Thursday, February 25, 2010

గణగణలు కొనసాగాలంటే..

గణగణలు కొనసాగాలంటే..
టెలికాం
టెలిఫోన్‌ మోగింది.
లెక్కలు, పత్రాలు చూసుకుంటున్న ప్రణబ్‌ అంతగా పట్టించుకోలేదు.

మళ్లీ మోగిందా ఫోన్‌.

ఎవరికేం ఇవ్వాలో.. ఎవరినుంచి ఎంత లాగాలో తీవ్రంగా ఆలోచిస్తున్న ఆర్థిక శాఖామాత్యులకు కొంచెం చిర్రెత్తుకొచ్చింది.

'హలో..' అన్నారు విసురుగా తీసి. ఉహూ.. ఉలుకూ పలుకూ లేదు..

వెంటనే పెట్టేశారాయన. మళ్లీ మళ్లీ మోగింది.

అపుడర్థమయింది ఆయనకు.. టెలికాం రంగానికి బడ్జెట్‌లో ఏమివ్వాలో ఇంకా నిర్థరణకు రాలేదని. మోగుతున్న ఫోన్‌ను బుజ్జగిస్తే అది తన రంగం కోర్కెల చిట్టాను ఇలా గణగణలాడించింది.

'మాంద్యం ప్రభావం పెద్దగా పడని ఏకైక రంగం మాదేనన్న మాట నిజమే కానీ పోటీ కారణంగా గత కొన్నేళ్లుగా మొబైల్‌ ఆపరేటర్లు లాభాలను పోగొట్టుకుంటున్నారు. యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌(యూఎస్‌ఒ) నిధికి లైసెన్సు ఫీజు కడుతున్నారు. ఇంకా ఎక్సైజ్‌ సుంకం, సేవా పన్ను, ఇతర సెస్సులు ఇలా ఎన్నో పన్నులు కడుతున్నాం. మొత్తం మీద కఠిన పన్ను విధానాల నుంచి కొంచెం సడలింపు కావాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. కేంద్ర, రాష్ట్ర స్థాయి పన్నుల స్థానంలో ఏక రూప పన్ను తేవాలని అడుగుతున్నాం. ఆదాయంలో దాదాపు 30 శాతం ఈ పన్నులకే పోతోంది. మౌలిక రంగంలో భాగంగా ఈ రంగాన్ని గుర్తించాలనీ ఆపరేటర్లు కోరుతున్నారు. టెలికాం సామగ్రి తయారీ విభాగం, ఎమ్‌-కామర్స్‌ విభాగాలకు కొన్ని ప్రకటనలు ఉంటాయనీ ఆశిస్తున్నాం. 80Iఎ కింద పన్ను మినహాయింపును 5 నుంచి 10 ఏళ్ల వరకూ పొడిగించాలి. మార్చి 2005 తర్వాత సేవలు ప్రారంభించిన కొత్త టెలికాం సంస్థలకు పన్ను విరామ ప్రయోజనాలను అందించాలి. కొనుగోళ్లు-విలీనాలకు ప్రస్తుతమున్న అస్పష్ట విధానాలు, సంక్లిష్ట పన్ను విధానాలు అడ్డంకిగా ఉన్నాయి. వాటిపైనా దృష్టి సారించాలి. మొత్తం మీద పన్నులు తగ్గించడం; ఎగుమతులను ప్రోత్సహించడంతో పాటు కొన్ని ప్రోత్సాహకాలు, సులభ, చౌక రుణ లభ్యతనూ కోరుకుంటున్నామ'ని గుక్కతిప్పుకోకుండా ఏక బిగిన చెప్పేసింది.

'ఇంతకీ గత బడ్జెట్లో ఇచ్చినవి చెప్పావు కాదే' అన్నారు ప్రణబ్‌ తన కళ్లజోడు సవరించుకుంటూ.

'మీకు తెలియంది ఏముంది.. జాతీయ గ్రామీణ ఉద్యోగ హామీ పథకం(ఎన్‌ఆర్‌ఈజీఎస్‌)కు 144 శాతం పెంపుతో రూ.39,100 కోట్ల నిధులను కేటాయించారు. వినియోగదారులు పెరగడానికి ఇది ఉపకరించింది. మొబైల్‌ ఫోన్‌ తయారీ కోసం దిగుమతి చేసుకునే విడిభాగాలు, వస్తువులపై 4 శాతం కౌంటర్‌వెయిలింగ్‌ సుంకం(సీవీడీ) నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు. తద్వారా మొబైల్‌ ధరలు తగ్గాయ'ని వివరించింది.

'అయితే సరే..'నన్నారు పద్దు పుస్తకాల్లోంచి తలెత్తకుండానే..

'మాపై దయతలుస్తారుగా..' అంటూ నసిగింది టెలిఫోన్‌.

తన మార్కు నవ్వు నవ్వి ఊరుకున్నారు అమాత్యులు. మిగిలిన సినిమా బడ్జెట్‌ తెర మీదే చూడమన్నట్లు.

