Saturday, February 27, 2010

తగ్గిన ఉ'ద్దీప'న వెలుగులు

తగ్గిన ఉ'ద్దీప'న వెలుగులు
న్యూఢిల్లీ:ఉద్దీపనల విషయంలో పూర్తిగా కాకున్నా.. కొంతవరకు అంచనాలు నిజమయ్యాయి. అందరూ ఊహించినట్లు ఎక్సైజ్‌ సుంకంలో 4 శాతం కాకుండా.. కేవలం రెండు శాతం పెంపునకే ఆర్థిక మంత్రి ప్రణబ్‌ పరిమితమయ్యారు.

అన్ని చమురేతర ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాన్ని 8 శాతం నుంచి 10 శాతానికి పెంచుతున్నట్లు ప్రణబ్‌ ప్రకటించారు. దీంతో కార్లు, సిగరెట్లు వంటి వినియోగ వస్తువులు ప్రియం కానున్నాయి. మరో పక్క సేవా పన్నులో ఎలాంటి మార్పు లేకుండా 10 శాతంగానే యథాతథంగా ఉంచారు. పెట్రోలు, డీజిల్‌, బంగారం, వెండి, సిమెంటు వంటి వాటిపై సుంకాలు పెంచారు.

ఖజానాకు ఎంత వస్తుందంటే: పాక్షిక ఉద్దీపనల ఉపసంహరణలో భాగంగా పరోక్ష పన్నుల రూపేణా ప్రభుత్వ ఖజానాకు రూ.46,500 కోట్లు సమకూరుతాయి. మరోపక్క ఆదాయ పన్నులో ప్రతిపాదించిన మార్పుల వల్ల ప్రత్యక్ష పన్నుల రూపంలో వచ్చే ఆదాయం రూ.26,000 కోట్లు తగ్గిపోతుంది. అంటే మొత్తంమీద నికరంగా రూ.20,100 కోట్లు పన్నుల రూపంలో అదనంగా వస్తాయన్నమాట.

ఎవరికి కష్టం: ఉద్దీపనల ఉపసంహరణ నిర్ణయం వాహన, ఉక్కు, సిమెంటు కంపెనీలపై ప్రతికూలంగా పనిచేస్తుంది.

హోటళ్లకు స్టార్‌!
సారి బడ్జెట్‌లో హోటల్‌ రంగం ఆశించిన 'మౌలిక రంగ' హోదా దక్కకపోయినా, ఏప్రిల్‌ 1 తరవాత కార్యకలాపాలు ఆరంభించే హోటళ్ల నిర్మాణం, గుడ్‌విల్‌ తదితర పెట్టుబడులపై పూర్తి పన్ను మినహాయింపులు లభించాయి.

* 2 స్టార్‌ ఆపై తరగతుల హోటళ్లు దేశంలో ఎక్కడ నిర్మించినా, 'పెట్టుబడులకు అనుగుణంగా' 100% పన్ను రాయితీ ఉంటుంది.
* గ్రూపు వ్యాపారాల్లో భాగంగా, భూమి కొనుగోలు మినహా హోటల్‌ నిర్మాణం, నిర్వహణకు అవసరమైన అన్ని పెట్టుబడులకూ ఈ రాయితీలు వర్తిస్తాయని ఆర్థికశాఖ మంత్రి తెలిపారు.
* ఇప్పటివరకు శీతల గిడ్డంగులు, వ్యవసాయ గోదాములు, నేచురల్‌గ్యాస్‌-ముడిచమురు- పెట్రోల్‌ పైపులైన్ల నిర్వహణ, నిర్వహణకు ఇటువంటి రాయితీలు ఇస్తున్నారు.
*సెక్షన్‌ 80 - 1 ఏ ప్రకారం విమానాశ్రయాలు, నౌకాశ్రయాల మాదిరి మౌలిక వసతుల హోదా కల్పించాలని హోటల్‌ రంగం ఆశించింది.