Thursday, February 25, 2010

రేపటి బడ్జెట్‌పై కోటి ఆశలు

రేపటి బడ్జెట్‌పై కోటి ఆశలు

ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ రేపు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌కు చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఆర్థిక మంత్రిత్వశాఖ కొలువుదీరిన సౌత్ బ్లాక్ లో ఆర్థిక శాఖలోని కీలక అధికారులు బడ్జెట్ రూపకల్పనలో రేయింబవళ్లు తలమునకలై ఉన్నారు. ఆర్థిక సంస్కరణల అమలుతో ' ఇన్స్‌పెక్టర్ రాజ్', 'లైసెన్స్ రాజ్' లకు బ్రేకులు పడినప్పటికీ... ఇప్పటికీ కేంద్ర బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థ గమనంలో అత్యంత కీలకమైనదిగానే ఉంటోంది.

కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టిన తరువాత యుపిఎ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. ప్రతిసారి కంటే రెండు రోజులు ముందుగానే పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్ కోసం పారిశ్రామిక, వాణిజ్య వర్గాలతోపాటు, కర్షకులు, వేతన జీవులు ఆసకతితో ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యంసెగ తగలకుండా దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన లక్షన్నర కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీల విషయంలో ఈ బడ్జెట్‌లో తీసుకునే నిర్ణయం కోసం పారిశ్రామిక వర్గాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి.

ఆర్థిక వృద్ధి రేటు మెరుగుపడుతున్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో పెరిగిపోతున్న ద్రవ్య లోటును ఆదుపులో ఉంచేందుకు ఉద్దీపన ప్యాకేజీల పేరిట తగ్గించిన వివిధ సుంకాలను కొంతమేరకైనా పెంచే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కుదుట పడుతోందని, ఆహార ఉత్పత్తుల ధరలు కిందిక దిగిరావాల్సి ఉందని ఈ తరుణంలో ప్రజలపై భారం పడే నిర్ణయాలను రాజకీయాల్లో కాకలు తీరిన ప్రణబ్ ముఖర్జీ తీసుకోకపోవచ్చునన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

వివిధ సుంకాలలో కల్పించిన రాయితీలను తొలగిస్తే పుంజుకుంటున్న పారిశరామిక ఉత్పత్తి మళ్లీ కుంటుపడుతుందన్నది పారిశ్రామిక వేత్తల వాదన. ద్రవ్యలోటు - పారిశ్రామిక వృద్దిని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్‌లో మధ్యే మార్గ నిర్ణయం తీసుకోవచ్చు. దేశంలో 70 శాతం మందికి పైగా ఆధారపడి జీవించే వ్యవసాయరంగం ఉత్పత్తి రేటు భారీగా తగ్గిపోతోంది. తలసరి ఆదాయం పెరుగుతోంది.. తలసరి ఆహార లభ్యత పెరగటం లేదు - దీనిని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్‌లో వ్యవసాయ - గ్రామీణ రంగానికి పెద్దపీట వేసే అవకాశం ఉంది.

ఇక వేతన జీవులు - ఆదాయ పన్ను ప్రతిపాదనలపైనే వారి చూపులన్నీ. ఈ బడ్జెట్‌లో ఆదాయ పన్నుపై ఏవిధమైన రాయితీలు కల్పిస్తారు. పన్ను మినహాయింపు పరిమితిని మరింత పెంచుతారా, లేదా.... మొత్తం మీద దేశంలోని అన్ని వర్గాల జీవితాలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేసే కేంద్ర బడ్జెట్ కోసం నూరు కోట్ల మంది ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.