Saturday, February 27, 2010

విమాన ప్రయాణమూ భారమే

విమాన ప్రయాణమూ భారమే
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: బడ్జెట్‌లో సేవా పన్నుల పరిధిలోకి విమాన ప్రయాణికులను కూడా తీసుకు రావడంతో విమానయానం భారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మొదటి, వ్యాపార తరగతుల్లో ప్రయాణించే వారికే సేవల పన్ను వరిస్తుండగా.. తాజాగా దేశీయ ప్రయాణికులపైన కూడా సేవల పన్నును విధించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇప్పుడిప్పుడే విమాన ప్రయాణికులు పెరుగుతున్నారని, తాజా నిర్ణయ ప్రభావం కొంత మేరకైన ప్రయాణికులపై ఉండగలదని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విమానాశ్రయం ప్రాంగణంలో కల్పించే అన్ని సేవలకు వర్తించే విధంగా 'ఎయిర్‌పోర్ట్‌' సేవలన నిర్వచనాన్ని కూడా మార్చనున్నారు. ఎయిర్‌ ఇండియాను పునరుద్ధరించడానికి ఇటీవల కేబినెట్‌ ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1200 కోట్ల ఈక్విటీని అందించాలని నిర్ణయించడం ఆహ్వానించతగిన పరిణామమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. మొదటిగా ప్రభుత్వం రూ.800 కోట్ల మూలధనాన్ని సమకూరుస్తుంది.