ఫార్మా
కేటాయింపులు పెంచాలి
పి. భాస్కర నారాయణ
షధ రంగానికి మనదేశం కేంద్రస్థానంగా ఎదుగుతోంది. ముఖ్యంగా జనరిక్‌ ఔషధాల తయారీలో మనకున్న సామర్థ్యం తిరుగులేనిది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఔషధాలను తయారుచేయగల సత్తా మన కంపెనీల సొత్తు. అమెరికాలో పేటెంట్‌ గడువు తీరిన ఔషధాల స్థానంలో ముందస్తుగా జనరిక్‌ మందులను ప్రవేశపెట్టడం ద్వారా ప్రత్యేకమైన మార్కెటింగ్‌ హక్కులను భారతీయ కంపెనీలు పొందుతున్నాయి. అందువల్ల ఓపక్క పేటెంట్‌ హక్కుల పరిరక్షణ, అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడుతూనే జనరిక్‌ ఔషధాల తయారీని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలి. దీనికోసం పేటెంట్‌ హక్కులున్న సంస్థలు, భారతీయ ఔషధ కంపెనీల నుంచి రాయల్టీ తీసుకొని వాటిని తయారుచేసేవిధంగా తగిన వాతావరణాన్ని కల్పించాలి. పరిశ్రమను ప్రోత్సహించడానికి, అనువైన విధానాలను ప్రకటించడానికి కేంద్ర బడ్జెట్‌ కంటే ప్రత్యేకమైన వేదిక ఏముంటుంది గనుక?

* ఔషధ పరిశోధన, మందు ఇచ్చే విధానాలు (డ్రగ్‌ డెలివరీ సిస్టమ్స్‌), ఔషధ పరీక్షలు ప్రస్తుతం ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఈ విభాగాల్లో ఎన్నో పరిశోధనలు సాగుతున్నాయి. మనదేశం వెనుకబడిపోకుండా ఉండాలంటే పరిశోధనను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. పరిశోధనా కార్యకలాపాలు బహుముఖంగా విస్తరించే విధంగా పెద్దఎత్తున గ్రాంట్లు, వడ్డీలేని రుణాలు మంజూరు చేసేందుకు వీలు కల్పించాలి. ప్రస్తుతం ఔషధ పరిశోధనకు కేటాయించిన నిధులు ఎంతో తక్కువగా ఉన్నాయి. నిధుల లభ్యత పెంచడమే కాకుండా, పరిశోధపై ఖర్చు చేసిన నిధుల అకౌంటింగ్‌ నిబంధనల్లోనూ సహేతుకమైన మార్పులు చేయాలి.

* ప్రాణాధార ఔషధాల జాబితాను విస్తరించి మరికొన్ని ఔషధాలు చేర్చాల్సిన అవసరం ఉంది. అంతేగాక ఈ మందుల తయారీకి అవసరమైన ముడిపదార్ధాలు, యంత్రసామగ్రి, పరికరాల దిగుమతిపై కస్టమ్స్‌ పన్నును తొలగించాలి. అంతేగాక వీటిపై దేశీయంగా కూడా ఎక్సైజ్‌ పన్ను లేకుండా చేయాలి.

* మందుల కాంట్రాక్టు తయారీకి మనదేశం కేంద్రస్థానంగా మారుతోంది. దీన్ని మరింతగా ప్రోత్సహించేవిధంగా అన్ని రకాలైన చట్టపరమైన అడ్డుగోడలను తొలగించాలి. పన్నుల తగ్గింపు, సేవల పన్ను వసూలు, థర్డ్‌ పార్టీ కాంట్రాక్టుల్లో ఎక్సైజ్‌ పన్ను వసూలు చేయకపోవడం ట్రాన్సఫర్‌ ప్రైసింగ్‌ నుంచి మినహాయింపు వంటి సదుపాయాలు ఉండాలి. కాంట్రాక్టు తయారీ ద్వారా లభించే ఆదాయంపై తక్కువ ఆదాయపు పన్నును మాత్రమే వసూలు చేయాలి.

* అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన ఔషధాలను భారతీయ కంపెనీలు తయారు చేసి అందించాలంటే, పేటెంట్‌ హక్కులు గల విదేశీ కంపెనీల నుంచి లైసెన్సులు పొందగలగాలి. ఇందుకు అనువైన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించాలి. అంతేగాక ఈ కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆర్జించే ఆదాయంపై పన్ను తక్కువగా ఉండాలి.

* యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి లేనిదే ఔషధాలు తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేయడం కష్టసాధ్యం. అయితే ఈ ప్రమాణాల ప్రకారం ఔషధ కర్మాగారాలు నిర్మించాలంటే... లేదా ప్రస్తుత కర్మాగారాలను ఆ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నదవుతోంది. అందువల్ల ఇటువంటి ఖర్చులపై 'వెయిటెడ్‌ డిడక్షన్‌' అనుమతించాలి.

(రచయిత డైరెక్టర్‌, సీఎఫ్‌ఓ, నాట్కో ఫార్మా)