Saturday, February 27, 2010

కోతలకు కోతలెయ్యాలి

కోతలకు కోతలెయ్యాలి
గ్రామీణ రైతు కోరుకునేది తన భూమికి నీరు పారించడానికి నిరంతరాయ విద్యుత్‌ సరఫరా. ఓ విద్యార్థి కోరుకునేది.. పరీక్షల సమయంలో కోతల్లేని కరెంట్‌. తన ఉపాధికి ఢోకా లేకుండా నిరంతర సరఫరా ఉండాలని కార్మికుడూ, ఉత్పత్తి ఆగిపోకూడదని పారిశ్రామిక వేత్తా కోరుకుంటాడు. మరి వారి ఆకాంక్షలు నెరవేర్చే దిశగా బడ్జెట్‌లో ఎంతవరకు కేటాయింపులు ఉంటున్నాయి?
సామాన్యుడి విన్నపమేంటి?
* సరఫరాలో నష్టాలు దాదాపు 27 శాతం వరకున్నాయి. విద్యుత్‌ చౌర్యం, నాసిరకపు ఉపకరాణాల వినియోగం వంటి వాటివల్ల వృథా ఎక్కువగా ఉంటోంది. వీటిని అరికడితే చాలా వరకు కొరతను అధిగమించొచ్చు.
* ప్రస్తుత అవసరాల్లో దాదాపు 8 శాతం కొరత ఉంది. అధిక వినియోగ వేళల్లో కొరత 15 శాతం వరకుంది. ఈ పరిస్థితిని నివారించాలి.
* గ్రామాల్లో పరిస్థితి మరీ దయనీయం. భారత్‌ నిర్మాణ్‌ కింద 2009 నాటికి 1,25,000 గ్రామాలకు, 2.3 కోట్ల నిరుపేదలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని లక్ష్యం పెట్టుకోగా 67,607 గ్రామాలకు, 83.88 లక్షల నిరుపేదలకు మాత్రమే విద్యుత్‌ సౌకర్యం కల్పించారు.
* విద్యుత్‌ సౌకర్యం ఉన్న పల్లెల్లోనూ కాలాతీతంగా రోజూ కోతలు తప్పడం లేదు. వేసవిలో రోజుకు 12 నుంచి 14 గంటల వరకు కోత ఉంటోంది. నగరాల్లో వేసవిలో 4 గంటల వరకు కోత విధిస్తున్నారు. కోతలకు కోతలెయ్యాలి.
* ప్రతి కుటుంబానికీ విద్యుత్‌ సౌకర్యం కల్పించడంతోపాటు నిరంతరాయ సరఫరా సమాజ అవసరం.
* పదకొండో పంచవర్ష ప్రణాళిక చివరకు 78 వేల మెగావాట్ల సామర్థ్యాన్ని చేర్చాలని లక్ష్యంగా పెట్టుకోగా 2009 నాటికి కేవలం 12 వేల మెగావాట్ల సామర్థ్యాన్ని మాత్రమే చేర్చగలిగారు. సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది.
* సౌర విద్యుత్‌ విధానం అమల్లోనూ పలు సవాళ్లున్నాయి. సౌర విద్యుదుత్పత్తి, నిర్వహణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రభుత్వ రాయితీలేనిదే సాధారణ వినియోగదారుడికి అది పెనుభారం. కానీ క్రమంగా రాయితీలు ఎత్తివేసి రుణాల ద్వారానే సాయం అందించాలన్నది సోలార్‌ మిషన్‌ లక్ష్యం. విద్యుత్‌ ఉత్పత్తి ఎలా జరిగినా జనంపై భారం మోపకూడదు.
* విద్యుదుత్పత్తి భవిష్యత్‌ లక్ష్యాల్ని సాధించడానికి మానవ వనరుల కొరత ప్రధాన సమస్య కానుంది. 12వ ప్రణాళిక లక్ష్యమైన లక్ష మెగావాట్ల అదనపు సామర్థ్యాన్ని సాధించడానికి 7.4 లక్షల మంది అదనంగా అవసరం. అణు విద్యుత్‌ లక్ష్యసాధనకు 2020 నాటికి కనీసం 20 వేల మంది అణు విద్యుత్‌ ఇంజినీర్లు అవసరం కాగా ఏటా దేశంలో తయారవుతున్న నిపుణులు 700 లోపే. వచ్చే ఐదేళ్లలో అమెరికా, బ్రిటన్‌లో 20 శాతం మంది పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ రంగంలో మానవ వనరుల లభ్యత పెద్ద సవాల్‌. 2020కి విధించుకున్న సౌరవిద్యుత్‌ లక్ష్యసాధనకు లక్ష మంది నిపుణులు అవసరం.

బడ్జెట్‌ ఏమిచ్చింది..?
* విద్యుత్‌ రంగానికి రూ.5,130 కోట్లు. రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ కేటాయింపులకు ఇది అదనం. గత ఏడాది విద్యుత్‌ రంగానికి కేటాయింపులు రూ.2,230 కోట్లే.
* పునరుత్పాదక ఇంధన శాఖ ప్రణాళిక వ్యయానికి రూ.1,000 కోట్లు. గత బడ్జెట్‌లో ఇది రూ.620 కోట్లే. పెంపు 61శాతం.
* సౌరవిద్యుత్‌ ఉత్పత్తికి అవసరమయ్యే పరికరాలకు కస్టమ్స్‌ సుంకంలో 5 శాతం మినహాయింపు. వీటికి సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకం నుంచి కూడా మినహాయింపు.
* పవన విద్యుత్‌కు అవసరమయ్యే బ్లేడ్ల తయారీకి కేంద్ర ఎక్సైజ్‌ సుంకం నుంచి మినహాయింపు.
* జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్‌ ప్రాంతంలో చిన్నతరహా
జలవిద్యుత్‌ ప్రాజెక్టులు, సౌరవిద్యుత్‌, సూక్ష్మవిద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు రూ.500 కోట్లు.
* కొత్త ఇంధన వనరుల పరిశోధన నిమిత్తం క్లీన్‌ఎనర్జీ నిధి ఏర్పాటుకు ప్రతిపాదన. ఈ నిధి కోసం బొగ్గుపై టన్నుకు రూ.50 సెస్సు విధింపునకు ప్రతిపాదన. దిగుమతి చేసుకునే బొగ్గుకు కూడా వర్తింపు.
* విద్యుదుత్పత్తి వ్యయం తగ్గించేందుకు మెగాపవర్‌ ప్లాంట్‌ విధానంలో మార్పులు.
* క్యాప్టివ్‌ విద్యుత్‌ ప్లాంట్లకు వేలం ద్వారా బొగ్గు ఖండాల (కోల్‌ బ్లాక్స్‌) సరఫరా.
* బొగ్గుధరలు తదితర అంశాలను పరిశీలించడానికి బొగ్గు అభివృద్ధి నియంత్రణ సంస్థ ఏర్పాటు.