

లాలు లెక్కల వెనుక కథేంటి?
తన ఐదేళ్ల హయాం(2004-09)లో రైల్వేకు రూ.88,669 కోట్ల మిగులు ఉన్నట్లు రైల్వే మంత్రిగా లాలు లెక్కలు చెప్పారు. ఈ లెక్కల వెనుక ఓ మతలబు ఉందని డిసెంబరు 18న శ్వేతపత్రం విడుదల సందర్భంగా మమత వ్యాఖ్యానించారు. డివిడెండ్లు చెల్లించడానికి ముందున్న నగదు మిగులు, పెట్టుబడికి వినియోగించే మిగులు, 6వ వేతన సంఘం బకాయిల పద్దుల్లోని సర్దుబాటు మొత్తాలు వెరసి రైల్వే ఆదాయాన్ని పెంచాయని వెల్లడించారు. ''డివిడెండ్ల చెల్లింపునకు ముందున్న నగదు నిల్వ, పెట్టుబడికి వినియోగించే మిగులు, తరుగుదల రిజర్వు నిధిని తీసివేస్తే.. లాలు చెప్పిన రూ.88,669 కోట్లు కాస్త రూ.39,411 కోట్లే అవుతుంది. పెట్టుబడి మిగులు రూ.66,804 కోట్ల నుంచి రూ.20,268 కోట్లకు తగ్గుతుంది.'' అని మమతా వెల్లడించారు.
శ్వేతపత్రం ఏమి చెబుతోంది...
*2004-05 నుంచి 2008-09 వరకు లాలు హయాంలో భారతీయ రైల్వే సాధించిన అభివృద్ధి సగటు కంటే తక్కువ.
*గత ఐదేళ్లలో రైల్వేశాఖ వద్ద రూ.89వేల కోట్ల మిగులు నిధులు ఉన్నట్లు చూపారు. నిజానికి ఇది రూ.39,411 కోట్లే.
*జీడీపీలో రైల్వే వాటా ఐదేళ్లుగా 1.18% వద్దే స్థిరంగా ఉంది.
*సరకు రవాణా ఆదాయం 14.11%, ఆహార ఉత్పత్తుల రవాణా ఆదాయం 44%, ఎరువుల రవాణా ఆదాయం 35% పెరిగింది.
*ఎగువ తరగతి, తత్కాల్ ఛార్జీలను స్వల్పంగా పెంచడంతో ఆదాయం 1.27% పెరిగింది.
*లాలు పరిపాలనా కాలం స్వర్ణయుగం కాదు
*రైల్వేలో స్వర్ణయుగంగా చెప్పుకొనే కాలం ఏదైనా ఉంటే... అది పీవీ నరసింహరావు హయాంలో 1991-96 మధ్య సి.కె.జాఫర్ షరీప్ రైల్వే మంత్రిగా పనిచేసిన కాలం. ఈ కాలంలో రైల్వే వ్యవస్థ గొప్ప విజయాలు సాధించింది.