2004-05 నాటికే 37.2 శాతానికి చేరినట్లు తేల్చింది. పట్టణ పేదరికం 26 నుంచి 28 శాతానికి, గ్రామీణ దారిద్య్రం 30 నుంచి ఏకంగా 41.8 శాతానికి విస్తరించినట్లు వెల్లడించింది. పేదరిక నిర్మూలనకు గత నాలుగేళ్లలో రూ.లక్షన్నర కోట్లు కేటాయించామని ప్రభుత్వం లెక్కలు చెబుతున్నా నిజమైన లబ్ధిదారులకు అందింది ఆవగింజంతే.
పేదలు ఏం కోరుతున్నారు..
* ఆహార భద్రత చట్టం కింద దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబానికి చౌకధరపై నెలకు 35 కిలోల బియ్యం లేదా గోధుమలు సరఫరా చేస్తామని 2009-10 బడ్జెట్‌లో హామీ ఇచ్చారు. అమలు అటకెక్కింది. దీన్ని తక్షణం అమలుచేయాలని కోరుతున్నారు.
* పేదరిక నిర్మూలనకు ప్రారంభించిన గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు అవినీతిపరులకు బంగారు బాతు గుడ్డులా మారాయి. ఈ అక్రమాల్ని ఆపాలి.
* అవినీతి రాచపుండుకు శస్త్రచికిత్స చేయకుండా దారిద్య్ర నిర్మూలనకు ఎన్ని నిధులు కేటాయించినా లాభం లేదని అందరూ చెబుతున్న మాట.
* ప్రపంచంలోనే మనది అతిపెద్ద ప్రజాపంపిణీ వ్యవస్థ అని ఓ పక్క చెబుతూనే.. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారిలో 36 శాతం మందికే రేషన్‌ అందుతోందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. లోపం ఎక్కడుందో కనుగొని చికిత్స చేయాలి.
* 5-29 ఏళ్ల వయస్సుల్లో పట్టణ ప్రాంతాల్లో 38%, గ్రామీణ ప్రాంతాల్లో 32% మంది మధ్యలోనే తమ చదువులను వదిలేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించక చదువులకు దూరమయ్యే యువత కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించాలి. కొన్ని వర్గాలకు పరిమితమైన కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న విద్యార్థులందరికీ విస్తరించాలి.
* పాలకుల ఓట్ల రాజకీయం వల్ల పేదలకు అందాల్సిన ఫలాలు అనర్హులకు చేరుతున్నాయి. ఈ విషయాన్ని తేల్చాలని సగటు భారతీయుడు కోరుతున్నాడు.
* వ్యవసాయాభివృద్ధిపై పేదరిక నిర్మూలన ఆధారపడి ఉంది. భారత జీవనాడి వ్యవసాయరంగంపై 60 శాతానికిపైగా ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. కేంద్ర గణాంక సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం వ్యవసాయం మైనస్‌ 0.2% వృద్ధితో తిరోగమన దిశలో ఉంది. ఈసారైనా వ్యవసాయంపై కరుణ చూపాలని సగటు పేద రైతు ఆశిస్తున్నాడు.

బడ్జెట్‌ ఏమిచ్చింది..?
వివిధ పథకాలకు కేటాయింపులు పెరిగినా పేదరిక నిర్మూలనపై ప్రత్యేక దృష్టి కనిపించలేదు. ఆహార భద్రత బిల్లు ముసాయిదా.. అసంఘటిత కార్మికులకు భద్రత.. రాష్ట్రీయ స్వాస్థ్య యోజన విస్తరణ.. కొత్త పింఛన్‌ పథకం ప్రకటించడం ఈ బడ్జెట్‌లో విశేషాలు.
* గృహనిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలనకు రూ.1,000 కోట్లు. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.250 కోట్లు ఎక్కువ.
* మురికివాడల నిర్మూలనలో భాగంగా రాజీవ్‌ ఆవాస్‌ యోజన కింద పట్టణ పేదల గృహ నిర్మాణానికి రూ.1,270 కోట్లు. 2009-10 బడ్జెట్‌ కేటాయింపుల(రూ.150 కోట్లు) కన్నా ఏడు రెట్లు అధికం.
* గ్రామీణాభివృద్ధికి రూ.66,100 కోట్లు.
* భారత్‌ నిర్మాణ్‌ పథకానికి రూ.48 వేల కోట్లు కేటాయించడం ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం.
* గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.40,100 కోట్లు.
* అసంఘటిత రంగ కార్మికుల కోసం రూ.1000 కోట్లతో సామాజిక భద్రతా నిధి (ఎస్‌ఎస్‌ఎఫ్‌). అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతా చట్టం-2008కు అనుగుణంగా ఏర్పాటవుతున్న నిధి. చేనేత, గీత, బీడీ, రిక్షా కార్మికులకు వెన్నుదన్నుగా నిలుస్తుందన్న మంత్రి ప్రణబ్‌.
* గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిరుడు కనీసం 15 రోజులు పనిచేసిన వారికి కూడా వర్తించేలా రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్‌ఎస్‌బీవై) విస్తరణ. ఆర్‌ఎస్‌బీవై కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య బీమా వర్తించేలా కోటికిపైగా స్మార్ట్‌ కార్డులు గతంలోనే జారీ.
* రూ.100 కోట్లతో 'స్వావలంబన్‌' పేరుతో కొత్త పెన్షన్‌ పథకాన్ని(ఎన్‌పీఎస్‌) ప్రకటన. ఈ పథకంలో చేరేవారు కనీసం రూ.1000 నుంచి నుంచి గరిష్ఠంగా రూ.12 వేలు చెల్లిస్తే వారి ఖాతాకు కేంద్రం ఏడాదికి రూ.1000 జమచేస్తుంది.

రాష్ట్రానికేం ఒరిగింది?
* 'జాతీయ సామాజిక భద్రత నిధి'తో రాష్ట్రంలోని 4 లక్షల మంది చేనేత, 6 లక్షల మంది కల్లుగీత, 10 లక్షల మంది బీడీ, 80వేల మంది రిక్షా కార్మిక కుటుంబాలకు మేలు కలుగుతుంది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద రాష్ట్రానికి రెండున్నర రెట్లు అధిక నిధులు మంజూరయ్యాయి. కొత్త బడ్జెట్‌లో ఈ పథకానికి నిధులు రెట్టింపయ్యాయి. దీంతో రాష్ట్రానికి దండిగా వచ్చే అవకాశముంది. మురికివాడల అభివృద్ధి నిధులు 8 రెట్లు పెరగడంతో రాష్ట్రానికి కూడా భారీగానే నిధులు రానున్నాయి. మెట్రోలకు నిధులిస్తున్నందున త్వరలో ఖరారయ్యే హైదరాబాద్‌ మెట్రోకు ఎంతో కొంత వస్తాయి.